HomeNewsAndhra pradeshప్రజాసమస్యలపై ఇక దూకుడే…

ప్రజాసమస్యలపై ఇక దూకుడే…

లాఠీలు, బుల్లెట్‌లను ఎదుర్కొనే క్రమంలో జైళ్ళకు వెళ్ళేందుకైనా పార్టీ శ్రేణులు సిద్ధపడాలి
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

ప్రజాపక్షం/ కామ్రేడ్‌ గురుదాస్‌ దాస్‌ గుప్తానగర్‌ (విజయవాడ) ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా పోరాడాలని, లాఠీలను, బుల్లెట్‌లను ఎదుర్కొనేందుకు, జైళ్ళకు వెళ్ళేందుకు సిపిఐ శ్రేణులు సిద్ధపడాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గతంలో మాదిరిగా మిలిటెంట్‌ పోరాటాల పార్టీగా మారాలని, తద్వారా జన సమూహాలను ఆకర్షించి కమ్యూనిస్టు పార్టీ పునర్‌ వైభవం పొందాల్సిన అవసరం ఉన్నదన్నారు. విజయవాడలోని కామ్రేడ్‌ గురుదాస్‌ దాస్‌ గుప్తానగర్‌ (ఎస్‌.ఎస్‌.కన్వెన్షన్‌ సెంటర్‌)లోని కామ్రేడ్‌ షమీమ్‌ ఫైజీ హాల్‌లో జరుగుతున్న సిపిఐ 24వ జాతీయ మహాసభలో ప్రవేశపెట్టిన నివేదికలపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. మరో రెండేళ్ళలో కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలను చేసుకోనున్నదని, మన దేశంలో జనతాపార్టీ, జనతాదళ్‌ వంటి అనేక పార్టీలు ఏర్పడి, అంతరించిపోయాయని, కానీ, సిపిఐ మాత్రం స్థిరంగా వందేళ్ళ ప్రస్థానం వైపు కొనసాగుతున్నదన్నారు. దీంతో సంతృప్తి పడితే సరిపోదని, కొత్త పార్టీలు ఒకటి, రెండు రాష్ట్రాలలో అధికారం సాధించడమే కాకుండా, ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. మనం కూడా వెనకబడొద్దని, గతంలో మాదిరిగా బలమైన పార్టీగా నిలబడేందుకు అన్ని దశల్లో ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పారు. సిపిఐ పోరాట పార్టీ అని, భూసమస్య, అవినీతి, ఇతర అనేక అంశాలపై ఉధృత పోరాటాలు చేయాలన్నారు. కొత్త తరాన్ని అన్ని స్థాయిల్లో ప్రోత్సహించాలని పార్టీ నిర్మాణంపై రెండేళ్ళకొకసారి నిర్మాణ మహాసభ జరుపుకోవాలని కోల్‌కత్తాలో జరిగిన జాతీయ నిర్మాణ సభలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరచాలని సూచించారు.
గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలి
గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఉన్నదని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. కేరళ సహా అనేక విపక్ష ప్రభుత్వాలు ఉన్న అనేక రాష్ట్రాలలో గవర్నర్‌ వ్యవస్థ దుర్వినియోగమవుతున్న తీరును అందరూ గమనిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో సైతం అదే పరిస్థితి నెలకొన్నదని, గవర్నర్‌ తీరుపై ఇప్పటికే తాము నిరసన తెలియజేశామని తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments