రైతులు కోరింది ఏడు లక్షల ఎకరాలు
ప్రభుత్వం ఇస్తానంటున్నది నాలుగు లక్షల ఎకరాలే
పోడు రైతుల ఆశలు గల్లంతేనా?
ప్రజాపక్షం/ ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలో అనేక దశాబ్దాలుగా పోడు పోరు రగుతున్న విషయం విధితమే. పాలకులు ఎవరైనా పోడు రైతులను ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. అడవిపై ఆధారపడి అడవిలోనే జీవించే వారు పోడు వ్యవసాయం చేయడం కూడా దశాబ్దాలుగా జరుగుతున్నది. కమ్యూనిస్టుల సుదీర్ఘ పోరాట ఫలితంగా వచ్చిన అటవీ హక్కుల చట్టం 2005తో పోడు రైతులకు పట్టాలు దక్కుతాయన్న ఆశ మొదలైంది. 2009 సంవత్సరంలో మొట్టమొదటి సారిగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భద్రాచలంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన 36 వేల ఎకరాల పోడు భూమికి పట్టాలు అందజేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారింది. కొందరు నేతలు పోడు పట్టాలు ఇప్పిస్తామంటూ అమాయక రైతుల నుంచి వసూలు చేశారు. రాజశేఖర్‌రెడ్డి పట్టాలు అందించిన తర్వాత ఇక పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం ఒకరకంగా నిలిచిపోయింది. 2014లో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం పై పోడు పట్టాల కోసం ఒత్తిడి పెరుగుతూనే ఉంది. అనేక పోరాటాలు, ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. 2018 ఎన్నికల ముంగిట తాము తిరిగి అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలు అందజేస్తామని కెసిఆర్ ప్రకటించిన విషయం విధితమే. ఎట్టకేలకు 2021 నవంబరు 18 నాటికి 24 జిల్లాల నుంచి 2.5లక్షల ఎకరాల దరఖాస్తులు అధికారులకు అందాయి. ఈ దరఖాస్తుల ద్వారా ఏడు లక్షల ఎకరాలకు పోడు పట్టాలు అందజేయాలని రైతులు కోరారు. ఇందులో సింహ భాగం ఉమ్మడి ఖమ్మంజిల్లా నుంచే వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి దాదాపు 1,01,032 దరఖాస్తులు వచ్చాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 30 నుంచి పోడు రైతులకు పట్టాలు అందజేయడంతో పాటు రైతుబంధు వర్తింప జేస్తామని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల ఎకరాలకు సంబంధించి దరఖాస్తులు రాగా ప్రభుత్వం మాత్రం 4,05,601 ఎకరాలకు మాత్రమే పట్టాలు అందజేస్తామని తద్వారా 1,50,012 మంది రైతులకు మేలు జరుగుతుందని ప్రకటించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు మూడు లక్షల ఎకరాలకు చెందిన పోడు రైతులకు భూమిపై హక్కు లభించదు. పైగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన దాని ప్రకారం ఇక ముందు అటవీ ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పుడు హక్కు దక్కని రైతులు ఇక ఆశలు వదులుకోవాల్సిందే. భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలో 2,99,910 ఎకరాలకు గాను 82,737 దరఖాస్తులను అధికారులకు సమర్పించారు. కానీ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇప్పుడు అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం కేవలం 1,51,000 ఎకరాలకు మాత్రమే పోడు పట్టాలను అందజేస్తున్నట్లు సమాచారం. మిగిలిన రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఖమ్మంజిల్లాకు సంబంధించి 18,295 దరఖాస్తులకు గాను 42,560 ఎకరాలకు పట్టాలు అందజేయాలని పోడు రైతులు కోరారు. కానీ ప్రభుత్వం కేవలం 12,470 ఎకరాలకు మాత్రమే పట్టాలను అందజేయనున్నట్లు తెలుస్తుంది. ఇందులో కొన్ని దరఖాస్తుల తిరస్కరణకు కారణం ఉన్నప్పటికీ మెజార్టీ దరఖాస్తులకు సంబంధించిన రైతులు అనేక దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేస్తున్నారు. రెండు మూడు తరాల నుంచి పోడు వ్యవసాయం చేస్తున్న వారికి సైతం పట్టాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే మళ్లీ అటవీ భూముల ఆక్రమణలు పోలీసులు, రైతులకు మధ్య తోపులాటలు అటవీ అధికారులతో ఘర్షణలు, రాజకీయ పార్టీల ఆందోళనలు కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పోడు పట్టాలకు సంబంధించి అర్హత కలిగిన ప్రతి పోడు రైతుకు లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాలని వివిధ రాజకీయ పార్టీలు, పోడు రైతులు కోరుతున్నారు.
‘పోడు’ కోసం మళ్లీ పోరు తప్పదా?
RELATED ARTICLES