గత ప్రభుత్వ బడ్జెట్‌లపై మంత్రి భట్టి
20 శాతం అధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టి భ్రమలు కల్పిస్తే ప్రమాదమని వ్యాఖ్య
అప్పులు కట్టేందుకు అప్పులు చేయక తప్పట్లేదు
ఎఫ్‌ఆర్‌బిఎం పరిధి మేరకు రుణాలు తీసుకుని ముందుకెళ్తాం
ప్రజాపక్షం/హైదరాబాద్ గతంలో మాదిరిగా 20 శాతం అధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టి, వాస్తవాలకు దూరంగా భ్రమలను కల్పిస్తే ప్రమాదం ఏర్పడుతుందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టివిక్రమార్క మల్లు అన్నారు. గత తొమ్మిది బడ్జెట్ సమావేశాల్లో దాదాపు రూ.14 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెడితే, రూ.12 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. గతంలో బడ్జెట్ ప్రతిపాదనలు ఎక్కువ చేసి, ఖర్చులు తక్కువ చేశారని తెలిపారు. వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టామని సభకు చెప్పారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా శాసనసభలో పలువురు సభ్యులు ప్రస్తావించిన అంశాలకు భట్టి విక్రమార్క గురువారం సమాధామిచ్చారు. అసమానతలను తొలగించేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చామన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో సమ, సామాజిక న్యాయం పాటించామన్నారు. గతంలో బడ్జెట్‌ను ప్రతిసారీ 20 శాతం పెంచుకుంటూ పోయేవారని, ప్రతీ బడ్జెట్‌లో కేటాయింపులు పెంచారే తప్ప, ఖర్చు చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వం దళితబంధు, మూడెకరాల భూమికి డబ్బులు ఇవ్వలేదని, తీసుకొచ్చిన అప్పులు తీర్చలేక మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కేటాయింపులు జరిపినా ఖర్చు చేయని వివిధ శాఖలకు సంబంధించిన వివరాలు వివరించారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, ఎవరికి ఎలాంటి ఆపోహలు అవసరం లేదన్నారు. పాత నగరంలో మెట్రోరైల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలను దశలవారీగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎంఐఎం సభ్యుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అభయహస్తం పథకం కోసం వెయ్యికోట్లు కేటాయించామని తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టిల రిజర్వేషన్‌ల పెంపుపై బిఆర్‌ఎస్ సభ్యుడు కడియం శ్రీహరి అడిగిన ప్రశ్నకు చర్చిస్తామని చెప్పారు.
69 రోజుల్లో.. 23,147 పోస్టులు ఇచ్చాం..
గత పదేళ్ల పాలనలో గ్రూప్ 1 పరీక్షలు కూడా నిర్వహించలేకపోయారని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియచేపట్టామని, 69 రోజుల్లో 23,147 పోస్టులను ఇచ్చామని వివరించారు. కేంద్రం నుండి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటికే ఉద్యోగాల జాతర మొదలైందన్నారు. ఇప్పటికే టిఎస్‌పిఎస్‌సి ఏర్పాటు చేశామని, సిబ్బందిని ఇతరాత్ర ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే నోటిఫీకేషన్ ఇస్తామన్నారు.
సామాజిక అసమానతలు తొలగించేలా బడ్జెట్..
రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగించేలా రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు. ఆదాయం, వ్యయం మేరకు బడ్జెట్ ఉండాలన్నదే తమ ఆలోచన అని స్పష్టం చేశారు. పథకాలు, హామీల మేరకు వాస్తవ బడ్జెట్ రూపొందించామన్నారు. గత బడ్జెట్‌లో కేటాయింపుల మేరకు నిధులు అందని పరిస్థితి ఉండేదని, అటువంటి పరిస్థితి రాకుండా వాస్తవ బడ్జెట్ రూపొందించామని స్పష్టం చేశారు. సామాజిక సమానత్వంలో భాగంగా బడ్జెట్‌లో కేటాయించామన్నారు. ఆదాయం, వ్యయం మేరకే బడ్జెట్ ఉండాలనే ఆలోచనతో వాస్తవ పద్దును ప్రవేశపెట్టామన్నారు. బడ్జెట్ కేటాయింపులకు 5 శాతానికి మించి తేడా లేకుండా చూడాలని, గతంలో తెలంగాణ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లుగా ప్రవేశపెడితే ఈసారి బడ్జెట్ రూ.2.75 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టామని వివరించారు. 2023 రూ.70 వేల కోట్ల తేడాతో బడ్జెట్ పెట్టారని, ప్రజలకు ఇచ్చిన హామీలు, అవసరాల మేరకు ఖర్చు పెట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. బడ్జెట్ మేరకు డబ్బులు లేకపోతే ఖర్చు పెట్టకుండా ఎత్తేస్తారన్నారు. రాజస్థాన్‌లో 116.4 శాతం అధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టారని, రాజస్థాన్‌లో బడ్జెట్ కంటే అధికంగా ఖర్చు పెట్టారని, రూ.2.5 లక్షల కోట్లు బడ్జెట్ పెడితే రూ.2.9 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు.
మైనార్టీ, బిసి, ఎస్‌సి రుణాలు ఇవ్వలేదు
గతంలో మైనార్టీ, బిసి, ఎస్‌సి కార్పొరేషన్ రుణాలు ఇవ్వలేదని భట్టి విక్రమార్క అన్నారు. ఇప్పటికే చేసిన అప్పులు కట్టేందుకు అప్పులు చేయక తప్పట్లేదని, ఎఫ్‌ఆర్‌బిఎం పరిధి మేరకు రుణాలు తీసుకుని ముందుకెళ్తామని తెలిపారు. రాష్ట్రంపై మొత్తం రూ.7.11 లక్షల కోట్లు అప్పుల భారం ఉందన్న భట్టి, బడ్జెట్, బడ్జెటేతర రుణాలను ఎఫ్‌ఆర్‌బిఎం కింద చూస్తామని కేంద్రం చెప్పిందని వెల్లడించారు. ఎఫ్‌ఆర్‌బిఎం పరిధి మేరకు గతంలో రుణాలు కుదించారన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై సభ్యులు సంతృప్తి చెందుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
కూనంనేని మంచి సూచనలు చేశారు
బడ్జెట్ ఫలాలు ప్రతి పేదవాడికి అందాలనే సూచన చేసిన కూనంనేని సాంబశివ రావు సలహాలను స్వీకరిస్తామన్నారు. కూనంనేని మంచి సూచనలు చేశారని, ఆరు గ్యారంటీలపై ఎన్నికల్లో వారు కూడా ప్రచారం చేశారని, వారిని కూడా ప్రజలు అడుగుతారన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, అసంఘటిత రంగాలలో పనిచేసే కార్మికులకు ఉద్యోగ విరమణ అనంతరం జీవన భృతి కోసం పెన్షన్ సౌకర్యం కల్పించే అంశాన్ని సూచించారని, ఈ అంశం చాలామంచిందని, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతినెల 10 నుంచి 15 వరకు పెన్షన్ వస్తే పనులు చేయలేని పరిస్థితుల్లో కూడా వారికి భరోసా ఉంటుందన్నారు.
ప్రతిపాదనలెక్కువ… ఖర్చు తక్కువ
RELATED ARTICLES