పరిహారం చెల్లిస్తే సరిపోతుందా?
లాకప్‌లో తీసిన ప్రాణాలు మళ్లీ తేగలరా?
మరియమ్మ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు
ప్రజాపక్షం / హైదరాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్ లాకప్‌లో మరియమ్మ మరణించిన ఘటనపై హై కోర్టు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగిం ది. లాకప్ డెత్‌పై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పియుసిఎల్ దాఖలు చేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ బుధవారం మరోసారి విచారణ జరిపింది. మరియమ్మ మృతిపై విచారణ నివేదికను మేజిస్ట్రేట్ హైకోర్టుకు అందజేశారు. ఆ నివేదిక పరిశీలించిన హైకోర్టు.. మరియమ్మ మృతి కేసు సిబిఐకి అప్పగించదగిన కేసని వ్యాఖ్యానించింది. ఈ నెల 22న విచారణకు స్వయంగా హాజరుకావాలని సిబిఐ ఎస్‌పికి నోటీసులు జారీ చేసిం ది. కేసు పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌కు అప్పగించాలని అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది. మరియమ్మ మృతి ఘట న తర్వాత ప్రభుత్వం అడ్డగూడూరు ఎస్‌ఐ, కానిస్టేబుళ్లను ఉద్యోగం నుంచి తొలగించినట్టు అడ్వొకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ కోర్టుకు చెప్పారు. అంతేకాకుండా మృతురాలి కుటుంబసభ్యులకు రూ.15 లక్షలు పరిహారం చెల్లించినట్లు, కుమారుడికి ఉద్యోగం ఇచ్చినట్లుగా ఎజి చెప్పడంతో హైకోర్టు తీవ్రం గా స్పందించింది. పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటే ప్రాణాలు తిరిగి వస్తాయా? ఉద్యోగాల నుంచి తొలగించేస్తే సరిపోతుం దా? బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కదా? అని ప్రశ్నలు సంధించింది. మరియమ్మ కుటుంబానికి పరిహారం చెల్లించామని ఎజి మళ్లీ చెప్పబోతుంటే.. పరిహారం ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేవని ఘాటు వ్యాఖ్య చేసింది. ఇతర అనారోగ్య సమస్యల వల్ల మరియమ్మ గుండె ఆగి చనిపోయిందని ఎజి చెప్పారు. దీనిపై హైకోర్టు.. మరియమ్మ గుండె ఆగిపోయేలా పోలీసులు కొట్టారా? అనారోగ్య సమస్యలున్న వ్యక్తిని కొట్టాలని ఎలా అనిపించింది? మరియమ్మ మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం రెండో రిపోర్టులో మరియమ్మ శరీరంపై గాయాలు ఉన్నాయని ఉంది. అంటే మరియమ్మను కొట్టారని స్పష్టం అవుతోంది. ఎంతగా కొట్టారంటే గుండె ఆగిపోయి చచ్చిపోయే వరకూనా? రెండో పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం మరియమ్మ ఒంటిపై గాయాలున్నాయి. గుండె ఆగిపోయేలా ఎవరైనా కొడతారా..మనిషిగా వ్యవహరించాలి కదా. ప్రాణాలు పోలేగా కొట్టారంటే ఏమనుకోవాలి.. సిబిఐ లాంటి సంస్థతో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్న కేసు ఇది.. అందుకే పిటిషనర్ సిబిఐని ప్రతివాదిగా చేయాలని ఆదేశిస్తున్నాం. అని తీవ్రంగా స్పందించింది. అందుకే సిబిఐని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేసి నోటీసులు ఇస్తున్నాం. విచారణకు సిబిఐ ఎస్‌పి విచారణకు హాజరుకావాలని ఉత్తర్వులు ఇస్తున్నాం.. అని ప్రకటించింది. గవర్నమెంట్ ఇచ్చిన ఫస్ట్ పోస్టుమార్టం రిపోర్టులో మరియమ్మ శరీరంపై గాయాలు ఉన్నట్లు లేదని, మేజిస్ట్రేట్ ఇచ్చిన రెండో పోస్ట్‌మార్టం రిపోర్టులో గాయాలు ఉన్నట్లుగా ఉందని చెప్పింది. రెండు రిపోర్టులకు పొంతన లేదని మండిపడింది. ప్రభుత్వం ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్టులో గాయాలు ఉన్నట్లుగా ఎందుకు లేదని నిలదీసింది. మృతదేహం ఫొటోలు చూడండి. శరీరంగా గాయాలు ఉన్నాయో అర్ధం అవుతుంది. కొడితే ప్రాణాలు పోయాయంటే ఎంతగా కొట్టారో అర్ధం అవుతోంది. ఆలేరు మేజిస్ట్రేట్ సీల్ కవర్‌లో ఇచ్చిన రిపోర్టును చూసి విస్మయాన్ని వ్యక్తం చేసింది, పోలీసుల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తే నేరాభియోగాలు లేకుండాపోతాయా? వాళ్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కదా. హైకోర్డు ఆర్డర్ ఇస్తేనే రీపోస్టుమార్టం జరిగింది. దీంతో మరియమ్మ శరీరంపై గాయాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. లేకపోతే ప్రభుత్వ పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం ఏమీ కానట్లే కదా? అని ప్రభుత్వంపై మండిపడింది. మేజిస్ట్రేట్ ఇచ్చిన రిపోర్టును తిరిగి సీల్డ్ కవర్‌లోనే ఉంచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.