4న అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి
5 నుంచి ‘పల్లె పల్లెకు సిపిఐ’ కార్యక్రమం
రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు వెల్లడించిన చాడ
ప్రజాపక్షం/హైదరాబాద్ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఉద్యమం చేస్తున్న రైతుల్లో ఇప్పటికే సుమారు 20 మంది రైతులు చనిపోయారని, ఇంకెంత మంది చనిపోవాలని ప్రధాని మోడీ కోరుకుంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని సిఎం కెసిఆర్ మాట ఇచ్చి తప్పారని, పోడు భూముల సమస్యల పరిష్కారానికి జనవరి 4న అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఈ నెల 26న సిపిఐ 95వ వ్యవస్థాపక దినోత్సవాన్ని విస్తృతంగా నిర్వహించనున్నామని, జనవరి 5 నుంచి 10వ తేదీ వరకు, ఆ తర్వాత 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రెండు దఫాలుగా “పల్లెపల్లెకు సిపిఐ – ప్రజల వద్దకు సిపిఐ” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అధ్యక్షతన జరిగిన సిపిఐ రాష్ట్ర విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశ నిర్ణయాలు, తీర్మానాలను హైదరాబాద్‌లోని మఖ్ధూంభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ఆందోళనకు సిపిఐ కార్యవర్గ సమావేశం సంపూర్ణ మద్దతు వ్యక్తం చేసిందన్నారు. ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు ఆందోళన కార్యక్రమాల్లో ప్రధానపాత్ర పోషించాలని, రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు గ్రామ, మండల స్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు. పోడుభూముల సాగుదారులకు పట్టాలిస్తామని, పోడు సమస్యను పరిష్కరిస్తామని స్వయంగా సిఎం కెసిఆర్ ప్రకటించినా ఇప్పటికీ అమలు కాలేదని చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. పోడుభూముల్లో అటవీ శాఖ అధికారుల దాడులు పెరుగుతున్నాయని, పోడు రైతులపై పిడియాక్ట్ కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అటవీ అధికారులు పోడుభూములపై దాడులను వెంటనే నిలుపుదల చేయాలని, పోడుభూముల సమస్యలను పరిష్కరించి, అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించి రెండేళ్లు అవుతున్నప్పటికీ ఆ హామీని అమలు చేయడం లేదన్నారు. ఉద్యోగ ఖాళీలు, నిరుద్యోగభృతి, ఎస్‌సి,ఎస్‌టి, బిసి, మైనార్టీ యాక్షన్ ప్లాన్, యూనిట్లకు నిధుల విడుదల, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ పలు అంశాలపై జిల్లాల వారీగా ఎఐవైఎఫ్ చేపట్టే ఆందోళనకు సిపిఐ సంపూర్ణ మద్దతును ఇస్తుందని చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద చర్యలు, కార్పొరేటీకరణ అనుకూల విధానాలను నిరసిస్తూ, మరో వైపు ప్రజలను చైతన్యపర్చి ప్రత్యక్ష ఆందోళనకు పూనుకోవాలన్నారు. జనవరిలో 15 రోజుల పాటు జరిగే “పల్లె పల్లెకు సిపిఐ – ప్రజల వద్దకు సిపిఐ” కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విధిగా పాల్గొనాలని చాడ వెంకట్‌రెడ్డి సూచించారు.
వరంగల్, ఖమ్మంలో ఉద్యమాలు: చాడ వెంకట్‌రెడ్డి
వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే డివిజన్లను నిర్ధిష్టంగా గుర్తించి, స్థానిక అంశాలపై ఉద్యమాలు చేపట్టి ప్రజలతో మమేకం కావాలని చాడ వెంకట్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. పట్టభద్రుల నియోజకవర్గాలు హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ రెండు నియోజకవర్గాల్లో కూడా జనవరి వరకు ఓటరు నమోదు కార్యక్రమాన్ని కొనసాగించాలని, దీనిపై పార్టీ, ప్రజా సంఘాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
పోడు పోరు
RELATED ARTICLES