HomeNewsLatest Newsపేదల ఇళ్ళ జోలికి వెళ్ళొద్దు

పేదల ఇళ్ళ జోలికి వెళ్ళొద్దు

పేదలకు 58, 59 జిఒ ప్రకారం క్రమబద్ధీకరించాలి :
కూనంనేని సాంబశివరావు
అమీన్‌పూర్‌లో హైడ్రా కూల్చిన ఇండ్ల పరిశీలన

ప్రజాపక్షం / హైదరాబాద్‌
హైడ్రా పేరుతో పేదల ఇళ్ళను కూల్చవద్దని, దొంగలను మంచివారిని ఒకే పద్ధతిలో చూడవద్దని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌ పుర , పటేల్‌ గూడా, బిఎస్‌ఆర్‌ కాలనీలో హైడ్రా కూల్చి వేసిన పేదల ఇళ్ళను బుధవారం ఆయన పరిశీలించారు. ఆయన వెంట సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్‌. బాల మల్లేశ్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటి నరసింహ, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జల్లాలుద్దీన్‌, రాష్ట్ర సమితి సభ్యులు వి.ప్రకాశ్‌ రావు ఉన్నారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఫామ్‌ హౌస్‌ లు, విల్లాలు కట్టుకున్న పెద్ద పెద్ద వారి అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చడాన్ని తాము ఏమి తప్పు పట్టడం లేదని, పేదల జోలికి రావద్దని ప్రభుత్వాన్ని కోరారు. బిల్డర్ల వద్ద నెల నెలా జీతభత్యాలనుండి పోగుచేసిన డబ్బుతో కొనుగోలు చేసిన ఇండ్లను కూల్చడం అన్యాయమన్నారు. దాదాపు 26 ఏళ్ల నుండి ఉన్న ఇళ్ళను కూల్చివేశారని, వాటిలో ఇటీవలనే గృహప్రవేశం చేసిన ఇళ్ళు కూడా ఉన్నాయని తెలిపారు. గత 40 సంవత్సరాల నుండి ఈ భూములు క్రయ విక్రయాలు జరుగుతున్నాయని, వాటికి సంబంధించిన ఈసీలు కూడా రిజిస్టర్‌ ఆఫీసులలో ఉన్నాయని కూనంనేని అన్నారు. ఒకవేళ హైడ్రా చెప్తున్న ప్రకారం ఈ ఇండ్లు ప్రభుత్వ భూమిలో నిర్మించి ఉంటే 58, 59 జీవో ద్వారా పేదలకు క్రమబద్ధీకరించవచ్చు అన్నారు. ఆ ఇండ్లు చెరువు ఎఫ్‌ టి ఎల్‌ లెవెల్‌, బఫర్‌ జోన్లలో లేవని వారు తెలిపారు. 100 మంది దోషులు తప్పించుకున్న ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదని చట్టం చెబుతుందని, ఇప్పుడు పేదలను శిక్షించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తప్పుడు సర్వే నెంబర్లతో సమాచారం తెలుసుకొని కూల్చివేతలు చేపడితే పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించి, పూర్తిగా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, ఒకవేళ ప్రభుత్వ భూమి అయితే క్రమబద్ధీకరించాలని వారన్నారు. ఒకవేళ ఉపయోగపడే చెరువులు, కుంటలలో పేదలు గుడిసెలు వేసుకుంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని, తెలియక భూములు కొనుక్కున్న వారికి నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. నిజంగా అక్రమాలకు పాల్పడ్డ బడా వ్యక్తుల మీద, అనుమతులు ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకోవచ్చని సాంబశివరావు తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments