రైతు మహాధర్నాలో నేతలు
ప్రజాపక్షం / హైదరాబాద్ రైతు వ్యతిరేక కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటాన్ని కొనసాగించాలని పలువురు వక్తలు అన్నారు. రైతు వ్యతిరేక చర్యలను ఉపసంహరించుకోవాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఎఐకెఎస్‌సిసి) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లోని ధర్నాచౌక్ వద్ద బుధవారం జరిగిన మహాధర్నా – చలో హైదరాబాద్ కార్యక్రమంలో వారు హెచ్చరించారు. రైతు వ్యతిరేక కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును పండించే పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలనే ప్రధాన డిమాండ్లతో దేశ వ్యాప్తంగా రైతుల పోరాటం జరుగుతోంది. ఈ పోరాటానికి మద్దతుగా హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద ఈ నెల 14 నుంచి ధర్నాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం మహాధర్నా జరిగింది. ఈ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రైతులు, రైతు నాయకులు, కార్మిక, వ్యవసాయ, గిరిజన, కౌలు, పాల రైతుల సంఘాలు, యువజన, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ధర్నాకు హాజరయ్యారు. (ఎఐకెఎస్‌సిసి) తెలంగాణ రాష్ట్ర కన్వీనర్లు పశ్యపద్మ, టి.సాగర్, రాయల చంద్రశేఖర్, అచ్యుతరామారావు, కన్నెగంటి రవి, సాయన్న అధ్యక్షతన జరిగిన ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్‌రెడ్డి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎఐకెఎస్‌సిసి పంజాబ్ రాష్ట్ర నేత సత్‌బీర్‌సింగ్, టిజెఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, ఎఐకెఎస్‌సిసి వర్కింగ్ గ్రూప్ సభ్యులు విస్సా కిరణ్, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు పోటురంగారావు, సాదినేని వెంకటేశ్వరరావు, ట్రాన్స్‌జెండర్ జెఎసి నేత విమల, గృహ కార్మికుల సంఘం నాయకులు రేణుక, గిరిజన, ఆదివాసి, మహిళా రైతు నాయకులు సుమంత్, జక్కుల వెంకటయ్య, ఎస్‌యుసిఐ నాయకులు కె.మురహరి, సిపిఐ (ఎం.ఎల్) నాయకులు ప్రసాద్, రైతు కూలీ సంఘం నాయకులు నాగిరెడ్డి తదితరులు ప్రసంగించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వారు ప్రకటించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలపై ముఖ్యమంత్రి యూటర్న్ తీసుకోవాడాన్ని వారు తీవ్రంగా విమర్శించారు. నూతన ఆర్థిక విధానాల అమలులో కొత్త వ్యవసాయ చట్టాలు భాగమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకే కొత్త వ్యవసాయ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాలు అమలైతే, మద్దతు ధర కంటే కూడా తక్కువ ధరకే రైతులు తమ పంటలను అమ్ముకోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాలకు 25 శాతం, మొక్కజొన్నకు 41 శాతం, వేరుశనగకు 19శాతం, పత్తికి 19 శాతం తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. ఇలాంటి దుస్థితికి కేంద్ర ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ను పూర్తిగా నీరుగార్చడమే నూతన చట్టాల ఉద్దేశమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార భద్రత చట్టాన్ని సాధించుకున్న ప్రజలు, యువత, ప్రస్తుతం కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలతో నిర్వీర్యం అవుతుందని తెలిపారు. ఈ చట్టాలు కేవలం రైతులకే కాదని మొత్తం నిరుపేదలకు వ్యతిరేకమని అన్నారు. ఈ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈధర్నాలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపి సయ్యద్ అజీజ్‌పాషా, సిపిఐ(ఎం) నాయకులు జూలకంటి రంగారెడ్డి, పాలమూరు అధ్యయన వేదిక నాయకులు రాఘవాచారి, అంబటినాగయ్య, తెలంగాణ విద్యావంతుల వేదిక, టిజెఎస్ నాయకులు ప్రొఫెసర్ రమేష్‌రెడ్డి, ఎంసిపిఐ(యు) నాయకులు గోదగాని రవి, ఎన్‌ఎపిఎం, మేరసంఘం, మిత్ర, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు, పిఒడబ్ల్యు, ఎఐవైఎఫ్, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర నాయకులు పాల్గొని మద్దతు పలికారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు, ప్రజాగాయకులు విమల తమ గేయాలతో సబికులను చైతన్య పరిచారు.
పోరు ఆగదు
RELATED ARTICLES