HomeNewsBreaking Newsప్యాట్నీ సెంటర్‌లోగద్దర్‌ విగ్రహం

ప్యాట్నీ సెంటర్‌లోగద్దర్‌ విగ్రహం

‘గద్దర్‌ ప్రజా కళల మ్యూజియం, ఫోటో గ్యాలరీ’ ఏర్పాటు చేయాలి
వామపక్ష నాయకులు, ప్రముఖ సినీగేయ,దర్శకులు డిమాండ్‌
మ్యూజియానికి ఐదు ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజాయుద్ధనౌక గద్దర్‌ సంస్మరణ సభ
ప్రజాపక్షం/హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని ప్యాట్నీ సెంటర్‌ వద్ద ప్రజా యుద్ధనౌక, ప్రముఖ వాగ్గేయకారుడు గద్దర్‌ విగ్రహాన్ని , ‘గద్దర్‌ ప్రజా కళల మ్యూజియం’, ‘గద్దర్‌ ఫోటో గ్యాలరీ’ని ఏర్పాటు చేయాలని వామపక్ష నాయకులు, ప్రముఖ సినీగేయ రచయితలు, దర్శకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మ్యూజియం నిమిత్తం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి, ఇందులో గద్దర్‌తో పాటు ప్రముఖ కళాకారుల ఆవిష్కరణలు, చరిత్రను పొందుపర్చాలని కోరారు. ఈ మేరకు ‘గద్దర్‌ సంస్మరణ సభ’ తీర్మానించింది. వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజాయుద్ధనౌక, ప్రముఖ వాగ్గేయకారుడు గద్దర్‌ సంస్మరణ సభ హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగింది. ఈ సభకు వామపక్ష నాయకులు కూనంనేని సాంబశివ రావు (సిపిఐ), తమ్మినేని వీరభద్రం(సిపిఐ(ఎం), సినీ దర్శకులు బి.నర్సింగరావు, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ, గాయకులు జయరాజ్‌, గద్దర్‌ కుమార్తె వెన్నెలతో పాటు పోటు రంగారావు, (సిపిఐ (ఎంఎల్‌ ప్రజాపంథా), సాధినేని వెంకటేశ్వర్‌రావు (సిపిఐ(ఎంఎల్‌- న్యూడెమోక్రసీ ), వనం సుధాకర్‌ (ఎంసిపిఐ), ప్రసాద్‌(సిపిఐ -ఎంఎల్‌) మురహరి(ఎస్‌యుసిఐ (యు), చలపతిరావు (సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ), రమేష్‌ రాజా(ఆర్‌ఎస్‌పి), కొమురన్న (సిపిఐ -ఎంఎల్‌(జనశక్తి), ప్రసాద్‌(ఫార్వర్డ్‌బ్లాక్‌) హాజరయ్యారు. ఈ సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌.బాలమల్లేష్‌ అధ్యక్షత వహించగా, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జి.నర్సింహరావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన పాటలతో ప్రజలలో చైతన్యం రగిలించిన మహానీయుడు గద్దర్‌కు మరణం లేదని, ప్రజల హృదయాల్లో, కళాకారుల పాటలో ఆయన సజీవంగా ఉంటారని అన్నారు. గద్దర్‌ ప్రస్థానమంతా అణగారిన వర్గాలకే అంతకిమైందని, నిత్యం వారి కోసమే పరితపించేవారని, తన చివరి శ్వాస వరకు ప్రజాస్వామ్య, రాజ్యాంగ రక్షణ, సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని కోరుకున్నారన్నారు. కమ్యూనిస్టుల వల్లనే ఆర్థిక, సామాజిక న్యాయం జరుగుతుందని విశ్వసించిన వ్యక్తి గద్దర్‌ అని, ఆయన కమ్యూనిస్టు ఎర్రజెండాకు నిజమైన వారసుడని చెప్పారు. గద్దర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే గద్దర్‌కు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ప్రపంచంలోనే ప్రముఖులైన కళాకారుల్లో గద్దర్‌ ఒకరని, ఈ శతాబ్ధం ఆయనదేనన్నారు. భవిష్యత్‌ తరాలకు కావాల్సిన కవిత,సాహిత్య సంపదను గద్దర్‌ సృష్టించారన్నారు.
కమ్యూనిస్టు ఉద్యమ, విప్లవ బాటలో వచ్చినవారే మహాత్ములయ్యారు : కూనంనేని
కమ్యూనిస్టు ఉద్యమం, విప్లవ బాటలో నుండి పుట్టినవారే మహాత్ములయ్యారని కూనంనేని సాంబశివరావు అన్నారు. చరిత్రలోని ప్రముఖులంతా ప్రజలను చదవి, వారి మనసులో వచ్చిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, రచయితలకు కమ్యూనిస్టు ఉద్యమమే ప్రేరణ కల్పించిందని గుర్తు చేశారు. గద్దర్‌లో బహుముఖ రూపాలు ఉన్నాయని, అన్ని కలయికలే గద్దర్‌ అని కొనియాడారు. ఎక్కడైతే ఇబ్బందులు, సమస్యలు ఉంటాయో, ఎక్కడైతే పేదల కష్టాలు, నష్టాలలో నుండే పుట్టినవారే కవులు, కళాకారులు అని అన్నారు. నిలబడే మనిషి, కష్టాల కోసం పుట్టిన సాహిత్యం, కవిత్వం, విప్లవ కవిత్వాలకు, సాహిత్యానికి జన్మనిచ్చిందే కమ్యూనిస్టు ఉద్యమం అని, గద్దర్‌ అంతిమంగా ఎర్రజెండానే రావాలని కోరుకున్నారన్నారు. ప్రశ్నించేతత్వాన్ని ప్రజా పోరాటాల కొనసాగించాలన్నారు. జనాలు ఉన్నారు కాబట్టే కాంగ్రెస్‌, బిజెపి సభలకు గద్దర్‌ వెళ్లారని, ఎక్కడ జనం ఉంటే అక్కడ గద్దర్‌ ఉన్నారని వివరించారు. ఎర్ర జెండాలు ఎప్పుడు ఒకటవుతాయని అందరూ కోరుకుంటున్నారని, సమాజంలోని బాధిత, పీడిత వర్గాల గొంతుకగా ఎర్రజెండా నిలవాలని ఆకాంక్షిస్తున్నారని కూనంనేని తెలిపారు. గద్దర్‌ మరణాన్ని రాజకీయం చేసేందుకు చాలా మంది ప్రయత్నించారని, గద్దర్‌ బతికున్నప్పుడు వేధించారని, ఇది పాలకుల సహజ లక్షణమన్నారు. పాడే వాడి గొంతు నులుముతారని, ప్రశ్నించేవాడి గొంతును, తుపాకీతో పోరాటంచేసే వాడి చేతులను, గజ్జె కట్టిన కాళ్లను, చివరకు కంఠాన్ని తీయడం పాలకుల లక్షణమని, చివరకు మరణించిన తర్వాత రాజకీయం చేసేందుకు అందరూ వస్తారని కూనంనేని వ్యాఖ్యానించారు.
తమ్మినినేని వీరభద్రం మాట్లాడుతూ కమ్యూనిస్టు ఎర్రజెండాను నిలబెట్టడమే గద్దర్‌ ఆశయమన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ప్రజా సమస్యలపై ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిస్టుల అవసరం ఎంతైనా ఉన్నదని, అదే సమయంలో కమ్యూనిస్టులు బలహీనంగా ఉన్నామని, దీనిని అధిగమించేందుకు పూనుకోవాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా బలహీనంగా ఉన్న కమ్యూనిస్టులు బలంగా మారారని గుర్తు చేశారు.
బి.నర్సింగరావు మాట్లాడుతూ ప్రపంచ కళాకారుల్లో ఎవ్వరికీ తీసిపోని వ్యక్తి గద్దర్‌ అని కొనియాడారు. గద్దర్‌ తన 50 ఏళ్లు నిత్యం ప్రజల కోసమే పనిచేశారని, తన ప్రాణాలను కూడా లెక్కచేయలేదన్నారు. ప్రజలను ప్రేరేపితం చేసే పాటలను ఆలపించారని, ప్రజల కోసం అనేక గేయాలను రాసి పాడారన్నారు. గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ గద్దర్‌ ఒక గౌతమ బుద్ద నౌక అని అభివర్ణించారు. గద్దర్‌ చచ్చిపోలేదని, భవిష్యత్‌ తరాలకు కావాల్సిన కళా సందపను ఇచ్చిపోయారని, అయనొక పాటల సముద్రమని, వందల మంది గద్దర్‌కు పురుడుపోశారని, ప్రకృతిని ఉద్యమానికి జోడిస్తూ కొత్త రకమైన పాటల వంతెనను నిర్మించారని, ఇది భవిష్యత్‌ కళాకారులకు ఎంతో ఉపయోగమన్నారు. గోసి, గొంగడి సుద్దాల హన్మంతు నుండి నేర్చుకున్నానని స్వయంగా గద్దర్‌ చెప్పినట్టు అశోక్‌ తేజ వివరించారు.గద్దర్‌ కుమార్తె వెన్నెల మాట్లాడుతూ గద్దర్‌ తన చివరి వరకు ‘సేవ్‌ కాన్స్‌ట్యూషన్‌, సేవ్‌ డెమోక్రసీ..సేవ్‌ ఇండియా’ అన్నారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. గద్దర్‌ ఎర్రజెండాను తన గుండెకు హత్తుకునేవారని, ఎర్రజెండాతో పాటు అన్ని జెండాలు, అందరిని కలుపుకుని ముందుకు సాగాలని పరితపించారని, నవతరం కోసం ఏదో చెప్పాలని, ఏదో ఇవ్వాలని అనుకున్నారని తెలిపారు. జయరాజ్‌ మాట్లాడుతూ గద్దర్‌పై తూటాలు పేల్చిన పోలీసులతోనే గౌరవ వందనం చేయించుకున్న మహోన్నత వ్యక్తి గద్దర్‌ అని కొనియాడారు. పోటు రంగారావు మాట్లాడుతూ రక్తపు ప్రవాహాన్ని విప్లవ ప్రవాహంగా మార్చిన వ్యక్తి గద్దర్‌ అని అన్నారు. సాధినేని వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ గద్దర్‌ ఒక సాంస్కృతిక విప్లవకారుడన్నారు. మురహరి మాట్లాడుతూ విప్లవం రావాలని కోరుకున్న వ్యక్తి అని గద్దర్‌ అన్నారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి గద్దర్‌ అని ప్రసాద్‌ అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments