శ్రీకారం చుట్టిన మెప్మా
ప్రజాపక్షం/ హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరాశ్రయులను గుర్తించి వారికి తగిన సౌకర్యాలను కల్పించేందుకు పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు నిరాశ్రయులకు షెల్టర్లు, వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పించిన మెప్మా.. ఇక నుంచి వారి ఆరోగ్య సమస్యలతో పాటు ప్రభుత్వం తరపున అందాల్సిన పథకాలను కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరాశ్రయుల సమాచార సేకరణకు పూనుకుంది. ప్రతి పురపాలిక పరిధిలో సమగ్ర సర్వే చేసి నిరాశ్రయులను గుర్తించడంతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలను, వారికి చెందిన సమగ్ర సమాచారాన్ని సేకరించనుంది. అయితే ఈ కార్యక్రమాన్ని నెలల తరబడి కాకుండా ఈ నెల 30లోపు పూర్తి చేయాలని పురపాలికలకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల పురపాలిలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ అధ్యక్షతన అర్బన్ హోమ్‌లెస్ (నిరాశ్రయులు), షెల్టర్ల ఏర్పాటు తదితర అంశాలపై ప్రత్యేకంగా సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్, రైల్వేస్టేషన్లు, ప్రార్థనా మందిరాలు తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న నిరాశ్రయులను గుర్తించి వారికి సంబంధించిన పూర్తి సమాచారన్ని అందించాలని మెప్మా స్థానిక పురపాలికలను ఆదేశించింది. ప్రత్యేకంగా ఒక నమూనాను రూపొందించింది. దీని ఆధారంగా సర్వే చేపట్టాలని స్పష్టం చేసింది. అందులో నిరాశ్రయుల పూర్తి సమాచారం పొందపర్చాల్సి ఉంటుంది. ఇండ్లు లేకుండా రహదారులు, ఫుట్‌పాత్‌లపై నివాసముంటున్న వారి నుంచి ఆరోగ్య సమస్యల నుంచి మొదలు వారి వ్యక్తిగత వివరాలతో పూర్తిగా సమాచారాన్ని సేకరించాలని సూచించింది. ప్రధానంగా వారికి ఆధార్, రేషన్‌కార్డులు ఉన్నాయా? లేదా అనే వివరాలను కూడా సేకరించాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఉన్న షెల్టర్ల వివరాలు, అందులోని సౌకర్యాలు, తదితర అంశాలను కూడా మెప్మా ఆరా తీస్తోంది. సర్వే నివేదికలో ఎంత మంది నిరాశ్రయులు ఉన్నారనే సమాచారం వచ్చిన తర్వాత వారికి సరిపడ షెల్టర్లు ఉన్నాయా? లేదా? పరిశీలించి ఒక వేళ తక్కువగా ఉంటే మరిన్ని షెల్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈనెల 10లోపు సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించింది.
పింఛన్లు, ఆధార్ కార్డుల పంపిణీ : నిరాశ్రయులలో అర్హులైన వారికి పింఛన్ సౌకర్యాన్ని కల్పించాలని మెప్మా నిర్ణయించింది. పైగా ఆధార్, రేషన్‌కార్డులు లేని వారికి ఆధార్ కార్డులతో పాటు రేషన్ కార్డు లను కూడా ఇవ్వనున్నారు. నిరాశ్రయుల వద్ద ఉన్న ఆధారాలు, వారి సమాచారం మేరకు అవసరమైతే జనన దృవీకరణ పత్రాలను కూడా ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జారీ చేయాలని మెప్మా సమావేశంలో నిర్ణయించారు. అలాగే జన్ ధన్ యోజన బ్యాంక్ ఖాతాలను కూడా తెరవనున్నారు. ప్రధానంగా సర్వే నివేదికలోని సమాచారం ఆధారంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. నిరాశ్రయులకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలను నిర్వహించాలని, కంటి వెలుగు లాంటి పలు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని మెప్మా కార్యాచరణను రూపొందించింది.