HomeNewsAndhra pradeshప్రజా ఉద్యమాలను అణచివేస్తే తిరుగుబాటు తప్పదు

ప్రజా ఉద్యమాలను అణచివేస్తే తిరుగుబాటు తప్పదు

అక్రమ అరెస్టులు, నిర్భంధాలు, తప్పుడు కేసులతో
ఉద్యమాలను ఆపాలనుకోవడం ప్రభుత్వ అవివేకం
సిపిఐ, ప్రజా సంఘాల నేతలు హెచ్చరిక
బినోయ్‌ విశ్వం అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ
రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ప్రదర్శనలు, దిష్టిబొమ్మల దగ్ధం
గుడిసెలు వేసుకున్న పేదలకు
పట్టాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌
ప్రజాపక్షం న్యూస్‌ నెట్‌వర్క్‌ వరంగల్‌, హన్మకొండ జిల్లాలలో సిపిఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూపోరాటాలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సిపిఐ జాతీయ కార్యదర్శి, ఎంపి బినోయ్‌ విశ్వంతో పాటు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావును బుధవారం పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ సిపిఐ, ప్రజా సంఘాల శ్రేణులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాలపై టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తే ‘ప్రభుత్వ, సిఎం కెసిఆర్‌ దిష్టిబొమ్మ’లను దగ్ధం చేశారు. కొన్ని జిల్లాల్లో సిపిఐ, ప్రజా సంఘాల నాయకులు మానవహారాన్ని నిర్మించారు. అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అందోళన కార్యక్రమాల్లో కమ్యూనిస్టు పార్టీ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు శాంతియుతంగా నిర్వహిస్తున్న ఉద్యమాలను అనిచివేసేందుకు ప్రయత్నిస్తే తిరుగుబాటు తప్పదని ఆందోళన కార్యక్రమాలను ఉద్దేశించి ప్రసంగించిన సిపిఐ నాయకులు హెచ్చరించారు. అక్రమ అరెస్టులు, నిర్భంధాలు, తప్పుడు కేసులు బనాయించి ఉద్యమాలను ఆపాలనుకోవడం ప్రభుత్వ అవివేకమని వారు పేర్కొన్నారు. సిపిఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా, మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో నిరసన ప్రదర్శన, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాఘవా ఫ్లాజా సెంటర్‌ వద్ద భారీ ధర్నా జరిగాయి. కరీంనగర్‌లోని కమాన్‌ చౌరస్తాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ దిష్టిబొమ్మను సిపిఐ శ్రేణులు దగ్ధం చేశారు.నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కూడలిలో, హన్మకొండ కాళోజి సెంటర్‌ వద్ద పార్టీ కార్యకర్తలు ధర్నాలు నిర్వహించగా, హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని మేళ్లచెర్వు మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది.
హైదరాబాద్‌లో ర్యాలీ
హైదరాబాద్‌ : ప్రజా సమస్యల పరిస్కారం కోసం శాంతియుతంగా చేస్తున్న ప్రజా ఉద్యమాలను అణిచివేస్తే తిరుగుబాటు తప్పదని సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఈ.టి.నరసింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ప్రజా ఉద్యమాలను సిఎం కెసిఆర్‌ అడ్డుకుంటున్నారని విమర్శించారు. సిపిఐ జాతీయ కార్యదర్శి ఎంపి బినోయ్‌ విశ్వం అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ, గుడిసెలు తొలిగించిన భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాల ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ హైదరాబాద్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో హిమాయత్‌ నగర్‌ సత్యనారాయణరెడ్డి భవన్‌ నుండి హిమాయత్‌ నగర్‌ వై జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఈ.టి. నరసింహ మాట్లాడుతూ వరంగల్‌లో ఇళ్లులేని పేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని తెలిపారు. రెవిన్యూ సిబ్బంది బలవంతంగా వారి గుడిసెలు కూల్చివేయడంతో వేలాది మంది రోడ్డు పాలయ్యారన్నారు. నిరాశ్రయులైన పేద ప్రజల గోడు వినేందుకు వెళ్తున్న బినోయ్‌ విశ్వంను పోలీసులు అత్యుత్సాహంతో అరెస్ట్‌ చేయడం గర్హనీయమన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అని ఈ.టి.నరసింహా ప్రశ్నించారు. బడా భూబకాసురులు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే రెవిన్యూ అధికారులు, పోలీసులు కళ్ళు మూసుకుంటారని, అదే ఇళ్లు లేని పేద ప్రజలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటే కూల్చివేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్‌ సర్కార్‌ ఎక్కడ పేదలకు భూముల పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు. సుమారు 120 చదరపు గజాల స్థలంలో నివాసం ఉంటున్న వారి స్థలాలను 58, 59 జిఓ ప్రకారం క్రమబద్దీకరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, సుమారు 15 లక్షల వరకు దరఖాస్తులు పెడింగ్‌లో ఉన్నాయన్నారు. వరంగల్‌లో గుడిసెలు కూల్చివేసిన స్థానంలోనే ఇళ్ల పట్టా లివ్వాలని, లేకుంటే రాష్ర్ట వ్యాప్తంగా కెసిఆర్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాటాలు తీవ్రతరం చేస్తామని నరసింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పేదలకు పట్టాలు ఇవ్వని కెసిఆర్‌ సర్కార్‌ : ప్రేమ్‌ పావని
ఎనిమిదేళ్ల టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో ఎంతమంది దళితులకు మూడు ఎకరాల భూమి, పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, భూములకు పట్టాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయలని సిపిఐ సీనియర్‌ నాయకురాలు పి.ప్రేమ్‌పావని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి, బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తుంటే చోద్యం ప్రభుత్వ యంత్రాంగం పేదల గుడిసెలను తొలగిస్తున్నారని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలపైనే రెవిన్యూ అధికారులు ప్రతాపం చూపుతారని, భూకబ్జాదారుల జోలికి వెళ్లారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ర్ట సమితి సభ్యురాలు ఎస్‌.ఛాయాదేవి, కార్యవర్గ సభ్యులు బి.స్టాలిన్‌, ఎఐటియుసి రాష్ర్ట కార్యదర్శి ఎన్‌.కరుణ కుమారి, పార్టీ, ప్రజా సంఘాల నాయకులు నాయకులు నిర్లేకంటి శ్రీకాంత్‌, సమితి సభ్యులు గ్యార నరేష్‌, శక్రి భాయి, అమీనా, మహమూద్‌, జె.కుమార్‌, మామిడిచెట్ల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
వరంగల్‌లో ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్దం
సిపిఐ రాష్ట సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా వరంగల్‌, హన్మకొండ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.వరంగల్‌ నగరంలోని ములుగు రోడ్‌ హనుమాన్‌ జంక్షన్‌లలో సిపిఐ కార్యకర్తలు భారీ రాస్తారోకో నిర్వహించారు.అనంతరం ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్దం చేసారు.ఈ రాస్తారోకోలో సిపిఐ వరంగల్‌ మండల కార్యదర్శి బుస్సా రవీందర్‌,జిల్లా, మండల నాయకులు గుండె బద్రి, భూజుగుండ్ల రమేష్‌,జన్ను రవి,పరికరాల రమేష్‌,తాల్లపెల్లి రహేలా,లావుడ్యా దస్రూ,ఎం.సుధీర్‌,మల్లారెడ్డి,నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments