HomeNewsBreaking Newsప్రకృతి విపత్తులకు ఉద్గారాలే కారణం?

ప్రకృతి విపత్తులకు ఉద్గారాలే కారణం?

వడగాలులు, వరదల నేపథ్యంలో శాస్త్రవేత్తల స్పష్టీకరణ
ఫోర్ట్‌ కొలిన్స్‌ (యుఎస్‌): ఇటీవల అమెరికా లో కార్చిచ్చు, కెనడాలో వడగాలులు ప్రతాపం చూపిస్తుంటే, జర్మనీ, చైనా దేశాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. ఈ విపరీత వాతావరణ పరిస్థితులకు శీతోష్ణస్థితిలో మార్పులే కారణ మా? అంటే కావచ్చు అంటున్నారు శాస్త్రవేత్త లు. అయితే ప్రతీ విపత్తునూ శీతోష్ణస్థితి మా ర్పులతో ముడిపెట్టలేమని కూడా చెప్తున్నారు. అయితే పెట్రోల్‌, డీజిల్‌, సహజవాయువు, బొగ్గు లాంటి శిలాజ ఇంధనాల నుంచి వెలువడే ఉద్గారాలను మాత్రం తగ్గించాల్సిందే అని శాస్త్రవేత్తలు స్పష్టంచేస్తున్నారు. ఉత్తరార్ధగోళం లో ఎండలు మొదలై సగం కాలం కూడా గడచిపోలేదు. కానీ వాయువ్య పసిఫిక్‌, కెనడా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా వడగాలులు వీస్తున్నాయి. అమెరికాలోని డెత్‌ వ్యాలీలో చెలరేగిన కార్చిచ్చుల కారణంగా వెలువడిన పొగ ఉత్తర అమెరికా ఖండమంతా అలుముకుంది. ఇలా ఉంటే జర్మనీ, చైనా దేశాల్లో భారీ ప్రమాణంలో వరదలు పోటెత్తా యి. వాతావరణంలో మార్పుల కారణంగా ఏర్పడుతున్న విపరీత పరిస్థితుల గురించి శాస్త్రజ్ఞులు 50 ఏళ్లుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇక ఇటీవలి వాతావరణ విపత్తుల కారణంగా చాలా మంది ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి విపరీత పరిస్థితుల్లో వాతావరణ మార్పు పాత్ర గురించి రెండు అంశాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. మొదటగా, మనుషులు భూమిని వేడెక్కించే కార్బన్‌ డై ఆక్సైడ్‌, తదితర వాయువులను వాతావరణంలోకి ఎక్కువ పరిమాణంలో విడుదల చేశారు. దాంతో ప్రకృతిలో సహజత్వానికి విఘాతం కలిగింది. రెండోది ప్రతీ వాతావరణ వైపరీత్యాన్ని భూతాపంతో ముడిపెట్టలేమన్నది వారి వాదన. అయితే వడగాలికి ముందు అమెరికాలోని పోర్ట్‌లాండ్‌లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 9 డిగ్రీల ఎక్కువగా 116 డిగ్రీల ఫారెన్‌హీట్‌ నమోదైంది. మనిషి కారణంగా తలెత్తిన శీతోష్ణస్థితి మార్పే లేకుంటే పోర్ట్‌లాండ్‌ ప్రాంతంలో వడగాలులకే ఆస్కారమే లేదంటున్నారు శాస్త్రవేత్తలు. అలా ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి జరిగే ప్రకృతి విపత్తులైన వడగాలులు, వరదలు ఇప్పుడు సర్వ సాధారణమైపోయాయి. ఇక 2003లో వడగాలుల కారణంగా యూరప్‌లో 70,000 మందికిపైగా మరణించారు. ఇలాంటి పరిస్థితుల్లో శిలాజ ఇంధనాల ఉద్గరాలను నిర్మూలించకపోతే వేడి ప్రతి పదేళ్లకోసారి కొన్నిరెట్లు పెరుగుతూ ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇలా ఉంటే శాస్త్రవేత్తలు భూతాపానికి కారణమైన వాతావరణ వైపరీత్యాలను అధ్యయనం చేస్తున్నారు. వీటిలో వడగాడ్పులు, తీరప్రాంతాల ముంపు, కరవులు, కార్చిచ్చులు, మంచు తక్కువగా కురవడం, అతిభారీ వర్షపాతం, హరికేన్లు, ఆయనరేఖా తుఫాన్లు ఎక్కువగా విరుచుకుపడటం, అత్యంత శీతల వాతావరణం, తీవ్రమైన పిడుగులతో కూడిన వానలు, వడగళ్లు, టోర్నడోలు ప్రధానమైనవి. ఇవన్నీ అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగానే ప్రతికూల ప్రభావాలను చూపుతున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే వీటికి, వాతావరణ మార్పులకు మధ్య సంబంధంపై ఇంకా అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. కాగా విపరీత వాతావరణం ప్రతికూల ప్రభావాలు శీతోష్ణస్థితిపై చూపించినట్లుగానే ప్రజలపై చూపిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మొత్తం మీద బొగ్గు, చమురు, సహజవాయువు వినియోగం ఎంత ఎక్కువైతే భూగోళ ఉష్ణోగ్రతలు అంత ఎక్కువగా ఉంటాయి. అంటే భూమిమీద ఏ ప్రదేశంపైనైనా వడగాలులు తలెత్తే ప్రమాదం ఉందన్నమాట. గత అనుభవాలను మించిపోయి వైపరీత్యాలు సంభవిస్తే మాత్రం విపత్తు సన్నద్ధత కూడా మనల్ని కాపాడలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి పోర్ట్‌లాండ్‌ స్ట్రీట్‌ కార్‌ విద్యుత్‌ తీగలు వేడికి కరిగిపోవడాన్ని ఉదాహరణగా పేర్కొంటున్నారు. అయితే ప్రజలు మౌలికవసతులు, సామాజిక ఆర్థిక వ్యవస్థలు, ప్రణాళికలు, సన్నద్ధతను అభివృద్ధి చేసుకునే క్రమంపైనే వారు విపరీత ప్రకృతి పరిస్థితులకు తట్టుకుంటారా లేదా అన్నది ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments