సమస్య పరిష్కారానికి రెవెన్యూ,అటవీ,గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు
జిహెచ్ఎంసి, మున్సిపల్ కార్పొరేషన్లలో కో ఆప్షన్ సభ్యుల సంఖ్య పెంపు
సుంకిశాల నుంచి హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా వ్యవస్థ మెరుగు
ప్రతి నియోజకవర్గంలో మరో 500 మందికి దళితబంధు
రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్ణయం
ప్రజాపక్షం / హైదరాబాద్ గిరిజనుల పోడు భూముల సమస్య పరిష్కారానికి రెవెన్యూ,అటవీ,గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల మంత్రుల నేతృత్వంలో ప్రతి జిల్లాలో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు చేపట్టాలని మంత్రిమండలి సూచించింది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. జిహెచ్ఎంసి, మున్సిపల్ కార్పొరేషన్లలో కో ఆప్షన్ సభ్యుల సంఖ్యను పెంచాలని సమావేశం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిహెచ్ఎంసిలో 5 నుండి 15 వరకు, ఇతర కార్పొరేషన్లలో 5 నుండి 10 మంది వరకు కో ఆప్షన్ సభ్యుల సంఖ్యను పెంచాలని తీర్మానించింది. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఫారెస్ట్ యూనివర్శిటీకి కొత్త పోస్టులను మంజూరీ చేయాలని తీర్మానించింది. అలాగే సుంకిశాల నుంచి హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా వ్యవస్థను మెరుగు పరచాలని క్యాబినెట్ నిర్ణయించింది. అందులో భాగంగా అదనంగా 33 టిఎంసిల నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేందుకు నిర్ణయించింది. అందుకు గాను రూ. 2214.79 కోట్లను మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కోర్టు భవనాల నిర్మాణాలకు 21 జిల్లా కేంద్రాల్లో స్థలాలను కేటాయించాలని, భద్రాచలంలో ముంపు ప్రాంతాల్లోని 2016 కుటుంబాలకు నూతనంగా కాలనీలను నిర్మించి ఇవ్వాలని క్యాబినెట్ తీర్మానించింది.
ప్రతి నియోజకర్గంలో మరో 500 మందికి దళితబంధు
రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం అందచేస్తున్న వంద మందితో పాటు ప్రతి నియోజకవర్గానికి మరో 500 మందికి దళితబంధు పథకాన్ని విస్తరించాలని మంత్రిమండలి నిర్ణయించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తంగా అమలు చేస్తున్న నేపథ్యంలో, మిగిలిన 118 నియోజక వర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 500 మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, దళితబంధు పథకాన్ని అమలు చేయాలని తీర్మానించింది. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరగా ముగించాలని అధికారులను క్యాబినెట్ ఆదేశించింది.
‘పోడు’ భూములకు మోక్షం!
RELATED ARTICLES