HomeNewsBreaking Newsపేదల బియ్యం పక్కదారి

పేదల బియ్యం పక్కదారి

రాష్ట్ర హద్దులు దాటుతున్న రేషన్‌ బియ్యం
పట్టించుకోని అధికారులు
నెలకు రూ.లక్షల్లో వ్యాపారం!
ప్రజాపక్షం/ పెంచికల్‌పేట్‌ పేదలకు ప్రభుత్వం అందిస్తున్న చౌక బియ్యాన్ని డీలర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ పేరుతో బియ్యం అక్రమ రవాణా యథేచ్చగా కొనసాగుతున్నది. నిరుపేదల కుటుంబాలకు ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న రేషన్‌ బియాన్ని అక్రమార్కులు బియ్యాన్ని అడ్డదారుల్లో జిల్లా, రాష్ట్ర సరిహద్దులు దాటిస్తూ లక్షలాది రూపాయలను సంపాదిస్తున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. రేషన్‌ బియ్యం దందా అధికారులకు తెలిసినా నామమాత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప అక్రమార్కులను పట్టుకునేందుకు సాహసం చేయడం లేదని విమర్శలు ఉన్నాయి. ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట మండంలో 12 చౌకదారుల దుకాణాలు ఉండగా, ప్రతి నెల ప్రభుత్వం పేదలకు సబ్సిడి బియ్యం అందించేందుకు రేషన్‌ షాపులకు పంపిణీ చేస్తుంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బియ్యాన్ని ఉచితంగా అందిస్తుంది. ఇదే అదునుగా భావించిన బియ్యం అక్రమ రవాణా చేస్తున్న దళారులు రేషన్‌ కార్డుదారుల నుంచి కిలో బియ్యాన్ని రూ.10 లకు కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యాపారులు ఇతర మిల్లులకు రాత్రి సమయాల్లో రవాణా చేస్తూ కిలో రూ.18 లకు విక్రయిస్తూ సోమ్ము చేసుకుంటున్నారు. పేదల నుండి దళారులు, వ్యాపారుల ద్వారా మిల్లులకు చేరిన బియ్యాన్ని మిల్లర్లు పాలిష్‌ చేసి ప్రత్యేక సంచుల్లో నిల్వ చేసి బహిరంగ మార్కెట్లో కిలో రూ.30 నుండి రూ.40 లకు అమ్ముతూ వ్యాపారం చేస్తున్నారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా ఆసిఫాబాద్‌ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన బెజ్జూర్‌, సిర్పూర్‌ టి, వాంకిడి, కెరిమెరి, కాగజ్‌ నగర్‌తో పాటు పలు ప్రాంతాల నుంచి అక్రమ రవాణా జరుగుతున్నది. గతంలో అధికారులు మిల్లులపై తనిఖీలు చేసిన సందర్భాల్లో రేషన్‌ బియ్యం నిల్వలను గుర్తించి మిల్లర్లకు హెచ్చరికలు జారీ చేసి జరిమానా వేసి చేతులు దులుపుకున్నారు. రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో తిరిగి మిల్లర్లు రేషన్‌ బియ్యం వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుని బియ్యం దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments