సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ప్రజాపక్షం/ అశ్వారావుపేట/పాల్వంచ రాష్ట్ర వ్యాప్తంగా 40 నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉందని, పొత్తుల అవగాహనలు లేకపోతే 40 నియోజకవర్గాల్లో పోటీకి సిద్దంగా ఉన్నామని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం అశ్వారావుపేట నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం స్థానిక సత్యసాయి బాబా కల్యాణ మంటపంలో కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ కార్యవర్గ సభ్యులు సయ్యద్ సలీమ్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా కూనంనేని మాట్లాడుతూ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గ స్థాయి కమిటీలను త్వరలోనే వేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీతో పొత్తుల అవగాహన ఉంటే 40 స్థానాల్లో కొన్ని స్థానాల్లో తగ్గులు, ఎగ్గులు ఉంటాయన్నా రు. అశ్వారావుపేట నియోజకవర్గంలో కమ్యూనిస్టులు బలంగా ఉన్నారని, అందరూ ఏకతాటిపై వచ్చి కలిసి పోటీ చేస్తే మిగిలిన పార్టీలన్నీ గాలిలో కలిసిపోతాయన్నారు. రానున్న ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. కేంద్రంలో ఉన్న మతోన్మాద బిజెపిని ఓడించాలంటే కొన్ని లౌకిక పార్టీలతో కలిసి అవగాహన మేరకు పొత్తులు పెట్టుకోవల్సిన అవసరముందని, బిజెపిని గద్దె దించేందుకు కమ్యూనిస్టు పార్టీ దేశ వ్యాప్తంగా కూడా ఒక విధానపరమైన అంశాలతో ముందుకు వెళ్తుందన్నారు. కొందరు తెలిసీతెలియని తనంతో కమ్యూనిజం ఎక్కడుందని, వారి పనైపోయిందని తప్పు డు మాటలు మాట్లాడుతున్నారని, కానీ కమ్యూనిజం ఎప్పుడు అజేయంగా ఉంటుందన్నారు. అనంతరం నియోజకవర్గ స్థాయి ఎన్నికల కమిటీని 32 మందితో నియమించారు. జనరల్ బాడీ సమావేశానికి ముందు ఖమ్మం రోడ్డులోని పేరాయిగూడెం సమీపం నుండి బయలుదేరి పట్టణంలో పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అశ్వారావుపేట పట్టణానికి చెందిన పుర ప్రముఖులు సిపిఐలో కూనంనేని సమక్షంలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్‌కె. షబీర్‌పాషా, 5మండలాల కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
సాధికారిత సాధన దిశగా మహిళలు అడుగులు వేయాలి
సాధికారిత దిశగా మహిళలు అడుగులు వేయాలని కూనంనేని సాంబశివరావు అన్నారు. స్థానిక జెడ్‌పిహెచ్‌ఎస్ బొల్లోరుగూడెం హైస్కూల్ గ్రౌండ్‌లో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు, ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ సమష్టి పోరాటాలతో మహిళలు చట్టాలు, హక్కులు సాధించుకోవాలని తెలిపారు. పాలకులు అనేక సంవత్సరాలుగా మహిళలకు పురుషులతో సమానంగా 50శాతం రిజర్వేషన్ కల్పించాలని పోరాడుతున్నా కేవలం హామీలకు మాత్రమే పరిమితమై గద్దెనెక్కిన తర్వాత హామీలు మరుస్తున్నారని విమర్శించారు. క్రియాశీలక ఉద్యమాలకు అడుగులు వేస్తేనే మహిళలకు రక్షణ అని అన్నారు. దేశవ్యాప్తంగా రోజు రోజుకీ మహిళలపై జరుగుతున్న దాడులు అఘాయిత్యాలు అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను రూపొందించి వాటిని అమలు చేయాలని కోరారు. ముగ్గుల పోటీలు ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి దోహదపడతాయన్నారు. న్యాయ నిర్ణేతలుగా ఉపాధ్యాయులు బి కవిత, ఎస్ నాగలక్ష్మీ, ఉప్పుశెట్టి సువర్షలు విజేతలను ఎంపిక చేయగా కూనంనేని బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, మహిళ సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి, సిపిఐ పట్టణ కార్యదర్శి అడుసుమల్లి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
పొత్తులు లేకుంటే 40 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నాం
RELATED ARTICLES