శ్రీలంక మళ్లీ రణరంగం
దేశాధ్యక్షుడి భవనం ముట్టడి
గొటబాయ రాజపక్స పరార్?
కొలంబో: కొంతకాలం స్తబ్దంగా ఉన్న శ్రీలంకలో ప్రజాగ్రహం మరోసారి పెల్లుబికింది. ఆర్థిక సం క్షోభం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రభుత్వంపై ప్రజలు విరుచుకుపడ్డారు. దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాస భవనాన్ని ముట్టడించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రాణభయంతో గొటబాయ పరారైనట్టు సమాచారం. సుమారు ఏడాది కాలంగా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో ఆందోళనలు జోరందుకున్నా యి. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రధాన మంత్రి మహేంద్ర రాజపక్స రాజీనామా చేయగా, ఆయ న స్థానంలో రణీల్ విక్రమసింగె ప్రధాని పగ్గాలు చేపట్టారు. అధికార మార్పుతో కొంత ఊరట లభిస్తుందన్న ప్రజల ఆశలు గల్లంతయ్యాయి. పెట్రో లు కోసం రోజుల తరబడి క్యూలలో నిల్చోవాల్సిన పరిస్థితి. ఆహారంసహా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. దీనితో మళ్లీ ప్రజా ఉద్యమం మొదలైంది. శనివారం ఏకంగా దేశాధ్యక్షుడి ఇంటినే ముట్టడించడం లంకలో నెలకొన్న భయానక పరిస్థితులకు అద్దం పడుతున్నది. గొటబాయ రాజీనామా చేయాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. కొలంబో యావత్తు నిరసనలతో హోరెత్తింది. వేలాది మంది అధ్యక్షుడి భవనాన్ని చుట్టుముట్టడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అడ్డంకులను అధిగమించి భవనంలోకి ప్రవేశించేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అధ్యక్ష భవనాన్ని చుట్టుముడుతున్న ఆందోళనకారుల సంఖ్య పెరుగుతుండడంతో భద్రతా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. అయినప్పటికీ లోనికి దూసుకెళ్లిన ఆందోళనకారులు, అధ్యక్ష భవనంలో హల్‌చల్ చేశారు. అక్కడి ఈత కొలనులో కొంత మంది ఈతకొట్టారు.
పారిపోలేదు..
దేశాధ్యక్షుడు గొటబాయ ఎక్కడికీ పారిపోలేదని, ముందు జాగ్రత్త చర్యగా ఆయనను తామే ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించామని సైనికాధికారులు ప్రకటించారు. ప్రజలు అధ్యక్ష భవనంలోకి చొచ్చుకురావడంతో భయపడిన గొటబాయ పరారైనట్టు వచ్చిన వార్తలను వారు తోసిపుచ్చారు. ఆందోళనల నేపథ్యంలో పరిస్థితులు చేజారే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు వివరించారు. అయితే, విమానాశ్రయం దిశగా గొటబాయ కాన్వాయ్ వెళుతున్నట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీనితో అతను దేశం విడిచి పారిపోయాడన్న వాదనకు బలం చేకూరింది. కడపటి వార్తలు అందే సమయానికి కూడా గొటబాయ ఎక్కడ ఉన్నారన్నది తెలియరాలేదు.
ఎంపిపై దాడి..
శ్రీలంక పార్లమెంటు సభ్యుడు రజిత్ సేనారత్నేపై నిరసనకారులు దాడి చేశారు. దేశం నలుమూలల నుంచి రైళ్లు, బస్సులు, వాహనాలపై వచ్చిన వేలాది మంది ప్రజలు ఒక్కసారిగా అధ్యక్ష భవనంపైపు దూసుకెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అధ్యక్ష భవనంలోకి ప్రవేశిస్తున్న క్రమంలో రజిత్‌ను చూసిన ఆందోళనకారులు ఆయనపై దాడికి దిగారు. భద్రతా బలగాలు వెంటనే రజిత్‌ను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ ఏడాది మే 9న నిత్తంబువలో ఆందోళనకారులు జరిపిన దాడిలో అప్పటి సిట్టింగ్ ఎంపి అమరకీర్త అతకొరల మృతి చెందారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా సిబ్బంది అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ప్రజలను నిలువరించడంలో వారు విఫలమవుతున్నారు.
పెల్లుబికిన ప్రజాగ్రహం
RELATED ARTICLES