‘అయోధ్య’ ఆహ్వానానికి తిరస్కృతి
న్యూఢిల్లీ: ఇంకా పూర్తికాని ఆలయానికి హడావుడిగా ప్రాంభోత్సవం ఎందుకని కాంగ్రెస్ ప్రశ్నించింది. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులతో ఆలయాన్ని ప్రారంభింప చేయడాన్ని రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందడానికి జరుగుతున్న ప్రయత్నంగా పేర్కొంది. ఇది రాజకీయ ప్రేరేపితమైన అంశమని వ్యాఖ్యానించింది. ఈనెల 22న జరిగే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా అందిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేతలు సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి సున్నితంగా తిరస్కరించారని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణం పూర్తికాకుండానే రామమందిర ప్రారంభించడానికి కారణాలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. దేశంలో రాముడిని కోట్లాది మంది కొలుస్తారని, మతం అనేది వ్యక్తిగతమైన అంశమని ఆయన స్పష్టం చేశారు. కానీ, అయోధ్య మందిర అంశాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ చాలాకాలంగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నాయని జైరామ్ రమేశ్ విమర్శించారు. రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త నాటకానికి తెరలేపాయని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందాలన్న ఆలోచన లేకపోతే, ఆలయ నిర్మాణం పూర్తికాకముందే ప్రారంభించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. 2019లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును, కొట్లాది మంది ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని, అయోధ్య రామాలయ ట్రస్ట్ పంపిన ఆహ్వానాన్ని ఖర్గే, సోనియా, అధీర్ ఎంతో సున్నితంగా తిరస్కరించారని జైరామ్ రమేశ్ చెప్పారు. ఇది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రనమమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. అయోధ్యలో నిర్మించిన రామమందిర ప్రారంభోత్సవానికి సుమారు 4,000 మంది సాధువులు, 50 మంది విదేశీయులుసహా 6,000 మంది వరకూ హాజరుకానున్నట్టు సమాచారం. హిమాచల్ ప్రదేశ్ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు విక్రమాదిత్య సింగ్ తాను రామాలయ ప్రారంభోత్సవానికి హాజరవుతున్నట్టు ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్ నుంచి వంది మంది వరకూ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి వెళ్లనున్నారు.
పూర్తికాని ఆలయానికి ప్రారంభోత్సవమా? కాంగ్రెస్ ప్రశ్న..
RELATED ARTICLES