కొత్త వలస విధానాన్ని ప్రకటించిన ట్రంప్
హెచ్-1బి వీసాపై ప్రభావం
భారతీయులకు ప్రయోజనాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిభ, పాయింట్ల ఆధారిత కొత్త వలస విధానాన్ని ప్రకటించారు. ఇప్పుడున్న గ్రీన్ కార్డుల స్థానంలో ‘బిల్డ్ అమెరికా’ వీసా విధానాన్ని తేనున్నారు. అంతేకాక అత్యంత నిపుణులైన శ్రామికుల కోటాను 12 నుంచి 57కు పెంచనున్నారు. దీని వల్ల వేలాది మంది భారతీయులకు ప్రయోజనం కలుగబోతోంది. ప్రపంచం నుంచి ప్రతిభావంతులను ఆకర్షించడంలో ప్రస్తుత వలస విధానం విఫలమైందని ట్రంప్ అన్నారు. తాను ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రతిపాదిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు చెప్పారు. వయసు, తెలివి, ఉద్యోగావకాశాలు, పౌర విజ్ఞానం, ఇంగ్లీషులో ఉత్తీర్ణత, సివిక్ పరీక్షల ఆధారంగా పాయింట్లు ఇచ్చి అమెరికాలో శాశ్వత నివాస అనుమతిని కల్పిస్తామన్నారు. వైట్ హౌస్ రోజ్ గార్డెన్‌లో ఆయన ప్రసంగిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు. దాదాపు 54 ఏళ్ల క్రితం అమెరికా వలస విధానంలో సంస్కరణలు చేశారు. ఆ తర్వాత ఈ విధానంలో మార్పులు చేయడం మళ్లీ ఇప్పుడే. ప్రస్తుతమున్న విధానం వల్ల నైపుణ్యవంతులైన యువతకు అవకాశాలు దక్కట్లేదని, అందుకే ఈ ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రతిపాదించామని ట్రంప్ చెప్పారు. ప్రస్తుతమున్న విధానం ప్రకారం.. అమెరికాలో ఉంటున్న విదేశీయులను వివాహం చేసుకునే వారికి 60శాతం, వేర్వేరు రంగాల్లో నిపుణులైన వారికి 12శాతం కోటాతో గ్రీన్‌కార్డులు జారీ చేస్తున్నారు. అయితే కొత్త విధానంలో నిపుణుల కోటాను 12శాతం నుంచి 57శాతానికి పెంచారు. అవసరమైతే మరింత పెంచుతామని ట్రంప్ వెల్లడించారు. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం పెరుగుతుందన్నారు. కాగా.. హెచ్-1బి వీసాతో అమెరికాకు వెళ్లి గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారత నిపుణులకు తాజా నిర్ణయం మేలు చేయనుందని విశ్లేషకులు చెబుతున్నారు.