మోడీ సర్కార్‌కు వామపక్ష నేతల హెచ్చరిక
‘చలో రాజ్‌భవన్’ను అడ్డుకున్న పోలీసులు
పలువురు నాయకుల అరెస్టు
ప్రజాపక్షం/హైదరాబాద్‌పెంచిన పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, ప్రజా, విద్యార్థి, యుజవన,కార్మిక సంఘాల నేతలు చేపట్టిన ‘చలోరాజ్‌భవన్’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా వామపక్ష, ప్రజాసంఘాల నేతలు వందలా ది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు లు పశ్యపద్మ, వి.ఎస్.బోస్, గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జి.నరసింహారావు, మాజీ ఎంఎల్‌సి చెరుపల్లి సీతరాములు, సిపిఐ (ఎం.ఎల్-న్యూడెమోక్రసి) రాష్ట్ర నాయకులు పోటు రంగారావు, ఎస్‌యుసిఐ(సి) రాష్ట్ర నాయకులు మురహరి, సిపిఐ (ఎం.ఎల్-న్యూడెమోక్రసి) రాష్ట్ర నాయకులు సాధినేని వెంకటేశ్వ ర్లు, ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్, లిబరేషన్ రాష్ట్ర నాయకులు రాజేష్, ఐఎఫ్‌టియురాష్ట్ర నాయకులు ఎస్.ఎల్.పద్మ తదితరులు ఉన్నారు. అంతకుముందు వారు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్‌ధరలను తగ్గించకపోతే దేశ వ్యాప్తంగా ఐక్య ఉద్యమాలకు సన్నద్ధమవుతామని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల జాతీయ స్థాయి పిలుపులో భాగంగా వామపక్ష, ప్రజా, కార్మిక, విద్యార్థి సంఘాల రాష్ట్ర నాయకులు బుధవారం ఇందిరాపార్క్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అప్పటికే ఇందిరాపార్క్ ఇరువైపుల రహదారులను పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. దీంతో నిరసనకారులు అక్కడే బైఠాయించారు. ‘ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడమే అచ్చేదినా’, ‘పెంచిన ధరలను తగ్గించాలి’ అనే ప్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రాజ్‌భవన్‌కు దూసుకెళ్లేందుకు నిరసనకారులు సిద్ధపడగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. వామపక్ష నాయకులను అరెస్టు చేసి వేర్వేరు వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు. కాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా ఆయన అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఆయనను అరెస్ట్ చేయకుండా నిరసనకారులు అడ్డుగా నిలబడ్డారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొన్నది. చివరకు పోలీసులు చాడను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా వివిధ ప్రాంతాల నుంచి వామపక్ష, ప్రజా, కార్మిక, విద్యార్థి సంఘాల నాయుకలు,కార్యకర్తలు ఇందిరాపార్క్ వద్దకు చేరుకున్నారు. దీంతో వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రవీంద్రచారి, రాష్ట్ర సమితి సభ్యులు ఆర్.శంకర్‌నాయక్, మేడ్చల్ జిల్లా కార్యదర్శి జి.సాయిలుగౌడ్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమూకుల జంగయ్య, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, బిసి హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి పాండురంగాచారి, ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్, ఎఐఎస్‌ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు స్టాలిన్, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు గ్యార నరేష్, శ్రీమాన్, ఎఐవైఎఫ్ నేతలు ఆర్.బాలకృష్ణ సత్యప్రసాద్, ధర్మేంద్ర తదితరులను అరెస్ట్ చేశారు.
దోపిడీదారులకు దోచిపెట్టే ప్రభుత్వం : చాడ వెంకట్ రెడ్డి
మోడీ ప్రభుత్వం దోపిడీదారులకు దోచిపెట్టే ప్రభుత్వమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. మోడీ రాజ్యంలో అణగారిన వర్గాలను, పేద ప్రజలను అణిచివేస్తున్నారన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకపోతే వామపక్ష, కలిసొచ్చే లౌకిక పార్టీలతో దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ప్రతి రోజూ పెరుగుతున్న పెట్రోల్,డీజిల్ ధరలతో నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, వాటి ధరల పెరుగుదలకు హద్దులు లేకుండా పోయాయని విమర్శించారు. సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కరోనా మొదటి దశలో కేంద్రం ప్రకటించిన రూ.21లక్షల కోట్ల ప్యాకేజీలో హైదరాబాద్, రాష్ట్ర గ్రామాలకు 21 పైసలు కూడా రాలేదని విమర్శించారు. కేంద్ర మంత్రి నిర్మల సీతరామన్ ప్రకటించిన రూ. 6 లక్షల కోట్ల ప్యాకేజీ కూడా పేదలకు కాదని, పారిశ్రామిక రంగానికి రుణాల కోసమేనని అన్నారు. సిపిఐ(ఎం.ఎల్.-న్యూడెమోక్రసి) రాష్ట్ర నాయకులు పోటురంగారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడుదొంగలుగా మారాయన్నారు.
ఉద్యమాలు ఉధృతం
ప్రజాపక్షం న్యూస్ నెట్‌వర్క్
మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించకపోతే దేశ వ్యాప్తంగా మరింత ఉధృతమైన ఐక్య ఉద్యమాలు చేపడతామని వామపక్ష నాయకులు హెచ్చరించా రు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల జాతీయ కమిటీల పిలుపు మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ‘ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడమే మోడీ చెప్పిన అచ్చేదినా’, పెంచిన ధరలను తగ్గించాలి’ మోడీ ప్రజావ్యతిరేక విధానాలు నశించాలి’ అని ప్లకార్డులను ప్రదర్శించారు. హైదరాబాద్‌లో చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వామపక్ష, ప్రజా, కార్మిక, విద్యార్థి సంఘాల రాష్ట్ర నాయకులు ఇందిరాపార్క్ వద్దకు చేరుకుని, అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకు న్నారు. అప్పటికే ఇందిరాపార్క్ ఇరువైపుల రహదారులను పోలీసులు బారికేడ్లతో మూసివేసి వారిని అడ్డుకోవడంతో ఆందోళనకారులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా వామపక్ష, ప్రజాసంఘాల నేతలు వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొత్తగూడెంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించిన ధర్నాలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్ పాషా పాల్గొన్నారు. ధరలు పెరిగినప్పటికి పాలకులు స్పందించకపోవడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. ఖమ్మంలోని వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో నిర్వహించిన ఆందోళనలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు, సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, సిపిఐ(ఎంఎల్)ఎన్‌డి జిల్లా నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. విపరీతంగా ధరలు పెరుగుతుంటే మోడీ వ్యవహరిస్తున్న తీరు న్యూరో చక్రవర్తిని తలపిస్తుందని బాగం హేమంత్‌రావు విమర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో సిపిఐ శ్రేణులు స్థానిక సిపిఐ కార్యాలయం నుంచి ప్రదర్శనగా వెళ్ళి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి జిల్లా పరిపాలన అధికారికి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలనరసింహ మాట్లాడుతూ ఒకే దేశం ఒకే పన్ను అని గొప్పగా చెప్పిన ప్రధాని మోడీ పెట్రోల్, డీజిల్ ధరలను పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ సంపద అంతా కార్పోరేట్ వర్గాలకు అప్పచెప్తూ పన్నుల భారాన్ని పేద ప్రజలపై మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి పాల్గొన్నారు. కరోన కష్టకాలంలో ప్రజల బాగోగులు చూడాల్సిందిపోయి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని విమర్శించారు.