HomeNewsBreaking Newsపూడిమడక తీరంలో విషాదం

పూడిమడక తీరంలో విషాదం

సముద్రపు అలలకు కొట్టుకుపోయిన ఏడుగురు విద్యార్థులు
ఒకరు సురక్షితం, ఆరుగురి మృతదేహాలు లభ్యం
అమరావతి :
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని పూడిమడక మొగ వద్ద విషాదం చోటు చేసుకుంది. అనకాపల్లి పట్టణంలోని డైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు శుక్రవారం సముద్రపు అలలకు కొట్టుకుపోయారు. వారిలో ఒక విద్యార్థిని స్థానిక మత్స్యకారులు రక్షించారు. సముద్ర తీరంలో గల్లంతైన
ఇంజినీరింగ్‌ విద్యార్థుల మృతదేహాలన్నీ లభ్యమయ్యాయి. గల్లంతైన వారిలో శనివారం ఐదుగురు, శుక్రవారం ఒకరి మృతదేహం లభ్యమైంది. విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్‌టిఆర్‌ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి దాడి ఇంజినీరింగ్‌ కళాశాల (డైట్‌)లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న 15 మంది విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం కళాశాలలో పరీక్షలు ముగిసిన తరువాత రాంబిల్లి మండలం సీతపాలెం సముద్రతీరానికి వెళ్లారు. విశాఖ నగరంలోని గోపాలపట్నానికి చెందిన కంపర జగదీష్‌, గుంటూరుకు చెందిన బయ్యపునేని సతీష్‌ కుమార్‌, అనకాపల్లి జిల్లా రోలుగుంటకు చెందిన జశ్వంత్‌కుమార్‌, మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజ, ఇదే మండలం చూచుకొండకు చెందిన పెంటకోట గణేష్‌, ఎలమంచిలికి చెందిన పూడి రామచందు, నర్సీపట్నం మండలం పెద్దబొడ్డేపల్లికి చెందిన గుడివాడ పవన్‌ సూర్యకుమార్‌ మరో ఎనిమిది మంది స్నేహితులతో కలిసి తీరానికి చేరుకున్నారు. కొద్దిసమయం సరదాగా గడిపిన తరువాత వీరిలో ఏడుగురు విద్యార్థులు సముద్రంలో స్నానాలకు దిగారు. ఆ సమయంలో రాకాసి అల వీరిని లోపలకు లాక్కుపోయింది. రక్షించాలని ఒడ్డున ఉన్న విద్యార్థులు కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు సూరిశెట్టి తేజ అనే విద్యార్థిని కొన ఊపిరితో ఉండగా కాపాడారు. సూరిశెట్టి తేజ ప్రస్తుతం విశాఖ కె-కెజిహెచ్‌లో చికిత్స తీసుకుంటున్నారు. గల్లంతైన వారిలో గుడివాడ పవన్‌ సూర్యకుమార్‌ (19) మృతదేహం తీరానికి కొట్టుకొచ్చింది. నేవీ హెలికాప్టర్‌, నాలుగు బోట్లతో కోస్ట్‌ గార్డ్‌, మెరైన్‌ పోలీసులు మత్స్యకారుల సహాయంతో మిగతా విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం ఉదయం రెండు హెలికాప్టర్లతో తీరం వద్ద గాలింపు చేపట్టగా నలుగురు విద్యార్థుల మృతదేహాలను గుర్తించారు. నీటిపై తేలియాడుతున్న మృతదేహాలను హెలికాప్టర్‌ ద్వారా ఒడ్డుకు చేర్చారు. శనివారం మధ్యాహ్నం సమయంలో మరో విద్యార్థి జశ్వంత్‌ మృతదేహాన్ని తంతడి తీరంలో గుర్తించారు. దీంతో గల్లంతైన ఏడుగురు విద్యార్థుల్లో ఆరుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒకరు సురక్షితంగా ఉన్నారు. పూడిమడక బీచ్‌ రాంబిల్లి మండలం సీతపాలెం బీచ్‌కు ఆనుకొని ఉంటుంది. ఇక్కడ సముద్ర తీరాన్ని ఆనుకొని కొండ ఉంటుంది. కొండ ఒక వైపు నుంచి సముద్రంలోని నీరు ఉప్పుటేరులోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా ఇక్కడకు పర్యాటకులు ఎవరూ వెళ్లరు. స్థానికంగా కొందరు మత్స్యకారులే ఉంటారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments