టిఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ సిఎం కెసిఆర్
ప్రజాపక్షం/ హైదరాబాద్ :శాసనసభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు లభించిన ఘనవిజయం ప్రజలదేనని టిఆర్‌ఎస్ అధ్యక్షులు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. రైతులు, మహిళలు, నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీలు, కులాలు, మతాలకతీతంగా అన్ని వర్గాలూ నిండుగా దీవించారన్నారు. తమకు ఈ గొప్ప విజయాన్ని అందించినందుకు ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు చెప్పా రు. త్వరలోనే ప్రాంతీయ పార్టీలతో కలిసి జాతీ య పార్టీ ఏర్పడబోతుందని, జాతీయ స్థాయిలో గుణాత్మక మార్పు రాబోతుందని ప్రకటించా రు. ఎంఐఎం అధ్యక్షులు, ఎంపి అసదుద్దీన్ ఓవైసి ఒక సెక్యూలరిస్టు అని, ఆయనతో కలిసి తాను దేశ వ్యాప్తంగా పర్యటిస్తానని, కూటమి అంటే పార్టీలు కలువడం కాదని, ప్రజలను ఒక వేదిక మీదకు తీసుకొస్తామన్నారు. తెలంగాణ ఎన్నికలు యావత్ దేశానికి ఓ మార్గాన్ని చూ పాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కెసిఆర్ మాట్లాడుతూ ఏడు దశాబ్దాలు దాటినా దేశం లో కనీసం కనీస అవసరాలైన సాగు, తాగు నీరు అందించలేకపోవడం పట్ల కాంగ్రెస్, బిజెపి సిగ్గుపడాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలే గెలిచారని, ఎన్నికల్లో తమను ఎవరు ఏమన్నా, ఎన్ని విమర్శలు చేసినా తాము పట్టించుకోలేదన్నారు. ప్రధానితో సహా సోనియాగాంధీ, రాహుల్‌గాందీ, సిపిఐ, కేంద్ర మంత్రులు, తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ప్రజలు తమ అంతిమ తీర్పునిచ్చారని చెప్పారు. నాన్ కాంగ్రెస్, నాన్ బిజెపి ముక్త్ భారత్ కావాలన్నారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు తప్పుడు తీర్పు వెలువరించిందని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదనడం అన్యాయమని, దీనిపై పార్లమెంట్‌లో చట్టం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు.
గర్వం, అహంకారం రావాల్సిన అవసరం లేదు : “టిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు శ్రేణులందరూ అహోరాత్రులు కష్టపడి పనిచేయడం వల్లే గొప్ప విజయం సాధించాం. తొలి నుంచి అనుకున్నట్టుగానే అణుకువ, వినయం, విధేయత అవసరం. విజయంతో గర్వం, అహంకారం రావాల్సిన అవసరం లేదు. కర్తవ్య నిష్ఠతో బాధ్యతల్ని నిర్వహించడంపైనే మనం దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. కొత్త రాష్ట్రాన్ని ఓ బాటలో పెట్టాం. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. కోటి ఎకరాలు పచ్చబడాలనే లక్ష్యంలో ఏమాత్రం రాజీలేదు. అది జరిగి తీరాల్సిందే. తెరాసను గెలిపిస్తే కాళేశ్వరం.. కూటమిని గెలిపిస్తే శనీశ్వరం అని ఎన్నికల ప్రచార సభల్లో అన్నాను. ఏది కావాలో తేల్చుకోవాలని ప్రజలకు చెప్పాను. కచ్చితంగా తమకు కాళేశ్వరం కావాలనే ప్రజలు తీర్పు ఇచ్చారు. దాంతో పాటు మిగతా ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరు తెచ్చి తీరుతాం. ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తాం.” అని అన్నారు. విజయం ఎంత ఘనంగా ఉందో బాధ్యత కూడా అంతే బరువుగా ఉంది. సస్యశ్యామలమైన తెలంగాణ, శాంతియుతమైన తెలంగాణ, సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా మేం పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. దళితులు దశాబ్దాలుగా పేదరికంలో కూరుకుపోవడం రాచపుండులా క్షోభపెడుతోంది. దానికి భరతవాక్యం పలకాలి. కడియం శ్రీహరి నేతృత్వంలో కమిటీ వేశాం. దానిపై పనిచేస్తున్నామన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సమయాన్ని వృథా చేయకుండా ప్రజల కోసం పని చేయాలని సూచించారు. పాజిటివ్ కోణంలోనే వెళ్లాలని, కొత్త రాష్ట్రాన్ని ఒక బాటలో పెట్టామని, గమ్యం చేరడానికి ప్రయత్నించాలని, కోటి ఎకరాలు పచ్చబడాలని, ఆ లక్ష్యం జరిగి తీరాలన్నారు. ప్రజలు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తాం. సానుకూల ధోరణితో ముందుకెళ్తాం. ధనికులైన రైతులు తెలంగాణలో ఉన్నారనే పేరు వచ్చే విధంగా రైతుల కోసం పని చేస్తామని, గిరిజనులు, గిరిజనేతరులు పడుతున్న భూ హక్కుల విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కారిస్తామని చెప్పారు. భద్రతతో కూటిన బతుకును కల్పిస్తామని, సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా ముందుకెళ్తామన్నారు.
రైతులకు బాధలు లేకుండా చేస్తాం : రైతుల కోసం కచ్చితంగా పనిచేస్తామని, వారికి ఏ బాధా లేకుండా చేస్తామని, గిరిజనులు, గిరిజనేతరుల సమస్యలకు సత్వరమే పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. దీనికి తానే వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటానని, బీడీ కార్మికులు, గీత కార్మికులు, కుల వృత్తులన్నీ కుదుటపడాలని, వారికి ఆధునిక యంత్రాలను అందజేసి ఆదుకుంటామన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగాలు విరివిగా లభించేలా పనిచేస్తామని కెసిఆర్ అన్నారు. తమకు అవకాశాలు రావడంలేదనే బాధ వారిలో ఉన్నదని, నిరుద్యోగ సమస్య దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నదని, దీన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని, ఉద్యోగ ఖాళీలను కచ్చితంగా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వేతర రంగాలో ఉపాధి విరివిగా లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఒక్క బూత్‌లో కూడా రీపోల్ లేకుండా, ఎలాంటి దొమ్మీలు లేకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు. యావత్ దేశానికే ఓ మార్గం చూపేలా ఎన్నికలు నిర్వహించుకున్నామన్నారు. శాంతిభద్రతల నిర్వహణ అంశంలో పోలీసులు ఎక్కడా రాజీపడలేదని, ఎన్నికల కమిషన్, పోలీసులు బాగా పనిచేశారని, ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి, సిఇఒ రజత్‌కుమార్‌కు, అలాగే మంచి పాత్ర పోషించిన మీడియాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో మీడియా గౌరవప్రదంగా ప్రవర్తించిందన్నారు.
జాతీయ రాజకీయాల్లో ప్రాధాన పాత్ర : జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తామని, దేశానికే తెలంగాణ ఒక దిక్సూచిగా ఉంటుందని కెసిఆర్ అన్నారు. జాతీయ రాజకీయాలకు తెలంగాణ. ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చారన్నారు. దేశంలో నాన్ కాంగ్రెస్, నాన్ బిజెపి ప్రభుత్వం రావాలన్నారు. ఇక నుంచి దేశ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరిస్తానన్నారు. పెసిమిస్టిక్ గా ఉండకూడదన్నారు. ఆప్టిమిస్టిక్గా ఉండాలన్నారు. కొందరు డర్టీ, సిల్లీ పాలటిక్స్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్తానని, దేశ ప్రజలను ఏకం చేస్తానన్నారు. తమకు ఎవ్వరూ బాసులు లేరని, తాము ఎవ్వరికీ ఏజెంట్లం కాదని, ప్రజలకే ఏజెంట్లం అని, ప్రజలే తమను ఏజెంట్లుగా నియమించారని, అందుకు తాము వారి కోసమే పనిచేస్తామని తెలిపారు. తాము ఎవ్వరికీ గులాంగిరీ చేయబోమని, ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ జాతీయ రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా 70 వేల టిఎంసిలు అందుబాటులో ఉంటే కేవలం 30 వేల టిఎంసిలను మాత్రమే వినియోగించుకోవడం సిగ్గు చేటన్నారు. దీనికి కాంగ్రెస్,బిజెపి సిగ్గుపడాలన్నారు. దేశానికి కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానం అసవరమన్నారు. కేవలం ఉత్పత్తిపైన ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని, ఇజ్రాయిల్, చైనాతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నామో తేల్చుకోవాలన్నారు. విశ్లేషకులు అశోక్ గులాటి ఒక ఆర్టికల్ రాశారని, అందులో రైతులకు ఏం చేయాలన్న అంశాన్ని అద్భుతంగా రాశారని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో రాసి చూపారాన్నారు. స్వామినాథన్ కూడా తెలంగాణ ప్రభుత్వ పథకాలను మెచ్చుకున్నారన్నారు.
చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా : కెసిఆర్
ఎన్నికల్లో చంద్రబాబు తనకు ఇచ్చిన గిఫ్ట్‌ను తిరిగి ఆయనకు ఇవ్వాలి కదా..?,లేదంటే బాగుండదు కదా, అందుకే ఎపి రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంటామని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయా ల్లో జోక్యం చేసుకోవాలని అక్కడి ప్రజలు తమను కోరుతున్నా రన్నారు. తెలు గు ప్రజలు బాగుండాలని చంద్రబాబు చెబుతున్నారని,“తెలుగు ప్రజలు బాగుండే బాధ్యత కెసిఆర్‌కు ఉండొద్దా? తెలుగు ప్రజలు బాగుండాలని వంద శాతం కోరుకుంటున్నా.. ఇవాళ ఉదయం నుంచి లక్ష పైనే ఏపీ నుంచి ఫోన్లు వచ్చాయి. వాట్సాస్ ద్వారా మేసేజ్లు వచ్చాయి. ఏపీ రాజకీయాల్లో కలగజేసుకోవాలని కోరా”రని చెప్పారు. చంద్రబాబు ఇక్కడ(రాష్ట్రంలో)చేసినందుకు తాను అక్కడ కూడా చేయాలని,దాని ఫలితం ఎలా ఉండబోతుందో చంద్రబా బు త్వరలో చూస్తారని ఎద్దేవా చేశారు.చంద్రబాబుకు పైత్యంఉన్నదని, చంద్రబాబు ప్రధాని మోడీని అతిగా పొగడబోయి బొక్కబోర్లా పడ్డారని చెప్పారు.
మా తప్పుల వల్లనే మరో 18 సీట్లు ఓడిపోయాం
తమ పార్టీ తప్పుల వల్లనే మరో 17-18 సీట్లలో ఓడిపోయామని కెసిఆర్ అన్నారు. ఈ సీట్లలో మూర్ఖంగా వారిని వారే చంపుకున్నారని, ఖమ్మంలో మమ్మల్ని మేమే చంపుకున్నామన్నారు. తమ మంత్రివర్గ సహచరులు ఓడిపోయిందుకు తనకు బాధగా ఉన్నదన్నారు. తెలంగాణతో పాటు జరిగిన మిగతా రాష్ట్రాలలో అక్కడ ప్రత్యామ్నాయం లేకనే బిజెపిని కాదని, కాంగ్రెస్‌ను గెలిపించాని వ్యాఖ్యానించారు.