సంస్మరణ సభలో పలువురి ఉద్ఘాటన
హైదరాబాద్ : బిజెపి అధికారం చేపట్టిన తర్వాత దేశంలో మతోన్మాదం పెరిగిందని, భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అపహాస్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సువరం సుధాకరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ, వామపక్షాలు పోరాటాలు ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత దేశ పరిస్థితుల్లో గురుదాస్ దాస్ గుప్తా లేకపోవడం తీరని లోటని అన్నారు. గురుదాస్ దాస్ గుప్తాతో పాటు సిపిఐ నాయకులు ఏ లక్ష్యాల కోసం తమ జీవితాలను అంకితం చేశారో వాటి కోసం పోరాటాలు ఉధృతం చేయడమే ఆయనకు మనమర్పించే నిజమైన నివాళి అని అన్నారు. సిపిఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మఖ్దూంభవన్‌లో శనివాసం గురుదాస్ దాస్ గుప్తా సంస్మరణ సభ జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సురవరం సుధాకరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక సంఘాలను ఐక్యం చేసి కార్మిక హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలను నిర్మించిన గొప్ప నాయకుడు గురుదాస్ దాస్ గుప్తా అని కొనియాడారు. గురుదాస్ దాస్ గుప్తా మరణం పార్టీకి, భారత కార్మిక ఉద్యమానికి తీవ్ర నష్టమని అన్నారు. యుపిఎ 2 ప్రభుత్వంలో శ్రమజీవుల వాణిని పార్లమెంటులో వినిపించారని, 2 జిస్కాం తో పాటు అనేక సమస్యలను బయపట్టడంలో గుప్తా కృషిని కొనియాడారు. తన జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన గొప్ప నేత అని అన్నారు. . అవినీతిపై ధైర్యంతో పార్లమెంటు వేదికగా పోరాడి అనేక కుంభ కోణాలను బహిర్గతం చేశారన్నారు. మహారాష్ట్రలో కేంద్రం ఎన్‌సిపిని చీల్చి అధికారాన్ని హస్తగతం చేసుకుందని విమర్శించారు. ఈ పరిస్థితుల్తో గురుదాస్ దాస్ గుప్తా మన మధ్యలేక పోవడం బాధకరమన్నారు. చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గురుదాస్ దాస్ గుప్తా గొప్ప కార్మిక సేనాని అని కొనియాడారు. విద్యార్థి దశ నుండి అంచలంచలుగా ఎదిగారని అర్షద్ మెహతా, టిజిస్పెక్ట్రం లాంటి కుభకోణాలు వెలికితీసిన నాయకుడన్నారు. ప్రజల పక్షపాతి గుప్తా పక్షపాతం, దుర్మార్గాలను ఎండగట్టారని ఆయన మనకు భౌతికంగా దూరమైనా అందరి మనస్సుల్లో ఉంటారన్నారు. దేశ చరిత్రలో ఆయన పేరు నిలిచిపోతుందన్నారు. ఆయన అనుసరించిన విధానాన్ని పుణికిపుచ్చుకొని రాజ్యాంగాన్ని పరిరక్షించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాధంతో రానున్న కాలంలో ఉద్యమాలు , పోరాటాలు చేపట్టడమే గురుదాస్ దాస్ గుప్తాకు నిజమైన నివాళి అని అన్నారు. టిడిపి పోలిట్‌బ్యూర్ సభ్యులు రావుల చంద్ర శేఖర రెడ్డి మాట్లాడుతూ నిరాడంబరుడైన, నిజాయితీతో పనిచేసిన గొప్ప పార్లమెంటేరియన్ గురుదాస్ దాస్ గుప్తా అని అన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పార్లమెంటులో మాట్లాడేవారన్నారు. నిరంతరం శ్రామిక జనం, పేదల పక్షాన పనిచేశారని నివాళులర్పించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన నాయకులు గుప్తా అని కొనియాడారు. ఆయన సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. సిపిఐ జాతీయ నాయకుడు కాంగో మాట్లాడుతూ అసాధ్యమైన సవాళ్ళను కమ్యూనిస్టుగా స్వీకరించి వాటిని సాధించాలని అనడమే గాకుండా అందుకు పనిచేసేవారని అన్నారు. గొప్ప పోరాట యోధుడిని కోల్పోయామని నివాళులర్పించారు. ఎఐటియుసి జాతీయ ఉపాధ్యక్షులు నరసింహన్ మాట్లాడుతూ గురుదాస్ దాస్ గుప్తా మరణంతో ధీటైన పోరాటయోధుడిని కోల్పోయామన్నారు. దేశంలో కార్మిక వర్గాన్ని ఏక తాటిపైకి తెచ్చారన్నారు. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 22 కోట్ల మందిని సమ్మెలోకి దించిన గొప్పనేత గురుదాస్ దాస్ గుప్తా అని కొనియాడారు. ప్రస్తుతం దేశంలో కార్మిక వర్గం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, హక్కులు కాలరాయబడుతున్నాయని, 9 గంటల పనివిధానం తేచ్చే ప్రయతానలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి 8న చేపట్టే కార్మిక సమ్మెను విజయవంతం చేయడం ద్వారా గురుదాస్ దాస్ గుప్తాను నివాళులర్పించాలని సూచించారు. కె. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఏదైనా అంశాన్ని పట్టుకుంటే క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారన్నారు. వారి ఆశయాలను, జీవితాలను అధ్యయనం చేసి భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. వారి ఆశయ సాధన కోసం, కమ్యూనిస్టుల ఐక్యత కోసం ప్రయత్నం చేయాలన్నారు. అంతకు ముందు గురుదాస్ దాస్ గుప్తా చత్రపటానికి పూలమాల వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాలమల్లేష్ , పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ప్రజా పోరాటాలే గురుదాస్‌కు నివాళి
RELATED ARTICLES