ప్రధానిగా మోడీని ప్రజలు ఎన్నుకున్నారు : రాహుల్
న్యూఢిల్లీ: ఓటమిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహు ల్ గాంధీ అంగీకరించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకుగాను ఆయన ప్రధాని నరేంద్రమోడీని అభినందించారు. అయితే కాషాయ పార్టీ(బిజెపి)తో తమ సైద్ధాంతిక పోరు కొనసాగుతుందని అన్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కా ర్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ప్రజలే నేతలు అని ఎన్నికల ప్రచారంలో నేను చెప్పాను. ఆ ప్రజలు నరేంద్రమోడీ మరోసారి ప్రధాని కావాలని నిర్ణయించారు. వా రి నిర్ణయాన్ని గౌరవిస్తాను. ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని మోడీ, బిజెపికి శుభాకాంక్షలు. అమేథీలో నా ఓటమిని అంగీకరిస్తున్నా. ప్రజల తీర్పును గౌరవిస్తున్నా. స్మృతి ఇరానీకి అభినందనలు. అమేథీ ప్రజలను జాగ్రత్తగా చూసుకోండి. మా ఓటమిని పరిశీలించుకునేందుకు ఈ రోజు సరైన సమయం కాదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ త్వరలోనే సమావేశమై దీనిపై తదుపరి కార్యాచరణ నిర్ణయం తీసుకుంటుంది’ అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నియోజకవర్గం నుంచి 2004 మొదలుకుని మూడుసార్లు గెలిచారు. కానీ ఈసారే ఓడిపోయారు. ఓటమిని భయపడొద్దని ఆయన పార్టీ కార్యకర్తలకు హితవు పలికారు.