HomeNewsLatest Newsపేదల జోలికి హైడ్రా వెళ్ళొద్దు

పేదల జోలికి హైడ్రా వెళ్ళొద్దు

వస్తే ఎర్రజెండా అండగా ఉంటుంది
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
వరంగల్‌లో పేదల ఇండ్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌

ప్రజాపక్షం/వరంగల్‌
హైడ్రా పేదల జోలికి పోవద్దని, హైడ్రా పేరుతో పేదలను భయాందోళనలకు గురిచేయడం తగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం వరంగల్‌ నగరంలోని పోచమ్మ మైదాన్‌లో గల అబ్నూస్‌ ఫంక్షన్‌ హాల్‌ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో పేదల ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరించాలని సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌ కె. బాష్‌మియా అధ్యక్షత వహించగా కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైడ్రా ప్రభుత్వ భూములను, చెరువులు, కుంటలను ఆక్రమించిన పెద్దల కట్టడాలను కూల్చాలని, పేద, మద్య తరగతి వర్గాలను ఇబ్బంది పెట్టరాదని అన్నారు. రాష్ట్రంలో చెరువులు, కుంటల వివరాలపై శ్వేత పత్రం ప్రకటించాలని, వాటిలో పరిరక్షించాల్సిన స్థలాలలో పేదల నివాసాలు ఉంటే వారికి ప్రత్యామ్నాయం చూపాలని సూచించారు. పేద, మద్య తరగతి కుటుంబాలు అప్పులు చేసి అన్నిరకాల అనుమతులు తీసుకుని ఇల్లు కట్టుకుంటే కూల్చడం సరికాదని, వారికి అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలకు గురవుతున్న భూములను పరిరక్షించి పేదల పరం చేసిన ఘనత సిపిఐ దని, తాము లక్షలాది మందికి ఇండ్ల స్థలాలను ఇప్పించామని అన్నారు. హైడ్రా పేరుతో అలాంటి పేదల జోలికి పోవద్దని, వరంగల్‌ నగరంతో సహా రాష్ట్రంలో ఎక్కడికి హైడ్రా వచ్చినా పేదలు అడ్డుకుంటారని హెచ్చరించారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా గుడిసె వాసులకు పట్టాలు ఇస్తామని మాట ఇచ్చారని, హైడ్రా పేరుతో ఆందోళన చెందుతున్న పేదలకు ప్రభుత్వం మరోసారి ప్రకటన చేసి భరోసా ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ పేదలు ఇబ్బంది పడినా ఎర్రజెండా అండగా ఉంటుందని చెప్పారు. అలాగే చెరువులు, కుంటలు ఆక్రమించిన వారిలో ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో లెక్కలు తీయాలని డిమాండ్‌ చేశారు. పేదల విషయములో బీఆర్‌ఎస్‌, బిజెపి నాయకుల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని,గడిచిన పదేళ్లలో ఒక్క మంచి పనీ చేయని ఆ పార్టీల నాయకులకు మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు. ఆ రెండు పార్టీలు మోసపూరిత పార్టీలని, వారి మాటలు పేదలు నమ్మవద్దని కోరారు. ఈ ఏడాదితో సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి కావస్తున్నదని, అనేక పార్టీలు ఆవిర్భవించి కాలగర్భంలో కలిసి పోయినా పేద ప్రజల అండతో సిపిఐ నిలబడిందని అన్నారు. సిపిఐ వందేళ్ల ఆవిర్భావం సందర్భంగా జాతీయ మహాసభలను ఖమ్మంలో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు, ఆ సందర్భంగా 5 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని, వరంగల్‌ నుండి పదివేల మంది కార్యకర్తలు తరలిరావాలని కోరారు.
భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడింది సిపిఐనే
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
ప్రభుత్వ భూములను భూకబ్జాదారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుండి అన్యాక్రాంతం కాకుండా కాపాడి పేదల ఇండ్ల స్థలాలుగా పంపిణీ చేసింది సిపిఐ పోరాటాల వల్లనే నని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. వరంగల్‌ సదస్సు లో ఆయన మాట్లాడుతూ 40 ఏండ్ల క్రితమే అప్పుడు సిపిఐ నాయకులు కాళిదాసు నేతృత్వంలో భూపేష్‌ నగర్‌ లో పేదలకు ఇండ్ల స్థలాలను ఇప్పించామని, నాటి నుండి ఎస్‌ ఆర్‌ నగర్‌, కేఎల్‌ మహేంద్ర నగర్‌, మార్కండేయ నగర్‌, ఆర్‌ఎన్‌ నగర్‌, పైడిపల్లి, బీఆర్‌ నగర్‌ తదితర కాలనీలలో వేలాది మందికి ఇండ్ల స్థలాలను ఇప్పించామని అన్నారు. అనంతరం ప్రభుత్వాలు పేదలను పట్టించుకోక పోవడంతో గడిచిన కొన్ని సంవత్సరాలుగా తిరిగి భూపోరాటాలను కొనసాగించి బొల్లికుంట, నిమ్మాయ చెరువు, పైడిపల్లి, నర్సంపేట, వర్ధన్నపేట, గీసుకొండ, నెక్కొండ తదితర ప్రాంతాల్లో ఎర్రజెండాలు పాతి పేదలకు ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్నామన్నామని చెప్పారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేదునూరి జ్యోతి, కర్రె బిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్‌, అశోక్‌ స్టాలిన్‌, జిల్లా సహాయ కార్యదర్శి పనాస ప్రసాద్‌, నాయకులు బుస్సా రవీందర్‌, గన్నారపు రమేష్‌, దండు లక్ష్మణ్‌, అక్కపెల్లి రమేష్‌, గుండె బద్రి, సంగి ఎలేందర్‌, తోట చంద్రకళ, వీరగోని శంకరయ్య, ఆరేళ్లి రవి, ల్యాదెళ్ల శరత్‌, జన్ను రవి, కె. చెన్నకేశవులు, గోవర్దనా చారి తదితరులు పాల్గొన్నారు.అనంతరం కూనంనేని సాంబశివరావు, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు తదితర నాయకులు మార్కండేయ నగర్‌ లో పర్యటించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments