17,18 తేదీల్లో బెంగళూరు మీట్‌కు 24 పార్టీలకు ఆహ్వానం
న్యూఢిల్లీ : బెంగళూరులో ఈనెల 17,18 తేదీలలో ప్రతిపక్షాల రెండో సమావేం జరుగుతుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ పూర్వాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా హాజరవుతున్నారు. ఈ రెండు రోజుల సమావేశంలో ఈసారి బిజెపి యేతర పార్టీలకు చెందిన 24 పార్టీల నాయకులు పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు సన్నాహాల్లో భాగంగా జరుగుతున్న ప్రతిపక్ష నేతల సమావేశాల్లో ఇది రెండోది. పాట్నాలో నితీశ్ కుమార్ చొరవతో తొలి సమావేశం గతనెల 23వ తేదీన జరిగింది. ఆ సమావేశంలో కేవలం 15 పార్టీల నాయకులు మాత్రమే పాల్గొన్నారు. 17వ తేదీ జరిగే డిన్నర్ సమావేశంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పాల్గొంటారని అంచనావేస్తున్నారు. మరునాడు మరింత కీలక భేటీ జరుగుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు తగిన వ్యూహాలను సమావేశంలో పార్టీల నాయకులు రూపొందిస్తారని భావిస్తున్నారు. ఎండిఎంకె, కెడిఎంకె, విసికె, ఆర్‌ఎస్‌పి ఫార్వర్డ్ బ్లాక్, ఐయుఎంఎల్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి) పార్టీలు కూడా ఈ రెండో విడత సమావేశానికి హాజరవుతాయని వర్గాలు తెలియజేశాయి. ఇప్పటికే ప్రతిపక్షాలకు చెందిన సీనియర్ నాయకులు ఈ సమావేశ ఆహ్వానాలు అందుకున్నారు. డిన్నర్ మీటింగ్ తోపాటు మరునాడు కీలక సమావేశం జరుగుతుంది. ఈ మొత్తం 24 పార్టీలకు కలిపితే లోక్‌సభలో ప్రస్తుతం 150 సీట్ల బలం ఉంటుంది. అయితే రానున్న ఎన్నికల్లో తమ పరిధిని మరింత విస్తరించాలని, మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని ప్రతిపక్షాలు గట్టిపట్టుదలతో ఉన్నాయి. పార్టీల మధ్య ఐక్యత సాధించేందుకు కూడా ఒక విస్తారమైన ప్రణాళిక రూపొందించాలనే ఉద్దేశంతో సమావేశాల్లో చర్చ లు జరుగుతాయి. దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా నియోజకవర్గాలలో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే ఉద్దేశం కూడాఈ చర్చల్లో ప్రముఖంగా ముందుకు వస్తుందని వర్గాలు పేర్కొన్నాయి. పాట్నా మీట్‌కు 16 పార్టీలను ఆహ్వానించగా 15 పార్టీలు
హాజరయ్యాయి. ఆర్‌ఎల్‌డి పార్టీకి చెందిన జయంత్ చౌధురి తన కుటుంబ సంంధమైన ఫంక్షన్ కారణంగా ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారు. ఈ విషయం ఆయన ముందుగానే నిర్వాహకులకు తెలియజేశారు కూడా. బెంగళూరు సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఆహ్వానించారు. అయితే కాంగ్రెస్‌పార్టీ గనుక కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా తమకు మద్దతు ఇవ్వాలని, పార్లమెంటు సమావేశాల్లో సంఘీభావం ప్రకటించాలని లేకపోతే తాము ఇక ఈ సమావేశాలకు వచ్చే అవకాశం లేదని పాట్నా మీట్‌లోనే కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పార్టీలన్నీ బెంగళూరు బాట పడుతున్నాయి, సోనియాగాంధీని కూడా ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా కోరాం, ఆమె ఈ సమావేశంలో పాల్గొంటున్నారన్న సందేశం కూడా మాకువచ్చింది అని కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ సోమవారం మీడియాకు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ కూడా ఈ సమావేశం తేదీలగురించి వివరిస్తూ, ఫాసిస్టు, అప్రజాస్వామిక శక్తులను ఎన్నికల్లో ఓడించేందుకు ఏ మాత్రం ఊగిసలాట ధోరణి లేకుండా చాలా విశ్వాసంతో తీర్మానం చేసుకుని వేగం పుంజుకుంటున్నామని అన్నారు. పార్టీలో ప్రతిపక్షాల తొలి సమావేశం ఘన విజయం సాధించిన తరువాత ప్రతిపక్షాలలో విశ్వాసం పెరిగిందని కాంగ్రెస్‌పార్టీ చాలా నిష్ఠగా బాధ్యతలు నిర్వహిస్తోందని చెప్పారు. రాబోయే పరిస్థితలను దీర్ఘదృష్టితో పరిశీలిస్తున్నామన్నారు.