*అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజిమ్.
ప్రజాపక్షం / జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి :
పది రోజులకు సరిపోయే నిత్యవసర సరుకులు, కూరగాయలు, పండ్లు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం తాసిల్దార్ లను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, ఆర్టిఓ వై వి గణేష్, తాసిల్దార్ లతో మాట్లాడి నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు, మందుల కొరత రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 21 నాటికి ధరల తో నిత్య అవసరాలు, కూరగాయలు, పండ్లు, మందులు ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు .ఇందుకు వెంటనే మండలాల వారీగా గ్రామాల్లో గల కిరాణా షాపులు, కూరగాయలు, పండ్ల వ్యాపారులతో తాసిల్దార్ సమావేశం నిర్వహించి చర్యలు చేపట్టాలని చెప్పారు. ఫోన్ ద్వారా ఇప్పటికీ అందుబాటులో ఉన్న సరకులు, కూరగాయలు, పండ్లు, మందుల స్టాక్ వివరాలను సేకరించి స్థానికంగా పండే కూరగాయలు, పండ్లతో పాటు ఇతర ప్రాంతాల నుంచి నిత్యవసర సరుకులు, కూరగాయలు,మందుల సరఫరాకు రంగం సిద్ధం చేయాలన్నారు .అందుకు సంబంధిత షాపుల యజమానులకు వాహనాల పర్మిషన్ లు అందించి పది రోజులకు సరిపోయే సరుకు దిగుమతి చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు . అలాగే జిల్లా సంయుక్త కలెక్టర్, ఆర్డిఓ, తాసిల్దార్లు ప్రతిరోజు షాపులను తనిఖీ చేసి ధరలు అదుపులో ఉండేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మరియు జిల్లా ఉద్యాన శాఖ అధికారులు తాసిల్దార్ లతో సమన్వయం చేసుకొని గ్రామాల్లో ఇండ్లలో ఇప్పటికే నిలువ చేసిన మరియు పొలాల్లో ఉన్న మిర్చి ని గుర్తించి దానిని వరంగల్లోని ఎనుమముల మార్కెట్లోని కోల్డ్ స్టోరేజ్ లో ఉంచేందుకు రవాణా సదుపాయాలు కల్పించాలని కోరారు . అదేవిధంగా మార్కెటింగ్, మార్క్ఫెడ్, సివిల్ సప్లై అధికారులు మొక్కజొన్న ను గోడౌన్లలో భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. త్వరలోనే నిరుపేదలకు ఉచితంగా బియ్యం సరఫరా చేయనునందున జిల్లా సంయుక్త కలెక్టర్, ఆర్డీవో, సివిల్ సప్లై అధికారులు బయోమెట్రిక్ పద్ధతిలో బియ్యంను అందించేందుకు లబ్ధిదారులు ఇంటికాడనే వారి చేతులను శుభ్రం చేసుకొని వచ్చేలా ఏర్పాటు చేయాలని అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ తోపాటు జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీలో మొబైల్ స్టోర్ ద్వారా ఇంటింటికీ నిత్యావసర సరుకులను అమ్మేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే శుక్రవారం మసీదులో ముస్లిం సోదరులు నమాజ్ చేయడానికి అందరికీ అనుమతి లేదని ఐదుగురిని మాత్రమే నమాజ్ చేసేందుకు మసీదులోకి అనుమతించాలని అధికారులను ఆదేశించారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ అధికారి సత్యంబాబు, జిల్లా ఉద్యానవన అధికారి అక్బర్, జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరీశంకర్, పౌరసరఫరాల డిస్ట్రిక్ట్ మేనేజర్ రాఘవేందర్, తదితరులు పాల్గొన్నారు .