ప్రజాపక్షం/హైదరాబాద్ రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అఖిలభారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఎఐకెఎస్‌సిసి) కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఢిల్లీలో నిరసన వ్యక్తం చేసిన రైతులపై కేంద్ర ప్రభుత్వం అరాచకంగా ప్రవర్తిస్తోందని, దాడులకు పాల్పడడం అన్యాయమని తెలిపింది. రైతులపై జరిగిన దాడులను నిరసిస్తూ ఈ నెల 8న చేపట్టనున్న “భారత్‌బంద్”ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. (ఎఐకెఎస్‌సిసి)ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరుల స్తూపం వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐకెఎస్‌సిసి రాష్ట్ర కన్వీనర్‌లు పశ్యపద్మ, టి.సాగర్, వేములపల్లి వెంకట్రామయ్య,అచ్యుతరామారావు,కన్నెగంటి రవి, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు కాంతయ్య, నాయకులు పరుచూరి జమున, దేవభక్తుని సంధ్య, ఏసుమణి, చంద్రయ్య,రాములు, తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు ప్రసాద్, సారంపల్లి మల్లారెడ్డి, డి.జి.నర్సింహా,(సిపిఐ(ఎం), సంధ్య (పిఒడబ్ల్యు), పోటు రంగారావు (సిపిఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ),రైతు సంఘాల నాయకులు వీసా కిరణ్, విమలతో పాటు పలు ప్రజా, రైతు సంఘాల నాయకులు హాజరయ్యారు. “కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను తిరస్కరించాలని, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి” అని డిమాండ్ చేస్తూ ప్ల కార్డులను ప్రదర్శించారు. అనంతరం ఎఐకెఎస్‌సిసి రాష్ట్ర కన్వీనర్ పశ్యపద్మ మాట్లాడుతూ పశ్యపద్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలు రైతులను సర్వనాశనం చేసేవని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీకి చేరకుని నిరసన వ్యక్తం చేస్తే కేంద్ర ప్రభుత్వం వారిపై జవానులతో దాడులు చేయించిందని, ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు మద్దతు ధరల చట్టం చేయాలని, దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని పశ్యపద్మ డిమాండ్ చేశారు. టి.సాగర్ మాట్లాడుతూ వ్యవసాయ వ్యతిరేక చట్టాలకు నిరసనగా తొమ్మిది రోజులుగా రైతులు ఢిల్లీలోని రహదారులను దిగ్బందం చేశారని, వారితో కేంద్ర ప్రభుత్వం మూడు సార్లు చర్చలకు ఆహ్వానించినప్పటికీ రైతులకు స్పష్టమైన హామీని ఇవ్వలేకపోయిందన్నారు. వేములపలి వెంకట్రామయ్య మాట్లాడుతూ రైతు వ్యతిరేక చర్యలను వెంటనే మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈనెల 8న చేపట్టనున్న ‘భారత్ బంద్’ను టిఆర్‌ఎస్, వామపక్షాలు, కాంగ్రెస్, టిజెఎస్ మద్దతు ఇవ్వాలని కోరారు.