ఈసారి మంత్రి పదవులపై ఎంఎల్‌సిల ఆశలు
ప్రజాపక్షం/ హైదరాబాద్: గత మంత్రివర్గంలో శాసనమండలికి ప్రాధాన్యతనిచ్చిన సిఎం కె.చంద్రశేఖర్‌రావు ఈ సారి పెద్దల సభ సభ్యులకు ఆ గౌరవాన్ని కొనసాగిస్తారా? అనే అంశం పై టిఆర్‌ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. క్రితం సారి కేబిబినెట్‌లో ముగ్గురు ఎంఎల్‌సిలకు అవకాశం కల్పించారు. అందులోనూ నెంబర్ టు స్థానంగా భావించే ఉపముఖ్యమంత్రి పదవులను ఇద్దరు పెద్దల సభ్యులైన మహమూద్ అలీ, కడి యం శ్రీహరిలకు కట్టబెట్టారు. దాంతో పాటు మరో ముఖ్యమైన హోంమంత్రి పదవిని కూడా అదే సభకు ప్రాతినిధ్యం వహించిన నాయిని నర్సింహారెడ్డికి దక్కింది. ఈ సారి కూడా కెసిఆర్ మంత్రి వర్గంలో తనతో పాటు కేవలం మరొకరిని మాత్రమే మంత్రివర్గ సభ్యుడిగా అవకాశం కల్పించారు. ఆ ఒక్కరు కూడా శాసనమండలి సభ్యులైన మహమూద్ అలీనే కావడం విశేషం. అయితే ఈసారి ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనప్పటికీ హోం మంత్రి ల భించింది.
ఆ ఇద్దరికి దక్కేనా? : ఇక త్వరలో మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో గతంలో పెద్దల సభ నుండి మంత్రివర్గంలో ఉన్న కడియం శ్రీహరి, నాయిని నర్సింహరెడ్డిలకు అవకాశం దక్కుతుందా లేదా అనే చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి తనకు లేదా తన కుమార్తె కావ్యకు సీటును కేటాయించాలని పట్టుబట్టారు. అయితే ఈ స్థానాన్ని సిట్టింగ్ ఎంఎల్‌ఎ రాజయ్యకే మరోసారి అవకాశం కల్పించారు. దీంతో సుమారు వారం రోజుల పాటు కడియం శ్రీహరి ఆ సీ టు కోసం ప్రయత్నించినట్లు తెలిసింది. మరోవైపు స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కడియం పోటీ చేయాలని అక్కడి క్యాడర్ ఆయనపై తీవ్ర ఒత్తిడి పెంచింది. ఆయనను ఘేరావ్ చేసినంత పని చేశారు. ఈ క్రమంలో కెటి.రామారావు స్వయంగా జోక్యం చేసుకుని కడియంకు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అలాగే నాయిని నర్సింహారెడ్డి కూడా తనకు లేదా తన అల్లుడైన జిహెచ్‌ఎంసి కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డికి ముషీరాబాద్ సీటును ఆశించారు. చివరి వరకు ఈ సీటుపై నాయిని పట్టుబట్టారు. ఒక దశ లో తన అసంతృప్తిని బయటపెట్టారు. తనకు సిఎం కెసిఆర్ అపాయింట్‌మెంట్ దొరకలేదని, ఫోన్‌లో టచ్‌లో ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలతో అటు ప్రతిపక్షానికి మంచి ఆయుధం ఇచ్చినట్టుగా మారిందని సొంత పార్టీ వర్గాల్లోనే చర్చ జరిగింది. కా గా, కొన్ని సందర్భాల్లో నాయిని చేసిన వ్యాఖ్యలు టిఆర్‌ఎస్‌ను ఇరకాటంలో పడేసిందనే వాదనలు లేకపోలేదు. ఇలా కడియం, నాయిని ఎన్నికల సందర్భంగా చివరి వర కు మొండి పట్టుదల వహించిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై ఆ ప్రభావం చూ పుతుందా అనేది కూడా పార్టీలో ప్రచారం జరుగుతుంది.