అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ జి.శ్రీనివాసరావు సూచన
ప్రజాపక్షం/ హైదరాబాద్/న్యూఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ జి.శ్రీనివాసరావు సూచించారు.ఇప్పటికీ వ్యాక్సిన్ వేసుకోని వాళ్ళు వెంటనే వేసుకోవాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు తెలంగాణలో రావొద్దు అంటే ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, 60 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరూ బుస్టర్ డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో 12 ఏళ్ళు పైబడిన పిల్లలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. దేశంలో ఆర్ వ్యాల్యూ అనేది పూర్తిగా నియంత్రణలో ఉన్నదని, దేశ రాజధాని ఢిల్లీలో 1శాతం కంటే ఎక్కువగా ఉందని, తెలంగాణ రాష్ర్టంలో 0.5 మాత్రమే ఉందన్నారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని ఆయన సూచించారు. ఫోర్త్ వేవ్ రాబోదు అని సర్వేలు చెబుతున్నాయని, తెలంగాణలో సిరో సర్వే ఆధారంగా సర్వేలు జరిగాయని, 93శాతం ప్రజల్లో కోవిడ్ యాంటీ బాడీస్ ఉన్నట్లు సిరో సర్వేల్లో వెల్లడైందన్నారు. ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని,అలాగని కొరొనా భయం పోలేదని శ్రీనివాసరావు హెచ్చరించారు.రాబోయే రోజుల్లో శుభకార్యాలు చాలా ఉన్నాయని, ప్రజలందరూ మాస్క్ లు ధరించాలని కోరారు.
ఎండలకు జాగ్రత్త : తెలంగాణ రాష్ర్టంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, ప్రజలు ఎండలకు జాగ్రత్తలు వహించాలని శ్రీనివాసరావు సూచించారు.రోజుకు 2.5 లీటర్ల నుంచి 5 లీటర్ల నీళ్లు తాగాలని, వడదెబ్బ్ద లక్షణాలు ఉన్న వాళ్ళు ఓఆర్‌ఎస్ తాగాలని తెలిపారు.
దేశ వ్యాప్తంగా 2,380 కేసులు..
దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసు లు పెరిగాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనను అనుసరించి గత 24 గంటల్లో 2,380 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 13,433 కు పెరిగాయి. కొత్తగా
56 మరణాలు నమోదయ్యాయి. వీటితో దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,22,062కు చేరుకుంది. ప్రపంచంలోని పలు దేశాల్లోనూ కరోనా తిరిగి విజృంభిస్తున్నదన్న వార్తలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. బిఎ.2.12.1, బిఎ.2.12, ఒమిక్రాన్ బిఎ.2కి సంబంధించిన సబ్ వేరియంట్లు ఇటీవల అమెరికాలోని కొన్ని ఇతర ప్రాంతాలు గుర్తించినట్టు న్యూయార్క్‌లోని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి). ఈ కారణంగానే అమెరికాలో కేసులు పెరుగుతున్నట్టు అనుమానం వ్యక్తం చేసింది. కాగా, ఢిల్లీలోని కరోనా వైరస్ రోగుల నుండి సేకరించిన నమూనాలలో బిఎ.2.12.1 వేరియంట్‌ను గుర్తించినట్టు తెలిపింది. బిఎ.2 లాగా ఈ కొత్త వేరియంట్ కరోనా వైరస్ సోకిన వ్యక్తులలో తిరిగి ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉందని వివరించింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో జపాన్, కొరియా, జర్మనీసహా పలు దేశాలు తీవ్రమైన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. మన దేశంలోనూ పలు రాష్ట్రాలు మళ్లీ మాస్క్‌ను తప్పనిసరి చేశాయి. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందేమో అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దీనితో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. కేంద్రం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలను రెండు రోజుల క్రితమే విడుదల చేసింది. కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో మళ్లీ మాస్కులు ధరించాలనే నిబంధనను తప్పనిసరి చేశారు. తెలంగాణలో కరోనా నిబంధనలు అధికారికంగా ఎత్తివేయలేదు. అయితే, ప్రజలు చాలా వరకూ మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి నియమాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకవేళ అధికారులు మళ్లీ దృష్టి సారిస్తే, మాస్క్ పెట్టుకోనివారు జరిమానా చెల్లించక తప్పదు. రాష్ట్రంలో ప్రస్తుతానికి కరోనా అదుపులోనే ఉంది. అందుకే, అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. కానీ, కేసులు పెరిగితే మాత్రం మళ్లీ కొరడా ఝళించే అవకాశాలు లేకపోలేదు.
పొరుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు
RELATED ARTICLES