ప్రాజెక్టు ఎత్తు తగ్గించే దిశగా కృషి చేయాలి
ఎపిలో విలీనం చేసిన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్
ప్రజాపక్షం/చర్ల కేంద్రంలోని బిజెపి పాలనలో ప్రజల బతుకులు అగమ్యగోచరంగా మారాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. భద్రాచలం నియోజకవర్గం చర్ల మండల కేంద్రంలో ఉన్న కెఎన్‌ఆర్ గార్డెన్స్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎనిమిదన్నరేళ్ల పాలనలో బిజెపి ప్రజలకు ఏం మేలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలనను వదిలి.. గుళ్లుగోపురాలపై దృష్టి సారిం చి.. మత విధ్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుందని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమాన్ని మరిచి ప్రజల దృష్టిని మళ్లీంచేందుకు కరీంనగర్, నిజాంబాద్ జిల్లా పేర్లు మార్చాలని యత్నించడం కుటిల బుద్ధికి నిదర్శనమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని, పదికి పది అసెంబ్లీ స్థానా లు బిజెపియేతర పార్టీలే దక్కించుకుంటాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆంధ్రాతోపాటు తెలంగాణలో వేలాది మంది నిరాశ్రయులవుతున్నారని, ఆ ప్రాజెక్టు ఎత్తుతగ్గించే దిశగా కృషి చేయాలన్నారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో సీతమ్మసాగర్ కరకట్ట నిర్మాణాన్ని చేపడుతున్నారని, దానిని భద్రాచలం కరకట్టకు అనుసంధానం చేసి నిర్మించాలని డిమాండ్ చేశారు. చర్ల మండంలోని ఒద్దిపేట చెక్ డ్యాం నిర్మాణం గత కొన్ని దశాబ్దాల సమస్య అని, అది సాధ్యం కాదు… కాబట్టి దాని స్థానే గోదావరి నదిపై లిఫ్టు ఇరిగేషన్లు ఏర్పాటు చేయడం వల్ల మండలంలోని 18 గ్రామాలకు చెందిన వ్యవసాయ భూములు సారవంతమవుతాయన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఎపిలో విలీనం చేసిన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని, భద్రాచలం గ్రామపంచాయతీని మూడు ముక్కలు చేసే జిఒను వెంటనే రద్దు చేయాలన్నారు. గోదావరి వరద సమయంలో భద్రాచలం పర్యటనకు వచ్చిన కెసిఆర్ పట్టణంలోని వరద సహాయక చర్యల్లో భాగంగా ప్రకటించిన రూ.1000 కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంతో పాటు ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం సిపిఐ అనేక పోరాటాలు చేసిందని, ప్రజా శ్రేయస్సు కోసం ఎంతటి త్యాగాలకైనా పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ బిజెపియేతర పార్టీలకే తమ మద్దతు ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో సిపిఐ, సిపిఐ(ఎం) కలిసి పనిచేస్తాయని, అసెంబ్లీలో ప్రజల గళాన్ని వినిపిస్తాయని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్‌కె సాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, జిల్లా సమితి సభ్యులు అడ్డగర్ల తాతాజీ తదితరులు పాల్గొన్నారు.
నిరంతరం ఎర్రజెండా పదిలం
కాగా, నిత్యం ప్రజలతోనే సిపిఐ ఉందని, ఉటుందని, పదవులున్నా…లేకున్నా నిరంతరం ప్రజల పక్షాన నిలబడే ఎర్రజెండాలు సజీవంగా ఉంటాయని కూనంనేని అన్నారు. భద్రాచలం నియోకవర్గ స్థాయి సమావేశం గురువారం చర్ల మండల కేంద్రంలో రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన కెఎన్‌ఆర్ గార్డెన్‌లో జరిగింది. నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. పదవుల కోసం కక్కుర్తి పడే నీచ సంస్కృతి ఎర్రజెండాలకు లేదని, పదువుల కోసం, డబ్బుల కోసం పార్టీ మార్చే పరిస్థితి తమది కాదన్నారు. నీతికి నిజాయితీగా కమ్యూనిస్టు నిలబడుతుందని, అందుకే ఇన్నేళ్లయినా సజీవంగా ఉందన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో సిపిఐ పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని, మన శక్తియుక్తులన్నీంటిని ఎదురొడ్డి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కులాలు మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు కొందరు చూస్తున్నారని, అలాంటి వారి ఆటలు సాగనివ్వొద్దని పిలుపునిచ్చారు.
‘పోలవరం’తో తెలుగు రాష్ట్రాల్లో వేలాదిమంది నిరాశ్రయులు
RELATED ARTICLES