లక్నోలో సిఎఎ వ్యతిరేక నిరసనకారులను తరిమికొట్టిన ఖాకీలు
లక్నో: పౌరసత్వ సవరణ చట్టానికి (సిఎఎ) వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చారిత్రక క్లాక్‌టవర్ వద్ద మహిళా నిరసనకారులు చేపట్టిన ఆందోళనలను గురువారం కూడా కొనసాగాయి. ఇదే తరహా ఆందోళనలు రాయబరేలి, ఆజాంగఢ్‌లో కూడా నిర్వహించారు. అయితే సిఎఎకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేసేందుకు వారణాసిలోని బినియాబాగ్ మైదానానికి పెద్ద ఎత్తున చేరుకున్న మహిళలు, యువతపై పోలీసులు విరుచుకుపడ్డారు. మైదానాన్ని ఖాళీ చేయించేందుకు వారిని అక్కడి నుంచి తరిమికొట్టారు. ఈ దృశ్యాలన్నీ వీడియోలో చిత్రీకరించబడ్డాయి. ఆజాంగఢ్‌లోని ముబారక్‌పూర్ పట్టణంలో ఉన్న హైదరాబాద్ కపూరా షా దివన్‌కి బాగియాలో బుధవారం సంవిధాన్ బచావో సంఘర్ష్ సమితి బ్యానర్ కింద విభిన్న విశ్వాసాలు కలిగిన మహిళలు నిరసన తెలియజేశారు. అదే విధంగా సిఎఎకు వ్యతిరేకంగా రాయ్‌బరేలిలోని టన్‌హాల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మహిళలు నిరసన ప్రదర్శనను ప్రారంభించారు. కొత్త చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే సిఎఎను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనల నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా సంసిద్ధమై ఉన్నట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఇదిలా ఉండగా, గత శుక్రవారం నుంచి లక్నోలో మహిళలు తమ చిన్నారులతో కలిసి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ, ప్లకార్డులను ప్రదర్శిస్తూ విప్లవం వర్థిల్లాలి, సిఎఎ, ఎన్‌ఆర్‌సిలను ఉపసంహరించుకోవాలంటూ నినదించారు.
యుపి సిఎంపై ప్రతిపక్షాల మండిపాటు
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారు ‘ఆజాది’ నినాదాలు చేస్తే వారిని దేశద్రోహులుగా పరగణిస్తామని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించగా ఆయనపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధజమెత్తాయి. రాష్ట్రంలో బ్రిటీష్ పాలన కొనసాగుతోందని సమాజ్‌వాది పార్టీ పేర్కొనగా, సిఎంది నియంతల భాష అని కాంగ్రెస్ అభివర్ణించింది. సిఎం యోగి బుధవారం కాన్పూర్‌లో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా మాట్లాడుతూ కశ్మీర్‌లో వలే ఇక్కడ కూడా ఆజాది నినాదాలు చేస్తే అది దేశం ద్రోహం కిందకు వస్తుందని, అలాంటి వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. యోగి వ్యాఖ్యలపై ఎస్‌పి సీనియర్ నేత రామ్ గోవింద్ చౌదరి స్పందించారు. బ్రిటీష్ వారు కూడా స్వాతంత్య్ర సమరయోధులను ఉగ్రవాదులుగా పేర్కొన్నారు. ఇప్పుడు బ్రిటీష్ తరహా పాలనను కొనసాగిస్తున్న వారు కూడా ఆజాది నినాదాలు చేస్తున్న వారిని దేశద్రోహులుగా అభివర్ణిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం వ్యాఖ్యలకు ఏ మాత్రం కలత చెందాల్సిన అవసరం లేదని, వారి పతనం మొదలైంది చౌదరి వ్యాఖ్యానించారు. అదే విధంగా ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ మాట్లాడుతూ సిఎం నియంతల భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు.