HomeNewsLatest Newsప్రజల కోసం, ప్రజల మధ్య సిపిఐ

ప్రజల కోసం, ప్రజల మధ్య సిపిఐ

హన్మకొండలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్‌ నిర్మాణ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఉద్బోధ

ప్రజాపక్షం / హన్మకొండ
నిత్యం ప్రజా సమస్యలపై ఉద్యమించడం ద్వారా కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేయాలని, పంచాయితీ నుంచి పార్లమెంట్‌ వరకు పార్టీ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ ప్రజలకు కమ్యూనిస్టులు గుర్తుకు రావాలని, కమ్యూనిస్టుల ద్వారానే సమస్యలు పరిష్కారమౌతాయని ప్రజలు విశ్వసించాలన్నారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి నిర్మాణ సమావేశాలు గురువారం హన్మకొండలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత హరిత హోటల్‌ ప్రాంగణంలో కమ్యూనిస్టు పార్టీ పతాకాన్ని డి.రాజా ఆవిష్కరించారు. అనంతరం సమితి సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. సిపిఐ హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి అధ్యక్షతన ప్రారంభమైన సమావేశాలలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంత్‌రావు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సమావేశాన్ని ఉద్దేశించి రాజా మాట్లాడుతూ దేశంలో వేగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించారు. మితవాద, మతవాద, పెట్టుబడిదారి శక్తులు గతం కంటే తీవ్రంగా చొచ్చుకొస్తున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొని సమసమాజాన్ని నిర్మించేందుకు కమ్యూనిస్టులు కూడా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందు కోసం విద్యార్థి, యువత, కార్మిక, కర్షక, మహిళ తదితర అన్ని వర్గాలను రాజకీయంగా చైతన్యవంతం చేయాలని, వాటి ప్రజాసంఘాలను పటిష్టంగా నిర్మించాలని ఆయన సూచించారు. కమ్యూనిస్టు పార్టీ శతాబ్ధి ఉత్సవాలను కాన్పూర్‌లో, మరోవైపు సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి ఎ.బి.బర్ధన్‌ శతజయంతి ఉత్సవాలను నాగ్‌పూర్‌లో ఘనంగా నిర్వహించడం ద్వారా కమ్యూనిస్టు శ్రేణులు స్ఫూర్తిని పొందాలని నిర్వహించనున్నట్లు రాజా తెలిపారు. వేదికపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్‌ కె.నారాయణ, సయ్యద్‌ అజీజ్‌పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు, కలవేణి శంకర్‌, వి.ఎస్‌.బోస్‌, ఎన్‌.బాలమల్లేష్‌, ఎం.బాలనరసింహ, ఇ.టి.నరసింహ ఆశీనులయ్యారు.
సిపిఐ నేతలు, ప్రముఖులకు సంతాపం
ఇటీవల కాలంలో మరణించిన సిపిఐ నేతలు, వామపక్ష, ప్రజాస్వామ్యవాదులు, ప్రముఖులకు సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సంతాపాన్ని తెలిపింది. వియత్నాం కమ్యూనిస్టు పార్టీ అధినేత డ్రోగ్‌, కమ్యూనిస్టు దిగ్గజనేత, పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేన్‌ భట్టాచార్య, సిపిఐ రాష్ట్ర కార్యాలయం కార్యదర్శిగా, కోశాధికారిగా దాదాపు 60 ఏళ్లు పనిచేసిన కామ్రేడ్‌ డి.ఎస్‌.రామచంద్రరావు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు దొడ్డా సక్కుబాయమ్మ, మహారాష్ట్రకు చెం దిన సిపిఐ సీనియర్‌ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు కామ్రేడ్‌ ప్రేమపురణ, అనంతపురం జిల్లాకు చెందిన సిపిఐ సీనియర్‌ నాయకులు కామ్రేడ్‌ ఎం.వి. రమణ, సిపిఐ ఎంఎల్‌ మాస్‌లైన్‌ రాష్ట్ర నాయకులు కామ్రేడ్‌ రాయల చంద్రశేఖర్‌, ప్రసిద్ధ కవి అడిగోపుల వెంకటరత్నం, భరతనాట్యం, కూచిపూడి నృత్యంలో ప్రసిద్ధి చెందిన యామిని కృష్ణమూర్తి, ఖమ్మం జిల్లా మధిర మండలం అల్లీనగరం సర్పంచ్‌ గౌస్‌, రైతుసంఘం నాయకులు చింతా స్వరాజ్యం లకు సిపిఐ సమావేశం సంతాపాన్ని తెలియేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం హథ్రాస్‌ తొక్కిసలాటలో మరణించిన వారికి, కేరళ రాష్ట్రం వయనాడ్‌లో పరదల వల్ల కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారికి, ఢిల్లీ రావూస్‌ కోచింగ్‌ సెంటర్‌లో కోచింగ్‌ తీసుకుంటున్న యుపిఎస్‌సి పరీక్షల అభ్యర్థులు అక్కడ సెల్లార్లోకి ఆకస్మికంగా వచ్చిన వరదల వల్ల మృతి చెందిన వారికి సిపిఐ సంతాపాన్ని తెలియజేసింది.

 

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments