HomeNewsBreaking Newsప్రజా సంక్షేమాన్ని కోరుకునే శక్తుల సంఘటితమవ్వాలి

ప్రజా సంక్షేమాన్ని కోరుకునే శక్తుల సంఘటితమవ్వాలి

ఆకాంక్షలు నెరవేరకపోవడానికి కారణాలు అన్వేషించాలి
రైతు సమస్యల పరిష్కారంలో పాలకులు ఎందుకు విఫలమవుతున్నారో చర్చించుకోవాలి
సిఎం కెసిఆర్‌ స్పష్టీకరణ : రైతు సంఘాల నాయకులతో భేటీ
ప్రజాపక్షం/హైదరాబాద్‌
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా కేంద్ర ప్రభుత్వ పాలన గాడిలో పడకుండా, ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరకపోవడానికి గల కారణాలను మనమే అన్వేషించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. దేశంలోని రైతు సమస్యలకు ఇంకా ఎందుకు పరిష్కారం దొరకడంలేదో, ఈ దేశ పాలకులు ఎందుకు విఫలమౌతున్నారో మనమందరమూ చర్చించుకోవాల్సిన సందర్భమిదని అన్నారు. స్వాతంత్య్ర పోరాటం ముగిసిన దశాబ్దాల తర్వాత కూడా దేశంలో అనేక వర్గాలు తమ ఆకాంక్షలను, హక్కులను నెరవేర్చుకునేందుకు ఇంకా పోరాటాలకు సిద్ధపడడం పట్ల ఆలోచించాల్సి ఉన్నదన్నారు. “తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తు న్న వ్యవసాయ, సాగునీరు, విద్యుత్‌ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటు పలు రంగాల ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు” 26 రాష్ట్రాల నుండి వచ్చిన రైతు సంఘాల నాయకుల అధ్యయన కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధ్యక్షతన హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో దాదాపు వంద మంది రైతు సంఘాల నాయకులతో శనివారం సమావేశం జరిగింది. అంతకుముందు వ్యవసాయ, సాగునీటి రంగం తదితర తెలంగాణ రాష్ట్ర ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని వారు తిలకించారు. తమ క్షేత్రస్థాయి పరిశీలనకు, డాక్యుమెంటరీలోని దృశ్యాలు, వివరణలు అద్దం పడుతున్నాయని రైతు సంఘాల నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ తెలంగాణకే కాకుండా తమ రాష్ట్రాల్లోని రైతుల గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుందని రైతు సంఘాల నేతలు ఆకాంక్షించారు. తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి రైతు సంక్షేమ పథకాలు అమలు జరిగితే తామూ ఎంతో అభివృద్ధి చెందేవారమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ భారతదేశంలో ప్రకృతి వనరులు, వ్యవసాయ యోగ్యమైన భూమి దేవుడిచ్చిన వరమని, అమెరికా, చైనా వంటి మిగతా ఏ దేశాలతో పోల్చినా నీటి వనరులు, వ్యవసాయ యోగ్యమైన భూమి, మానవ వనరులు భారతదేశంలోనే పుష్కలంగా ఉన్నాయని వివరించారు. దేశంలో మొత్తం 40 వేల కోట్ల ఎకరాల సాగుకు యోగ్యమైన భూమి ఉన్నదని, ఈ భూముల సాగుకు కావల్సింది కేవలం 40 వేల టిఎంసిల నీళ్లు మాత్రమేనని, తాగునీటికి 10 వేల టిఎంసిలైతే సరిపోతాయని వివరించారు. దాదాపు 70 వేల టిఎంసిల నీటి వనరులు మన దేశంలో అందుబాటులో ఉన్నప్పటికీ ఎందుకు సాగు, తాగునీటికి దేశ ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తున్నదని, అదే సందర్భంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ 2 లక్షల మెగావాట్ల విద్యుత్‌ ను కూడా వినియోగించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు.
ప్రజల కోసం పనిచేసేవారిని ఇబ్బందిపెడుతున్న పాలకులు చట్టసభల్లో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన వారే నిర్లక్ష్యం వహిస్తుండటం, ప్రజల కోసం పనిచేసే వాళ్లను దేశ పాలకులే ఇబ్బందులకు గురిచేసే పొంతనలేని ప్రక్రియ దేశంలో కొనసాగుతుండటం మన దురదృష్ణకరమని సిఎం కెసిఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల నుంచి దేశాన్ని బయటపడేసేందుకు, ప్రజల సంక్షేమం కోరుకునే శక్తులు సంఘటింతమవ్వాల్సిన అవసరముందన్నారు. ఈ సంఘటిత ప్రారంభదశలో మనతో కలిసొచ్చే శక్తులు కొంత అనుమానాలు,? అనేక అపోహలకు గురవుతుంటారని సిఎం వివరించారు. ఈ అడ్డంకులన్నింటినీ దాటుకొంటూ ఐక్యత సాధించి లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉందన్నారు.
దేశ వ్యాపితంగా ఉచిత విద్యుత్‌, సాగు నీరు ఎందుకు అమలు చేయరు?
నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ ఉచిత విద్యుత్‌, సాగునీటిని అందిస్తున్నపుడు, ఇదే పనిని కేంద్రం దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయదని సిఎం కెసిఆర్‌ ప్రశ్నించారు. రైతులు కూర్చుని మాట్లాడుకోవడానికి తెలంగాణలో ఉన్నట్లు దేశంలో ఎక్కడైనా కిసాన్‌మంచ్‌ (రైతు వేదిక)లు ఉన్నాయా అని అన్నారు. సాగునీరు, విద్యుత్‌ ఉన్నదని, కష్టపడే రైతులు ఉన్నారని, అయినా ఈ దేశంలో వ్యవసాయ సంక్షోభం ఎందుకున్నదని, రైతుల ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయని, దీనిపై కేంద్ర పాలకులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విషయాలను మనం విశ్లేషించుకుని, చర్చించాలన్నారు. మన దేశ వనరులను సక్రమంగా వినియోగించుకుంటూ దేశ సౌభాగ్యాన్ని గుణాత్మకంగా అభివృద్ధి పరిచేలా రైతు, వ్యవసాయ సంక్షేమ దిశగా సాగే సుపరిపాలన కోసం మనం అడుగులు వేయాల్సి ఉన్నదని సిఎం కెసిఆర్‌ రైతు సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ సహా ఢిల్లీ, ఒడిషా, గుజరాత్‌,కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్‌, హర్యానా, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌, బీహార్‌, ఛత్తీస్‌ గఢ్‌, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, కర్ణాటక, అస్సాం, మిజోరం, మేఘాలయ, మణిపూర్‌, నాగాలాండ్‌, పాండిచ్చేరి, దాదానగర్‌ హవేలి తదితర రాష్ట్రాలకు చెందిన, వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్న పలువురు సీనియర్‌ రైతు సంఘాల నేతలు సహా దాదాపు 100 మంది రైతులతో పాటు రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎంపీ దీవకొండ దామోదర్‌ రావు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, ఆశన్నగారి జీవన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నా

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments