కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన
వ్యవసాయ, అనుబంధ రంగాలకు వర్తిస్తుందని వెల్లడి
న్యూఢిల్లీ : ఇకపై ప్రధాన మంత్రి ముద్ర యోజన (పిఎంఎంవై) రుణాలు ఎలాంటి పూచీకత్తు లేకుండానే లభించనున్నాయి. ఈ మేరకు అన్ని బ్యాంకులకు సూచనలు పంపినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రకటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం నాటి ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ వివరణ ఇచ్చారు. అయితే, ఇది వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు మాత్రమే వర్తిస్తుందని నిర్మల స్పష్టం చేశారు. ముద్ర రుణాల కోసం పూచీకత్తుగా తనఖా పెట్టడానికి ఏమీ లేని చిన్నసన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ముద్ర రుణాలు తెలంగాణకు రూ.38,114 కోట్లు
తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకూ పిఎంఎంవై పథకం కింద 38,114 కోట్ల రూపాయల విలువైన ముద్ర రుణాలను మంజూరు చేసినట్టు బిజెపి ఎంపి బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్ సమాధానమిచ్చారు. ఈ మొత్తాన్ని 47,26,819 ఖాతాల్లోకి బదిలీ చేసినట్టు వివరించారు. 37,46,740 మంది రూ.50 వేలలోపు (శిశు పథకం) రుణాలు తీసుకున్నట్లు చెప్పారు. రూ. 5 లక్షల లోపు (కిషోర్ పథకం) రుణాలు తీసుకున్న వారు 7,94,193 మంది ఉన్నారని అన్నారు. 2015 ఏప్రిల్‌లో పిఎంఎంవై పథకం ప్రారంభమైందని, ఇంత వరకూ 15.52 లక్షల కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేశామని వివరించారు. 1,85,886 మందికి రూ.10 లక్షలలోపు (తరుణ్ పథకం) ద్వారా రుణాలు అందచేశామని పేర్కొన్నారు.
పూచీకత్తు లేకుండానే ముద్రా రుణాలు
RELATED ARTICLES