బిజెపి గడగడా వణికిపోతోంది : ఖర్గే
బెంగళూరు : ప్రతిపక్షాల బెంగళూర్ మీట్ సోమవారం రెండు గంటలపాటు జరిగింది. మోడీ ప్ర భుత్వం తిరిగి అధికారంలోకి రాకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐక్యంగా అడ్డుకోవాలనే లక్ష్యంతో ఏకమైన దేశ ప్రతిపక్షాల రెండో సమావేశం మంగళవారం కూడా కొనసాగుతుంది. ప్రతిపక్షాల ఈ సమావేశం భారత రాజకీయ ముఖచిత్రం, రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుందని కాంగ్రెస్‌పార్టీ ఈ సందర్భంగా ఉద్ఘాటించిం ది. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రతిపక్ష నాయకులు ఉమ్మడిగా పరిష్కారాలు సాధిస్తారని పేర్కొంది. “ఐక్యతకే కట్టుబడ్డాం” అనే నినాదంతో జరుగుతున్న ఈ రెండు రోజుల కీలక చర్చలలో 26 పార్టీలకు చెందిన నాయకులు పాల్గొంటున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆతిథ్యం ఇస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, తృణమూల్ కాం గ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమ్‌ఆద్మీపార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అగ్రనేత ఎం.కె.స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి, ఆర్‌జెడి నాయకుడు నితీశ్ కుమార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సిపిఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ పూర్వాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆర్‌జెడి నాయకుడు లాలూప్రసాద్ యాదవ్ తదితరులు సమావేశానికి వచ్చినవారిలో ఉన్నారు. సంక్షోభంలో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత శరద్‌పవార్ తన అన్న కొడుకు అజిత్ పవార్‌తో చర్చల్లో ఉన్నందువల్ల, మంగళవారం రెండోరోజు తన కుమార్తె సుప్రి యా సూలేతో కలిసి సమావేశానికి హాజరవుతా రు. బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, సమాజ్‌వాదీపార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫారూఖ్ అబ్దు ల్లా, పిడిపి నాయకురాలు మెహబూబా ముఫ్తి, ఆ ర్‌ఎల్‌డి నాయకుడు జయంత్ చౌధురిలకు తొలు త ఘనస్వాగతం లభించింది. వీటితోపాటు శివసేన (యుబిటి), జెడియు, ఎస్‌పి, ఎండిఎంకె, కెడిఎంకె, విసికె,
ఆర్‌ఎస్‌పి, సిపిఐ ఫార్వర్డ్ బ్లాక్, ఐయుఎంఎల్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి), కృష్ణ పటేల్‌కు చెందిన అప్నా దళ్ (కమెరవాది), ఎం.హెచ్.జవహిల్లా నాయకత్వానగల తమిళనాడు మణిథానేయ మక్కల్ కశ్చి (ఎంఎంకె) నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ 26 పార్టీలూ దేశంలో 150 లోక్‌సభ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. బిజెపి గడగడ వణికిపోతోందని మల్లికార్జున ఖర్గే అన్నారు. తమను విభజించడం కోసం బిజెపి చేస్తున్న ప్రయత్నాలను ఐక్యంగా ఎదుర్కొంటామని, వారి కుట్రలను సాగనివ్వబోమని ఆయన అన్నారు. తానొక్కడే ప్రతిపక్షాలందరినీ ఓడిస్తానని చెబుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇప్పుడు ఎన్‌డిఎలో 30 పార్టీలను ఎందుకు ఒకచోట మళ్ళీ పోగుజేస్తున్నారని ప్రశ్నించారు.
టిఎంసి నాయకుడు డెరెక్ ఓ బ్రెయిన్ మాట్లాడుతూ, ఎన్‌డిఎలో ఉన్న ఎనిమిది పార్టీలకు ఒక్క ఎంపి వంతున కూడా లేరని అన్నారు. తొమ్మిది పార్టీలకు ఒక్కొక్కరు వంతున ఎంపి ఉన్నారని, మూడు పార్టీలకు ఇద్దరు వంతున ఎంపిలు ఉన్నారని అన్నారు. బిజెపిపై కాంగ్రెస్‌పార్టీ నాయకులు నిశిత విమర్శలు చేశారు. తాము ఒక్కరమే ప్రతిపక్షాలను ఓడించేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న పార్టీ ఇప్పుడు తెరవెనుక శక్తిగా ఉన్న ఎన్‌డిఎ కూటమికి కొత్త ఊపిరులు ఊదడం కోసం నానా తంటాలూ పడుతోందని విమర్శించారు.ప్రతిపక్షాల సమావేశానికి పోటీగా ఎన్‌డిఎ కూడా మంగళవారంనాడు భాగస్వామ్య పార్టీలతో ఢిల్లీలో ఒక ఉమ్మడి సమావేశం నిర్వహిస్తున్నది. ఈ సమావేశాలకోసం వచ్చిన సీతారామ్ ఏచూరి తొలుత మాట్లాడుతూ, 2004లో ప్రతిపక్షాల ఐక్యతకోసం అమలు చేసిన నమూనా తిరిగి కాంగ్రెస్ కూటమిని కేంద్రలో తిరిగి అధికారంలోకి తీసుకువస్తుందని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో టిఎంసితో ఎలాంటి పొత్తులకూ అవకాశం లేదని అన్నారు. వామపక్షాలు, కాంగ్రెస్‌పార్టీతో సహా లౌకిక పార్టీలన్నీ బెంగాల్‌లో బిజెపి, టిఎంసిలపై పోరాటం చేస్తాయన్నారు. అయితే బిజెపిపై ఐక్యంగా పోరాటం చేయడంవల్ల ఓట్ల చీలిక నివారించగలుగుతామన్నారు. 2004లో వామపక్షాలు ఉమ్మడిగా 61 ఎంపిసీట్లు సంపాదించుకున్నాయని గుర్తు చేశారు. వీటిల్లో 57 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి గెలిచామన్నారు. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం ఆనాడు పది సంవత్సరాలపాటు పాలించింది. కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ మాట్లాడుతూ, 26 పార్టీలకు చెందిన ప్రతిపక్ష నాయకులుఈ సమావేశంలో పాల్గొంటున్నారని, వారంతా ఐక్యంగా ఒక ఉమ్మడి వ్యూహం రూపొందిస్తారని అన్నారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు వారు ఉమ్మడిగా పరిష్కారాలు కనుగొంటారని అన్నారు. జైరామ్ రమేశ్ మాట్లాడుతూ, ఎన్‌డిఎ తన భాగస్వామ్య పార్టీలకు తిరిగి ఊపిరి పోసేందుకు యత్నిస్తోందని విమర్శించారు. ఈనెల 20 నుండి ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా వారు చర్చిస్తారన్నారు.
ప్రతిపక్షాల ఐక్యత దేశ రాజకీయముఖచిత్రాన్ని మార్చేస్తుంది
RELATED ARTICLES