అకాడమీలో 40 మందికి పాజిటివ్ : శిక్షణ రద్దు
ప్రజాపక్షం/హైదరాబాద్
ఫ్రంట్ లైన్ వారియర్స్ పదోన్నతులకు కరోనా కష్టాలు మొదలయ్యాయి. విధి నిర్వహణలో కరోనా పాజిటివ్ వచ్చి పూర్తిగా కోలుకున్న పోలీసులను ఎంతో గౌరవంతో సన్మానించిన పోలీసు యంత్రాంగమే, ఇప్పుడు వారిని దూరం పెడుతోంది. తద్వారా వారు తమ పదోన్నతులకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయనే ఆందోళన వారిని వెంటాడుతోంది. అప్పాలో శిక్షణ పొందుతున్న కొందరు పోలీసులకు కరోనా పాజటివ్ నిర్ధారణ కావడంతో వారిని శిక్షణ నుంచి ఇంటికి పంపించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 40 మంది ప్రస్తుతం పోలీ సు శిక్షణకు దూరంగా ఉన్నారు. అవుట్ స్టాం డింగ్ సీనియారిటీ పోస్టులో ఉన్న పోలీసులు తమకు పదోన్నతులకు అర్హత కల్పించాలని 2004లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో పదోన్నతులకు అర్హులేనని న్యాయస్థానం ఇటీవలే తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే సుమా రు 370 జమేదార్లు, ఎఎస్‌ఐలను పోలీసుశాఖ మూడు నెలలపాటు వారికి శిక్షణ నిమిత్తం హైదరాబాద్ శివారులోని అప్పా కేంద్రానికి పంపించింది. ఈ శిక్షణ పూర్తి కాగానే వారి వారి సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. అయితే శిక్షణ నిమిత్తం వెళ్లిన పోలీసుల్లో సుమారు 40 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారిని శిక్షణ నుంచి పూర్తిగా తొలగించి ఇంటికి పంపించారు. తీరా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత వారు శిక్షణకు అనుమతిస్తారని ఎంతో ఆశపడ్డారు. కానీ ఇక శిక్షణ లేదని, ఎవరికి వారు ఇది వరకు ఏ విభాగంలో ఏ హోదాలో పని చేశారో అదే పోస్టులకు పోవాలని స్పష్టం చేశారు. దీంతో తమ పరిస్థితి ఏమిటని వారు వాపోతున్నారు. తమ పదోన్నతుల కోసం ఏళ్ల తరబడి న్యాయస్థానంలో పోరాటం చేశామని, చివరకు తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, తీరా శిక్షణకు వెళ్తే కరోనా పాజిటివ్ పేరుతో పూర్తిగా శిక్షించారని వాపోతున్నారు. ఒక వైపు విధుల్లో ఉన్నవారికి పాజిటివ్ వస్తే సన్మానిస్తున్నారని, అదే శిక్షణలో ఉంటే మాత్రం తమను పూర్తిగా ఇంటికి ఎలా పంపిస్తారని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు శిక్షణ వద్దంటే మళ్లీ ఎప్పుడు పిలుస్తారో తెలియదని, మరో వైపు శిక్షణ పూర్తవుతేనే తాము పదోన్నతులకు అర్హులమని, పైగా పదోన్నతుల జాబితాలో తాము ముందున్నామని కొందరు చెబుతున్నారు. ఇప్పటికే పదోన్నతులకు ఆలస్యం జరుగుతుంటే కరోనా పాజిటివ్ పేరుతో పదోన్నతులకు దూరంగా పెట్టడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పోలీసు పదోన్నతులపై కరోనా ఎఫెక్ట్
RELATED ARTICLES