రాష్ట్రంలో చలి పెరిగింది. శుక్రవారం బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కారణంగా మరో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరగనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయి చలి వాతావరణం నెలకొంటుందని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. అత్యల్పంగా ఆదిలాబాద్‌లో నాలుగు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, ఖమ్మం, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ జిల్లాల్లో ఆదివారం కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. శనివారం నాడు నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. అత్యల్పంగా ఆదిలాబాద్‌లో నాలుగు డిగ్రీలు, మెదక్‌లో ఏడు డిగ్రీలు, హైదరాబాద్, రామగుండంలలో 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.