చీకటి పడితే అదనపు విద్యుత్ చార్జీల వడ్డన
పగటిపూట రకరకాల టారిఫ్‌లు
న్యూఢిల్లీ : మోడీ సర్కారు హయాంలో ప్రజలకు కనీస నిద్రకూడా దూరం చేసే నిర్ణయం జరిగింది. ఇక పగటిపూట వివిధ రకాల సమయాల్లో వివిధ విద్యుత్ టారిఫ్‌లు ఉంటాయి. పగటిపూట ఎనిమిది గంటలపాటు విద్యుత్ టారిఫ్‌లు 20 శాతం తగ్గించి రాత్రిపూట మాత్రం 20 శాతం విద్యుత్ టారిఫ్‌లను పెంచుతున్నారు. ఏతా వాతా ప్రభు త్వం చెప్పేదేమిటంటే పగటిపూట వివిధ సమయా ల్లో విద్యుత్ టారిఫ్‌లు వివిధ రకాలుగా ఉంటా యి. అలాగే రాత్రిపూట నిద్రపోయే సమయంలో భారీగా విద్యుత్ టారిఫ్‌లు వడ్డిస్తారు. క్రమంగా ఈ టారిఫ్‌లు ఇంకా పెరగొచ్చు కూడా. విద్యుత్ చార్జిలు తగ్గించినట్లు భ్రమ పెడుతూనే రాత్రిపూట మాత్రం భారీగా టారిఫ్‌లు విధించడానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ సిద్ధపడుతోంది. రాష్ట్రాలలో విద్యుత్ బోర్డులు నిర్దేశించిన ప్రకారం పగటి సమయం ఎనిమిది గంటలు! ఈ సమయంలో విద్యుత్ టారిఫ్‌లు వాణిజ్య అవసరాల నిమిత్తం టైమును బట్టి రకరకాలుగా నిర్ణయిస్తారన్నమాట. రైతులకు మాత్రం పగటిపూట ఈ టారఫ్‌ల నుండి కొంత మినహాయింపు ఇచ్చారు. పగటిపూట పీక్ అవర్స్‌లో పది నుండి ఇరవైశాతం వరకూ విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి. సాధారణ సమయాల్లో చార్జీలు పది నుండి ఇరవై శాతం వరకూ తక్కువ ఉంటాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుండి ఈ టిఓడి రేట్లు (టైమ్ ఆఫ్ డే టారిఫ్) అమలు చేస్తారు. అంటే ఇక వినియోగదారులు ఇళ్ళల్లో వంటలు చేసుకునే సమయాలను, బట్టలు ఇస్త్రీ చేసుకునే సమయాలు, రెస్టు తీసుకునే సమయాలను మార్చుకోవాలి. అలాగే రాత్రిపూట కూడా టారిఫ్‌లు పీక్ సమయాల్లో పెంచుతారు కాబట్టి నిద్ర సమయాలు కూడా మార్చుకోవలసి రావచ్చునేమో! పది కిలోవాట్లు ఉన్న కమర్షియల్ కస్టమర్లకు మొదట దీనిని వర్తింపజేస్తారు. కమర్షియల్ విభాగంలో కాకుండా మిగిలిన కేటగిరీల్లో ఉండే విద్యుత్ వినియోగదారులందరికీ 2025 ఏప్రిల్ 1 వ తేదీ నుండి ఈ టారిఫ్‌లు అమలులోకి వస్తాయని ముందుగానే ప్రకటన చేసి ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జనం ఇళ్ళకు స్మార్ట్ మీటర్లు బిగించారు. టివోడి టారిఫ్‌లు వస్తే ఇక భారీగా ఎత్తున ఈ స్మార్ట్ మీటర్లు అమలులోకి వస్తాయట. ఈ విధంగా వేరు వేరు సమయాల్లో వేరు వేరు విద్యుత్ చార్జీలు వడ్డించడంవల్ల భారీ ఎత్తున అవినీతి జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇటు వినియోగదారులకు, అటు విద్యుత్ సిబ్బందికీ కూడా ఇది పెద్ద తలనొప్పులు తెచ్చిపెడుతుంది. దీనిపై కేంద్ర విద్యుత్, పునర్వినియోగ ఇంధన శాఖామంత్రి ఆర్.కె.సింగ్ మాట్లాడుతూ, పునర్వినియోగ ఇంథనాన్ని అమలులోకి తీసుకురావడం, ఇతర విధాలుగా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఆదాచేయడం తమ ఉద్దేశమన్నారు. పగటిపూట సోలార్ విద్యుత్ చాలా చౌకగా దొరుకుతుంది కాబట్టి వినియోగదారులకు తక్కువ ధరలకు ఇస్తామని మంత్రి అన్నారు. క్రమంతా తర్వాత ఈ ధరలు పెంచే అవకాశం లేకపోలేదు. అటు విద్యుత్ ప్రొవైడర్లకు, ఇటు వినియోగదారులకూ కూడా తమ విధానంవల్ల మేలు జరుగుతుందని మంత్రి నమ్మబలికారు. ఈ టివోడి విధానం వల్ల వినియోగదడారులు తమ విద్యుత్ బిల్లులను బాగా తగ్గించుకోవచ్చునని ఆయన అన్నారు. సూర్యరశ్మి లేనిసమయంలో రాత్రిపూట థర్మల్, హైడ్రో విద్యుత్‌ను సరఫరా చేస్తారు. కాబట్టి ఈ ధరలు భారీగా వినియోగదారులపై వడ్డిస్తారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్లకు ఉద్దేశించిన నిబంధలను కూడా చాలా మేరకు సరళీకరిస్తున్నట్లు మంత్రి ఆర్.కె.సింగ్ చెప్పారు. అయితే ఇప్పటికే చాలా రాష్ట్రాలో విద్యుత్ బోర్డులు ఈ టిఓడి విధానం అమలు చేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ టివోడికు సంబంధించిన మీటరింగ్, స్మార్ట్ మీటర్లను గృహ వినియోగదారులకు త్వరలోనే ఇన్‌స్టాల్ చేయడం ప్రారంభిస్తామని కూడా ఆయన చెప్పారు.
పేదలకు ఇక..నిద్రలేని రాత్రులే
RELATED ARTICLES