ముస్లింలను మినహాయించడం దారుణం
ఇబిసి రిజర్వేషన్ బిల్లు ఎన్నికల జిమ్మిక్కు
ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ చట్టాన్ని ఉపసంహరించాల్సిందే
మీడియా సమావేశంలో సురవరం సుధాకర్‌రెడ్డి
ప్రజాపక్షం / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా రాజ్యాంగ వ్యతిరేక చర్యకు పాల్పడిందని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ్‌ను తిరిగి నియమించాలన్న సుప్రీంకోర్టు తీర్పు మోడీ ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదని అన్నారు. అలోక్‌వర్మ సెల వు కాలానికి సంబంధించి సర్వీసును పొడిగించాలని డిమాండ్ చేశారు. మఖ్దూంభవన్‌లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చే హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులకు మాత్రమే పౌరసత్వం కల్పిస్తూ కేంద్రం బిల్లు పెట్టడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ముస్లింలను మినహాయించడం ద్వారా కేంద్రం ముస్లిం వ్యతిరేక వైఖరిని బట్టబయలు చేసిందని చెప్పారు. ఈ బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా అసొంలో బంద్ జరిగిందని, అన్ని పార్టీలు బంద్‌కు మద్దతు తెలిపాయన్నారు. అసోం గణపరిషత్ ఎన్‌డిఎ నుండి బయటికి వచ్చిందని చెప్పారు. ముస్లిం ప్రొటెం స్పీకర్ ఉంటే ప్రమాణ స్వీకారం చేయనని బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ చెప్పడం బిజెపి ముస్లిం వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. ఈ వైఖరి తీసుకున్న బిజెపికి కెసిఆర్ మద్దతు ఇస్తున్నారని, కెసిఆర్‌కు ఓవైసి మద్దతిస్తున్నారని, దీనిపై ప్రజల్లో అవగాహన పెరగాలని పేర్కొన్నారు. ఇబిసి రిజర్వేషన్ల బిల్లు ఎన్నికల జిమ్మిక్కు అని, పార్లమెంటు ఎన్నికలకు ముందు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల పేరుతో బిజెపి మభ్యపెడుతోందని విమర్శించారు.
సమ్మె జయప్రదం : దేశవ్యాప్తంగా రెండో రోజు కార్మిక సమ్మె జయప్రదమైందని సుధాకర్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ఒక వైపు కార్మికులు బ్రహ్మాండమైన సమ్మె, పోరాటం చేస్తుంటే మరోవైపు కేంద్రం పార్లమెంటులో కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చిందని ఆయన విమర్శించారు. కేంద్రం ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ చట్టాన్ని తెచ్చిందని, పూర్తిగా కార్మికవర్గానికి వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారని అందులో ఒక్క బ్యాంకింగ్ రంగం నుంచే 12 లక్షల మందికి పైగా పాల్గొన్నారని తెలిపారు. సమ్మెలో పారిశ్రామిక, ఆర్థిక, రవాణా, టెలికమ్యూనికేషన్ ఉద్యోగులు, సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారన్నారు. ముంబాయి నగరంలో రవాణా పూర్తిగా స్తంభించి పోయిందన్నారు.