HomeNewsBreaking Newsపెద్ద నోటు రద్దు..ఎవరికి ముద్దు?

పెద్ద నోటు రద్దు..ఎవరికి ముద్దు?

సుమారు ఆరున్నర సంవత్సరాల క్రితం, అప్పటి 500, 1000 రూపాయల నోట్లను రాత్రికిరాత్రే రద్దు చేసిన మోడీ సర్కారు, ఇప్పుడు 2000 రూపాయల నోటు రద్దుతో మరోసారి అదే పొరపాటు చేసిందని కాంగ్రెస్‌, వామపక్షాలు, ఆమ్‌ ఆద్మీ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి)సహా పలు రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. 2016 నవంబర్‌ 8న పెద్ద నోట్ల రద్దుతో కుప్పలు తెప్పలుగా నల్ల ధనం బయటపడుతుందన్న కేంద్ర ప్రభుత్వ అంచనా తారుమారైంది. నగదు లావాదేవీలు తగ్గి, ఆ స్థానాన్ని డిజిటల్‌ ట్రాన్‌సాక్షన్లు ఆక్రమిస్తాయన్న లక్ష్యం నెరవేరలేదు. మోడీ సర్కారు అనాలోచిత చర్య కారణంగా సామాన్యులు ఇబ్బంది పడ్డారే తప్ప, ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. చేసిన తప్పు మళ్లీ చేయడం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికే దక్కింది. అప్పట్లో పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా వేలాది కంపెనీలు మూతబడ్డాయి. సుమారు 62 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. నగదు కోసం బ్యాంకులు, ఎటిఎంల ముందు క్యూలైన్లలో నిలబడి 108 మంది మృత్యువాతపడ్డారు. అప్పటి నోట్ల రద్దు నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు వాటిల్లిన నష్టం అక్షరాలా రూ. 5 లక్షల కోట్లు. నోట్ల రద్దుతో పట్టుబడిన నకిలీ నోట్ల విలువ కేవలం రూ. 250 కోట్లు. మోడీ ప్రధానిగా పగ్గాలు చేపట్టడానికి ముందు, 2014 మార్చి నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో రూ.13 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉండగా. 2022 మార్చి నాటికి ఈ మొత్తం రూ.31.33 లక్షల కోట్లకు చేరింది. 2014లో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 11.6 శాతంగా ఉన్న నగదు విలువ. 2022 మార్చి 25 నాటికి 13.7 శాతానికి పెరిగింది. డిజిటల్‌ చెల్లింపులు జరిగితే, నోట్ల వాడకం తగ్గాలి. కానీ, విచిత్రంగా పెరిగింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) గణాంకాల ప్రకారం, 2016లో రూ.16.41 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉండగా, 2022 డిసెంబర్‌ 23 నాటికి ఇది 32.42 లక్షల కోట్లకు చేరింది. నగదు డబుల్‌నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయి. అలాంటప్పుడు, నోట్ల వాడకం తగ్గాలి. అయితే, నోట్ల రద్దు నిర్ణయం తీసుకొన్న 2016 నుంచి ఇప్పటివరకూ నోట్ల వాడకం దాదాపుగా రెట్టింపు కావడం గమనార్హం. ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం.. దాదాపుగా రెట్టింపైంది. ప్రజల వద్ద ఉన్న నోట్ల సంఖ్య కూడా 30 శాతం పెరిగింది. దీనిని బట్టి, అప్పట్లో పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రధాని చెప్పినదానికీ, వాస్తవ పరిస్థితులకు ఎక్కడా పొంతన లేదు. అంటే, ఇది మొత్తం ఒక రాజకీయ వ్యూహం, బిజెపియేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం. షెడ్యూల్‌ను అనుసరించి చూస్తే, ఈ ఏడాది నవంబర్‌లో చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం, డిసెంబర్‌లో రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఎన్నికలు జరగాలి. జమ్మూకశ్మీర్‌లోనూ ఎన్నికల ప్రక్రియ పూర్తికావాలి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. అదే విధంగా ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిమ్‌, అక్టోబర్‌లో హర్యానా, మహారాష్ట్ర, నంబర్‌/డిసెంబర్‌లో జార్ఖండ్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాలి. ఇప్పటికే అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ బిజెపి పట్టు కోల్పోయి, ప్రతిపక్షంగా మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తున్నది. కర్నాటక ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. బిజెపియేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో, గత ఎన్నికల సమయంలో ఉన్న ధీమా కూడా ఇప్పుడు లేదు. అన్ని రకాలుగా ఎదురుదెబ్బలు తింటున్న బిజెపి మరోసారి కుటిల నీతిని అనుసరిస్తున్నది. అందులో భాగమే 2000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయం. నకిలీ కరెన్సీ అరికట్టడం, నల్లధనం వెలికితీత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రించడం తదితర అంశాల్లోనూ విఫలమైన మోడీ సర్కారు, ఈ కొత్త నిర్ణయంతో సాధించేది ఏమిటి? ఒకసారి విఫలమైన విధానాన్నే మళ్లీ అనుసరించడంలో ఆంతర్యం ఏమిటి? బిజెపియేతర పార్టీల పాలిత రాష్ట్రాలను ఏదో ఒక విధంగా ఇరుకున పెట్టడం మినహా 2000 రూపాయల నోట్ల రద్దుతో మోడీ సర్కారుకు ఒరిగేది ఏమీ లేదు. దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై ఉసిగొలుపుతున్న కేంద్రం, కొత్త నిర్ణయంతో సాధించబోయేది శూన్యం. 2004 నుంచి 2014 వరకు 112 ఇడి దాడులు జరిగితే 2014 నుంచి 2022 వరకు 3,010 జరిగాయి. ఇది ప్రభుత్వ అధికారిక సమాచారం. నూటపన్నెండు దాడుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం రూ.5,346 కోట్లు. సగటున 47.73 కోట్లు. కాగా 3010 దాడుల్లో స్వాధీనం చేసుకున్నది రూ.99,356 కోట్లు. అంటే, సగటున 33 కోట్లు. కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రతిపక్షాలను ఇబ్బందులపాలు చేస్తున్నదో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఆ ప్రయత్నాల్లో మరో కోణమే 2000 రూపాయల నోట్ల రద్దు. బిజెపి పూర్తిగా ఆత్మరక్షణలో పడిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments