అడుగడునా గుంతలమయం
ఇదీ కరీం‘నగరం దుస్థితి’
ప్రజాపక్షం / కరీంనగర్ బ్యూరో కరీంనగర్ నగరం పేరుకే స్మార్ట్ సిటీ కానీ, రోడ్లను చూస్తే మాత్రం అధ్వానంగా మారా యి. ‘పట్టణప్రగతి’ పేరుతో మంత్రులు, అధికారులు హంగామా చేయడం తప్ప నగరంలో ‘ప్రగతి’ కనిపించిన దాఖలాలు లేవు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్, కార్పొరేషన్ నుంచి స్మార్ట్‌సిటీగా రూపాంతరం చెందుతున్న కరీంనగర్ నగరంలో మాత్రం చెప్పుకోదగిన అభివృద్ధి కనిపించడం లేదు. అభివృద్ధి పనుల్లో జాప్యం, ఇటీవల కురుస్తున్న వర్షాలు, వరదలు కలిసి స్మార్ట్ సిటీ కరీంనగర్‌లో రోడ్ల దుస్థితి చెప్పలేని విధంగా తయారైంది. అడుగడునా గుంతలతో ప్రజల ప్రయాణం సాఫీగా సాగడం లేదు. నగర వీధుల్లో ఏ గుంత ఎక్కడ ఉందో తెలియక కరీంనగర్ వాసులు అగచాట్లు పడుతున్నారు. వర్షం పడిందంటే చాలు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రస్తుతం పెరిగిన జనాభాతో అవసరాలకు అనుగుణంగా కరీంనగర్ నగరాన్ని తీర్చిదిద్దడంలో ప్రభుత్వం విఫలమైందని, పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా పాలకులు, అధికారులు తమకేమీ పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు స్మార్ట్ సిటీలో బలం, పలుకుబడి ఉన్న కార్పొరేటర్లు తమ ప్రభావంతో పనులు చేయించుకోవడం, కమీషన్ల కోసం నాణ్యత లేని పనులు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని నగర వాసులు ఆరోపిస్తున్నారు. 2015లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ నగరాలను ఎంపిక చేసింది. రెండవ జాబితాలో కరీంనగర్ స్థానం సంపాదించిన అభివృద్ధిలో వెనుక ఉండిపోయింది. స్మార్ట్ సిటీ భాగంలో పనులకు కేటాయించిన నిధులను నగరాభివృద్ధికి వినియోగించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 60 డివిజన్లు ఉన్న కరీంనగర్ నగరంలో చినుకు పడితే సగానికి పైగా డివిజన్లు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి. వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక రోడ్లపై నీరు నిలబడి ఉంటుంది. ముఖ్యంగా నగరంలోని రేకూర్తి 18, 19వ డివిజన్, ఆర్‌టిసి వర్క్‌షాప్, కోతిరామ్‌పూర్, గణేష్‌నగర్, హనుమాన్‌నగర్, పద్మానగర్, రాంనగర్, శాతవాహన యూనివర్సిటీ ప్రాంతాలను ఈ సమస్య వెంటాడుతోంది. వానపడితే మోకాలిలోతు నీళ్లతో రోడ్లు చెరువులుగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానమైన రోడ్లకు ఈ పరిస్థితి ఉందంటే ఇక మామూలు ప్రాంతాల దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చెరువులు, నాలాలు, డ్రైనేజీలు ఆక్రమించి సెట్ బ్యాక్ లేకుండా ఇళ్ల నిర్మాణం చేపడుతుంటే చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చూసిచూడనట్లు వ్యవహరించడమే ఈ సమస్యలన్నింటికి కారణమని ప్రజలు విమర్శిస్తున్నారు. వేసిన రోడ్లనే వేయడం తప్ప కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో జరిగిందేమి లేదని నగర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పేరుకే స్మార్ట్ సిటీ..!
RELATED ARTICLES