ముందుకు సాగని పనులు
ప్రజాపక్షం/హైదరాబాద్: సముద్రతీర ప్రాంతం లేని కారణంగా సరుకు రవాణాకు తెలంగాణ రాష్ట్రంలో పలు అవరోధాలు తలెత్తుతున్నాయి. ఈ కారణంగా డ్రై పోర్టులను ఏర్పాటుచేసి విదేశాల నుండి వచ్చే వివిధ రకాల ఉత్పత్తులు, సరుకులను తరలించేందుకు, రవాణా చేసేందుకు అలాగే నిలువ చేసేందుకు డ్రై పోర్టుల ఏర్పాటు తప్పనిసరవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో సముద్రం లేని కారణంగా ఈ డ్రైపోర్టులను లారీలు, కంటైనర్లు తదితరాలు ఎక్కువగా తిరిగేందుకు వీలుగా ఉన్న జాతీయ రహదారులకు అనుసంధానంగా ఏర్పాటు చేయాలని యోచించింది. నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, అలాగే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, రాజధాని హైదరాబాద్ బాద్ శివారు ఫిర్జాదిగూడ తదితర ప్రాంతాల్లో డ్రైపోర్టులను ఏర్పాటు చేస్తామంటూ ఊరించింది. ఇప్పటికి ఎక్కడ పనులు జరుగుతున్నదీ, ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నదీ కూడా ఇంకా అస్పష్టంగానే ఉంది. ఒక్క ఫిర్జాదిగూడలో తప్ప మరే చొట ప్రస్తుతానికి డ్రై పోర్టు ఏర్పాటు చేయక పోవచ్చని సమాచారం. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో డ్రై పోర్టులు అవసరం లేదు. ఇక్కడ ఇప్పటికే మచిలీపట్నం , కళింగపట్నం, భావనపాడు, నక్కపల్లి , దుగ్గిరాజపట్నంలలో పోర్టులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తోంది. ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోర్టును నిర్మించి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. తెలంగాణలో ఇలాంటి సముద్రతీరం లేక పోవడంతో డ్రై పోర్టుల నిర్మాణమే అనివార్యమవుతోంది.
టిఎస్‌ఐఐసికి ఫిజిబులిటి స్టడీ బాధ్యత
తెలంగాణలో ఎక్కడ ఈ డ్రైపోర్టులను ఏర్పాటు చేయాలి? ఎక్కడ అవసరాలు ఉన్నాయన్న దానిపై తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌళిక సదుపాయాల కల్పన సంస్థ టిఎస్‌ఐఐసికి ప్రభుత్వం అప్పజెప్పింది. తొలి ప్రాధాన్యత నల్లగొండ జిల్లాకు, రెండో ప్రాధాన్యత జహీరాబాద్‌కు, మూడో ప్రాధాన్యత జడ్చర్ల, నాలుగో ప్రాధాన్యత నిజామాబాద్ హైవేను ఎంచుకున్నారు. ఒక డ్రై పోర్టు ఏర్పాటు కావాలంటే కనీసం 500 ఎకరాల నుండి 1500 ఎకరాల భూమి అవసరం కావచ్చని టిఎస్‌ఐఐసి అధికారులు అంచనా వేస్తున్నారు.