ప్రచారానికి మరో నాలుగురోజులే గడువు
అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్న పార్టీలు
టిఆర్‌ఎస్‌కు ‘రెబెల్’ గుబులు
పోటీలో 12,898 మంది అభ్యర్థులు
120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు
ప్రజాపక్షం/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మరో నాలుగు రోజుల గడువే ఉండడంతో ప్రచారపర్వం ఊపందుకుంది. ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన అంశాలు, ప్రచార వ్యూహాలు తదితర అంశాలపై రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు ఎప్పటిప్పుడు దిశానిర్ధేశం చేస్తున్నాయి. ప్రధానంగా టిఆర్‌ఎస్‌కు ‘రెబెల్’ గుబులు పట్టుకున్నది. కొన్ని వార్డులలో వారు టిఆర్‌ఎస్‌కు గట్టి పోటీనిస్తున్నారు. ప్రధానంగా కార్పొరేషన్లపై టిఆర్‌ఎస్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తోంది. మొత్తం 10 కార్పొరేషన్లకు గాను హైదరాబాద్ శివారులోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఏడు కార్పొరేషన్లలో పాగా వేసేందుకు టిఆర్‌ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన కొందరు నాయకులకు వార్డుల వారీగా ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించినట్టు తెలిసింది. మరోవైపు రెబెల్స్ ప్రభావం లేకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమకు అనుకూలమైన వాతావరణం ఉన్నదని ఆ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ కొన్ని వార్డులలో ‘రెబెల్స్’ భయం వెంటాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలోని 3052 వార్డులకుగాను 12,898 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో టిఆర్‌ఎస్ నుంచి 2972 మంది పోటీ చేయగా, కాంగ్రెస్ 2616 మంది, బిజెపి నుంచి 2313 మంది, టిడిపి 347, ఎంఐఎం 276, సిపిఐ 177, సిపిఐ(ఎం) 166 మంది అభ్యర్థులు పోటీ చేయగా, గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు 282 మంది ఉన్నారు. కాగా 3749 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అయితే ఇందులో 80వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 77 మంది టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఉండగా మిగిలిన మూడు వార్డులలో ఎంఐఎం అభ్యర్థులు గెలుపొందారు.