ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్న సిఎం కెసిఆర్
సభలు నిర్వహించుకోవాలంటే హైకోర్టుకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
ప్రజాపక్షం/హుజూర్‌నగర్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థ్ధకంగా మారిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సీనియర్ కమ్యూనిస్టు నాయకులు పశ్య రాంరెడ్డి అంతిమయాత్రలో పాల్గొనడానికి హుజూర్‌నగర్ వచ్చిన సందర్భంగా స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశ్నించే హక్కు లేకుండా ఏక పార్టీ తెలంగాణ కోసం తీవ్రమైన కృషి చేస్తున్నారన్నారు. దానిలో భాగంగానే సిఎల్‌పిని టిఆర్‌ఎస్‌లో విలీనం చేసే ప్రక్రియకు పూనుకున్నాడని, ఒక జాతీయ పార్టీ ని తన అంగబలంతో, అర్ధబలంతో విలీనం చేసినంత మాత్రాన రాష్ట్రంలో ఏకపార్టీలు ఉండవని ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి వాటికి తావు ఉండదన్నారు. రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలంటే గత ప్రభుత్వా ల అనుమతులు తీసుకుని నిర్వహించుకునేవారని, కెసిఆర్ పాలనలో సభలు నిర్వహించుకోవాలంటే హైకోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్ పోరాటం నుంచి నేడు ఇంటర్ విద్యార్థుల పోరాటాల వరకు కమ్యూనిస్టుల పాత్ర అజరామరమన్నారు. రాష్ట్రంలో తలెత్తే బలమైన సమస్యలపై గవర్నర్‌కు వినతి పత్రాలు సమర్పించడమే తప్ప గవర్నర్ వైపు నుంచి రాష్ట్ర సమస్యలపై అవునా కాదా అన్న సమాధానం కూడా వచ్చే పరిస్థితు లు లేవని సమస్యలపై ఆనవాయితీగా గవర్నర్ కు వినతి పత్రాలు ఇవ్వడమే జరగుతుందన్నా రు. కేంద్రంలో బిజెపియేతర పార్టీలకు కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. నరేంద్రమోడీ ఐదేళ్ల పరిపాలనలో స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థ ఎన్నికల కమిషన్, సిబిఐలాంటి సంస్థలు స్వతంత్రంగా పనులు చే యలేకపోతున్నాయన్నారు. ప్రభుత్వ కనుసన్న ల్లో పనిచేసే పరిస్థితులు ఆయా సంస్థల అధికారులకు వచ్చాయన్నారు. ఈ సమావేశంలో సిపి ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, బొమ్మగాని ప్రభాకర్, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు ఉజ్జిని రత్నాకర్‌రావు,జిల్లా కార్యదర్శి గన్నా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.