ప్రజాపక్షం/నేరేడుచర్ల సూర్యపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో నిరుపేదల గుడిసెలను మున్సిపల్, రెవెన్యూ అధికారులు తొలగించారు. మూడు నెలల నుంచి ప్రభుత్వ భూమిలో 200 మందికి పైగా గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారు. ప్రభు త్వ భూమిని ఖాళీ చేయాలని చెప్పినా నిరుపేదలుపేదలు వినిపించుకోకపోవడంతో శనివారం మున్సిపల్, రెవెన్యూ అధికారులు తొలగించారు. అయితే పేదలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారని ముందుగానే గుర్తించి పోలీసుల పహారాతో తెల్లవారుజామునే గుడిసెలను తొలగించారు. ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని ఆర్‌డిఒ, తహసీల్దార్, ఎమ్మెల్యే, ఎంపిలకు వినతిపత్రం అం దించి గత ఐదు నెలల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని, ప్రభుత్వ స్థలంలో గుడిసెలను వేసుకుని నివసిస్తుంటే ఎలాంటి సమాచారం లేకుండా తెల్లవారుజామున వచ్చి తొలగించడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసెలో ఉన్న సరుకులు, వస్తువులను కూడా జెసిబిలతో బయటపడేశారని, మహిళలు అని కూడా చూడకుండా పక్కకు తోసేశారని బాధితులు ఆందోళన చేశారు. పట్టాలు ఇచ్చేంత వరకు కదిలిలేది లేదని బైఠాయించారు. ఇప్పుడు గుడిసెలు తొలగించినా మళ్లీ వేస్తామని, ఇక్కడే చావడానికైనా సిద్ధమని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సిపిఐ నాయకులు ధనుంజయనాయుడు, బిఎస్‌పి నాయకులు రాపోలు నవీన్‌కుమార్ బాధితులు ఇళ్ల స్థలాలు ఇప్పించి, ఇల్లు కట్టించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పేదల గుడిసెలు కూల్చివేత
RELATED ARTICLES