సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలో నారాయణ విమర్శ
సిఎఎ వ్యతిరేక ఆందోళన రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం
ప్రజాపక్షం/గుర్రం యాదగిరిరెడ్డి ప్రాంగణం (మంచిర్యాల)
పౌరసత్వ చట్టం సవరణ బిల్లు (సిఎఎ) వ్యతిరేకంగా పార్లమెంటులో టిఆర్‌ఎస్ ఎంపిలతో ఓటు వేయించిన సిఎం కెసిఆర్ రాష్ట్రంలో సిఎఎ, ఎన్‌ఆర్‌సి వ్యతిరేక పోరాటానికి ఎందుకు కలిసి రావటం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ప్రశ్నించారు. అంతే కాకుండా సిఎఎకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, ఇతరులు చేస్తున్న పోరాటానికి ఎందుకు అనుమతించడం లేదని నిలదీశారు. మంచిర్యాలలో సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభల్లో రెండోరోజు ఆదివారం ప్రతినిధులను ఉద్ధేశించి ఆయన ప్రసంగించారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను మరిచిపోయారని, కేవలం ప్రాజెక్టులకే పరిమితమయ్యారని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఏమయ్యాయని ఆయన కెసిఆర్‌ను ప్రశ్నించారు. సిఎం కెసిఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ధర్నా చౌక్‌లో నిరసనకు అనుమతివ్వడం లేదని, ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చినప్పటికీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండవద్దని ఆయన ఉద్దేశమని, అందుకే ఆయన మిత్రపక్షమైన ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీని ప్రతిపక్ష సీట్లో కూర్చోబెట్టారని నారాయణ అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ప్రజాసమస్యలపై పోరాడుతున్నా అణచివేస్తున్నారని, ఇది మంచిది కాదని హెచ్చరించారు. తాత్కాలికంగా కొంత వెనుకంజ వేసినా వెనక్కి తగ్గేది లేదని, తెలంగాణ సాయుధ పోరాటానికి నేతృత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అంతు చూస్తుందన్నారు.
‘బ్లూ టిక్కు’ ఉద్యమాలు వద్దు
నామ్‌కే వాస్తేగా ఉద్యమాలు చేసి ఫోటోలను వాట్సాప్, ఫేస్‌బుక్‌లో వేసి బ్లూటిక్‌లో రాగానే సంతోషపడవద్దని డాక్టర్ నారాయణ అన్నారు. ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఉధృతంగా ఉద్యమాలు చేస్తేనే పార్టీ ప్రభావం ఉంటుందని, పార్టీ మరింత బలోపేతమవుతుందని సూచించారు.