మతోన్మాద శక్తులను నిలువరించండి
జనసేవాదళ్ ముగింపు సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ
ప్రజాపక్షం/ ఖమ్మం ప్రజాస్వామ్య, లౌకికశక్తుల పరిరక్షణే ధ్యేయంగా జనసేవాదళ్ కార్యకర్తలు పని చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. దేశ రక్షణలో దేశ సైన్యం ఉంటే, జన సేవాదళ్ దేశాన్ని మతోన్మాద శక్తుల నుంచి కాపాడేందుకు రెడ్ ఆర్మీలా పనిచేయాలన్నారు. పది రోజుల పాటు ఖమ్మంలో జరిగిన జనసేవాదళ్ జాతీయ స్థాయి శిక్షణా శిబిరం మంగళవారం ముగిసింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జనసేవాదళ్ కార్యకర్తలు శిక్షణపొందారు. ముగింపు సందర్బంగా కె. నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ నాయకులు బాగం హేమంతరావు, పోటు ప్రసాద్ తదితరులు జనసేవాదళ్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ దేశంలో మతోన్మాద శక్తులు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నాయని, స్వేచ్ఛను హరిస్తున్నాయన్నారు. చారిత్రిక నేపథ్యం గల భారత రాజ్యాంగానికి సైతం తూట్లు పోడిచి తమకు సానుకూలమైన అంశాలను రాజ్యాంగంలో పొందుపర్చాలని చూస్తున్నారని ఆరోపించారు. విపత్కర పరిస్థితులలో కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలు, సామాన్య ప్రజలకు అండగా నిలిచి పోరాటం చేశాయని నారాయణ గుర్తు చేశారు. సిపిఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు గడచిన సందర్బంగా 2024 డిసెంబరు 26న ఢిల్లీలో లక్ష మంది జనసేవాదళ్ కార్యకర్తలతో ఎర్ర కవాతు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణతో పాటు ప్రజా ఉద్యమాలకు జన సేవాదళ్ కార్యకర్తలు దన్నుగా
నిలవాలని నారాయణ కోరారు.
యువత తో మార్పు : కూనంనేని
యువత తోనే సమాజ మార్పు త్వరితగతిన సాధ్యమవుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. జనసేవాదళ్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ పాలకుల నిర్ణయాలతో యువత నైరాశ్యంలో ఉందన్నారు. జనాభాలో సగ భాగం కలిగిన యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక ఆందోళన చెందుతుందని ఆయన తెలిపారు. పోరాటాల ద్వారానే పాలకుల వైఖరిలో మార్పు వస్తుందని ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఉద్యమించాలన్నారు. జనసేవాదళ్ కమ్యూనిస్టు పార్టీకి సైన్యం లాంటిదని సాంబశివరావు తెలిపారు. శిక్షణలో పాల్గొన్న వారందరికీ ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్,
సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు మహ్మద్ మౌలానా, నార్ల వెంకటేశ్వరరావు, మహ్మద్ సలాం, మేకల శ్రీనివాసరావు, యువజన విద్యార్థి సంఘాల నాయకులు సిద్దినేని కర్ణకుమార్, రావి శివరామకృష్ణ, తోట రామాంజనేయులు, నానబాల రామకృష్ణ, ఇటికాల రామకృష్ణ, శ్రవణ్ పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యం,లౌకిక శక్తుల రక్షణే ధ్యేయం
RELATED ARTICLES