మళ్లీ పెరిగిన ధరలు
వారంలో ఇది నాలుగోసారి
న్యూఢిల్లీ: సామాన్యుడికి పెట్రో పంజా నుంచి విముక్తి లభించడం లేదు. వారంలో ఏకంగా నాలుగోసారి ధరలు పెరగడంతో, ప్రజలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. లీటరు పెట్రోలు, డీజిల్ ధరను శనివారం 25 పైసలు చొప్పున పెంచడంతో, గతంలో ఎన్నడూ లేని రికార్డు స్థాయికి ధరలు చేరుకున్నాయి. పెట్రోలు లీటర్ ధర ఢిల్లీలో 85.70 రూపాయలకు చేరుకోగా, ముంబయిలో 92.28 రూపాయలుగా ఉంది. అదే విధంగా డీజిల్ ధర ఢిల్లీలో 75.88 రూపాయలకు, ముంబయిలో 82.66 రూపాయలకు చేరింది. మొత్తం మీద అటు పెట్రోల్, ఇటు డీజిల్ ధర లీటర్‌కు 100 రూపాయల మైలురాయిని త్వరలోనే అధిగమించడం ఖాయంగా కనిపిస్తున్నది. ఎప్పటికప్పుడు పెట్రో ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగి, సరికొత్త రికార్డులను సృష్టించడం ఆనవాయితీగా మారింది. పెట్రో ధరలకు కళ్లెం వేసే దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం. నిన్న మొన్నటి వరకూ ప్రతి సోమవారం పెట్రోలు, డీజిల్‌పై 25 పైసల చొప్పున పెంచడం సాధారణమైంది. కానీ, ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, వారం రోజల వ్యవధిలోనే మూడు పర్యాయాలు పెంచడం ద్వారా మోడీ సర్కారు తన రికార్డులను తానే బద్దలు కొడుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధరలను బట్టి, దేశంలోని చమురు కంపెనీలు రోజువారీ సమీక్షను జరపాలి. ధరలను అందుకు అనుగుణంగా నిర్దేశించాలి. అయితే, ఏ రకంగా చూసినా ఇలాంటి కసరత్తు జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. కొవిడ్ పేరుతో అధికారులు సమీక్షలను నిర్వహించడం లేదు. కానీ, క్రమం తప్పకుండా ధరలను మాత్రం పెంచుతూనే ఉన్నారు. లీటరు పెట్రోలు 91.34 రూపాయలుగా 2018 అక్టోబర్ 4వ తేదీన నమోదైన రికార్డు ఇప్పుడు మరుగున పడింది. రోజువారీ ధరల సమీక్షను పునరుద్ధరిస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) ఇచ్చిన హామీలు సక్రమంగా అమలవుతున్న దాఖలాలు లేవు. గ్లోబల్ మార్కెట్‌తో ఏ మాత్రం సంబంధం లేదన్న రీతిలో దేశంలో పెట్రో ధరలను పదేపదే పెంచడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. పెట్రో ధరల కారణంగా, అన్ని రకాల వస్తుసేవల ధరలను కూడా పెరుగుతాయన్నది వాస్తవం. రవాణా ఖర్చు తలకు మించిన భారం అవుతుంది కాబట్టి, ఆ లోటును ధరలను పెంచడం ద్వారా కంపెనీలు భర్తీ చేస్తాయి. అంటే, అటు చమురు కంపెనీలు నష్టపోవు, ఇటు పెట్టుబడిదారి వర్గాలు నష్టపోవు. సామాన్యుడే ఈ భారాన్ని మోయాల్సి ఉంటుంది. 2018 అక్టోబర్ మాసంలో కేంద్రం చివరిసారి పెట్రో ధలను సమీక్షించి, ప్రజలకు ఊరట కలిగేలా లీటర్ పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 1.50 చొప్పున తగ్గించిన కేంద్రం ఆ తర్వాత అలాంటి ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదన్నది సమాధానం లేని ప్రశ్న. పస్తుతం లీటర్ పెట్రోలుపై 32.98 రూపాయలు, డీజిల్‌పై 31.83 రూపాయలు చొప్పున ఎక్సైజ్ డ్యూటీని వసూలు చేస్తున్నారు. దీనికితోడు వాట్ కూడా ఉంది. వాట్ ఢిల్లీలో లీటరు పెట్రోల్‌పై రూ. 19.32, డీజిల్‌పై రూ. 10.85గా ఉంది. మొత్తం మీద చమురు కంపెనీలు, సర్కారు ఒకటై విసురుతున్న పెట్రో పంజా నుంచి సామాన్యుడికి రక్షణ లభించే మార్గం కనిపించడం లేదన్నది వాస్తవం.
పెట్రో పంజా
RELATED ARTICLES