అట్టడుగు శ్రమజీవుల కోసం జీవితం అంకితం
నాలుగుసార్లు ఎంఎల్‌ఎ, అయినా నిరాడంబరతకు సాక్ష్యం
నేడు బెల్లంపల్లిలో అంత్యక్రియలు
ప్రజాపక్షం / హైదరాబాద్‌సిపిఐ సీనియర్ నాయకులు, సిపిఐ శాసనసభాపక్ష మాజీ నేత గుండా మల్లేశ్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో గుండె, కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. గుండా మల్లేష్ రాజకీయ జీవితమంతా సిపిఐలోనే కొనసాగింది. మల్లేష్ మూడు సార్లు వరుసగా ఎంఎల్‌ఎగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి రాష్ట్ర సాధనలోనూ చెరగని ముద్ర వేశారు. శాసనసభ పక్షనేతగా తెలంగాణ వాణిని బలంగా వినిపించారు. కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ అంచెలంచెలుగా శాసన సభ్యుని స్థాయికి ఎదిగారు. 1947 జులై 14న పూర్వపు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామంలో జన్మించారు. మెట్రిక్యులేషన్ (హెచ్‌ఎస్‌సి) వరకు చదువుకున్న మల్లేష్ తొలుత బెల్లంపల్లిలోని రామా ట్రాన్స్‌పోర్టులో క్లీనర్‌గా, డ్రైవర్‌గా పనిచేశారు. తోటి క్లీనర్లు, డ్రెవర్ల సమస్యలపై పోరాడారు. తర్వాత సింగరేణిలో కార్మికుడిగా చేరిన ఆయన సిపిఐ సభ్యత్వం తీసుకున్నారు. 1970లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. మంచి కార్మిక నేతగా పేరు తెచ్చుకున్న ఆయన తొలిసారిగా 1978లో అప్పటి ఆసిఫాబాద్ నియోజకవర్గంలో సిపిఐ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దాసరి నర్సయ్య చేతిలో ఓడిపోయారు. రాష్ట్ర సిపిఐలో కార్యదర్శివర్గ సభ్యులుగా సేవలందించారు. 1983, 1985, 1994 ఎన్నికల్లో వరుసగా ఎంఎల్‌ఎగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 12వ శాసనసభలో 2009లో బెల్లంపల్లి నుంచి ఎన్నికై సిపిఐ సభానాయకుడిగా వ్యవహరించారు. గుండా మల్లేశ్ ఈ పేరు తెలియని వారు బెల్లంపల్లిలో ఎవరూ ఉండరు. అంతగా ప్రజలతో కలిసి పోయారు ఆయన. నాలుగుసార్లు ఎంఎల్‌ఎగా గెలిచినా సాధారణ వ్యక్తిలా జీవిస్తూ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ జనాల్లో చెరగని ముద్ర వేశారు. గుండా మల్లేశ్ రాజకీయ జీవితమంతా సిపిఐలోనే కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర సాధస ఉద్యమంలోనూ మల్లేశ్ చెరగని ముద్ర వేశారు. శాసనసభ పక్షనేతగా తెలంగాణ వాణిని బలంగా వినిపించారు. తెలంగాణకు మద్దతుగా ఎన్నో పోరాటాలు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలకు టిఆర్‌ఎస్ అధ్యక్షులు కె.చంద్రశేఖర్‌రావుతో కలిసి సిపిఐ శాసనసభా పక్షనేత హోదాలో పలుమార్లు హాజరయ్యారు. శ్రీకృష్ణ కమిటీ ముందు తెలంగాణ వాదనను బలంగా వినిపించారు. నిజమైన కమ్యూనిస్టు నాయకుడిగా వ్యవహరించారు. కుమార్తెలు, కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురాలేదు. అత్యంత సామాన్యంగా జీవించిన మల్లేశ్ చనిపోయే ముందు కూడా కార్పొరేట్ ఆస్పత్రిలో కాకుండా నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. గుండా మల్లేష్ మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం ప్రకటించారు.
నేడు అంత్యక్రియలు : గుండా మల్లేశ్ అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిమ్స్ ఆసుపత్రిలో మరణించిన గుండా మల్లేశ్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం నిమ్స్ నుంచి మంగళవారం సాయంత్రం హిమాయత్‌నగర్‌లోని మఖ్దూం భవన్‌కు తరలించారు. అనంతరం మల్లేశ్ భౌతికకాయాన్ని పార్టీ నేతలు బెల్లంపల్లికి తీసుకువెళ్ళారు.
సిఎం, మంత్రులు, రాజకీయ పార్టీల నేతల సంతాపం
సిపిఐ సీనియర్ నాయకులు, సిపిఐ శాసనసభా పక్ష మాజీ నేత గుండా మల్లేశ్ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, పలువురు మంత్రులు, వివిధ రా రాజకీయ పార్టీల నాయకులు సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నాలుగుసార్లు శాసనసభ్యులుగా ఎన్నికైన మల్లేష్‌తో తనకున్న అనుబంధాన్ని సిఎం కెసిఆర్ సంతాప సందేశంలో గుర్తు చేసుకున్నారు. మల్లేశ్ కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గుండా మల్లేష్ మృతి పట్ల రాష్ట్ర మంత్రులు ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ సంతాపాన్ని తెలిపారు. మల్లేష్ మరణం కమ్యూనిస్టు పార్టీకి, ఆ ప్రాంత ప్రజలకు తీరని లోటు అని బోయినపల్లి వినోద్‌కుమార్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. అనేక ఉద్యమాలు నిర్వహించడంతో పాటు ఎంఎల్‌ఎగా అసెంబ్లీలో ఎన్నో ప్రజా సమస్యలపై గళాన్ని వింపించారన్నారు.
కార్మిక వర్గానికి తీరని లోటు : టి.నరసింహన్
గుండా మల్లేశ్ మృతికి ఎఐటియుసి జాతీయ ఉపాధ్యక్షులు టి.నరసింహన్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఎంఎల్‌ఎగా మల్లేష్ శాసనసభలో బడుగు బలహీనవర్గాల పేద ప్రజల కార్మికవర్గ సమస్యలను లేవనెత్తి, ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. మల్లేష్ మృతి కార్మిక వర్గానికి తీరనిలోటు అఅన్నారు. మల్లేష్ మృతి పట్ల అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం (ఐప్సో) సమన్వయ ప్రధాన కార్యదర్శి కెవిఎల్ సంతాపాన్ని తెలిపారు. కమ్యూనిస్టుగా, కార్మిక నాయకునిగా అనేక శాంతి ఉద్యమాలలో పాల్గొన్న మల్లేష్ శాంతిని ఆకాంక్షించిన నేత మల్లేష్ అని కెవిఎల్ కొనియాడారు.