ఎపిలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ : నేడు పోలింగ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల పై ఉత్కంఠ వీడింది. రాష్ట్రంలో జెడ్‌పిటిసి, ఎం పిటిసి ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టేసింది. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఫలితాలను ప్రకటించవద్ద ని ఎస్‌ఇసిని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి మంగళవారం ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) కార్యదర్శి కన్నబాబు ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో డివిజన్ బెంచ్ ఎదుట వాదనలు జరిగాయి. ఎస్‌ఇసి తరపున సీనియర్ న్యాయవాది సివి మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. వర్ల రామయ్య టిడిపి తరఫున పిటిషన్ వేయలేదని, వ్యక్తిగతంగా రిట్ పిటిషన్ వేయకూడదని సివి మోహన్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 28 రోజులు కోడ్ ఉండాలనేది సుప్రీం ప్రత్యేక సందర్భంలో ఇచ్చిందని పేర్కొన్నారు. కోడ్ నిబంధన ఈ ఎన్నికలకు వర్తింప జేయాల్సిన అవసరం లేదన్నారు. పిటిషన్‌లో సరైన వివరాలు లేవని ఎస్‌ఇసిపై హై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. సరైన పేపర్లతో మధ్యాహ్నం 12 గంటలకు కోర్టు ముం దుకు రావాలని ఎస్‌ఇసి తరఫు న్యాయవాదికి ధర్మాసనం ఆదేశించింది. మధ్యాహ్నం 12గంటల తర్వాత మరోసారి వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఉత్తర్వులు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
నేడు పోలింగ్
పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో పోలింగ్‌కు అధికార యంత్రాంగం ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రితో గ్రామాలకు తరలి వెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా 515 జెడ్‌పిటిసి, 7.220 ఎంపిటిసి స్థానాల్లో ఎన్నికల పో లింగ్ జరగనుంది. జెడ్‌పిటిసి స్థానాల్లో 2,058 మంది,ఎంపిటిసి స్థానాల్లో 18,782 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలోని 2,46,71,002 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పరిషత్ ఎన్నికల కోసం 27,751 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. వీటిలో 6,492 సమస్యాత్మక, 6,314 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు.
డివిజన్ బెంచ్ తీర్పుపై సుప్రీంకు టిడిపి
పరిషత్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టిడిపి సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ డివిజన్ బెంచ్ వెల్లడించిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని టిడిపి నిర్ణయించింది. దీనిపై న్యాయసలహా తీసుకున్న అనంతరం ముందుకెళ్లాలని భావిస్తోంది. ఈ సందర్భంగా టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు పట్ల తాము సంతృప్తిగా లేమన్నారు.
పోలింగ్ జరపండి! ఫలితాలు ఆపండి!!
RELATED ARTICLES