హైదరాబాద్ : పురపాలక ఎన్నికల షెడ్యూల్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ పడింది. మున్సిపల్ పదవులకు రిజర్వేషన్లు నిర్ధారణ చేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడం చెల్లదంటూ టిపిసిసి చీఫ్, నల్లగొండ ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిల్ వేశారు. మున్సిపాలిటీలు 120, వార్డులు 2727, కార్పొరేషన్లు 10, కార్పొరేషన్‌లో వార్డులు 385 చొప్పున ఉన్నాయి. వీటిలో ఓటర్ల జాబితాను కూడా సిద్ధంగా లేకుండానే షెడ్యూల్ వెల్లడించారు. ఈనెల 22న ఎన్నికలు జరిపేస్తామని కూడా ప్రకటించింది. ‘రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే ఎలా షెడ్యూల్ వెల్లడిస్తారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వెల్లడి అయితే ఒక్క రోజు మాత్రమే గడువు ఇచ్చి రిజర్వేషన్లు ప్రకటిస్తామని చెప్పడం అన్యాయం. రిజర్వేషన్ల ప్రకటన తర్వాత ఆయా కేటగిరీల అభ్యర్థులు కుల సర్టిఫికెట్ తీసుకునే గడువు కూడా తగినంత ఉండేలా చేయాలి. ఎలక్షన్ కమిషన్ డిసెంబర్ 23న ఇచ్చిన షెడ్యూల్ చెల్లదని వెల్లడించాలి. దానిని తిరిగి ప్రకటించాలి. అంతకంటే ముందుగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల చైర్మన్లు, వార్డు మెంబర్ల పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. చట్ట ప్రకారం అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిష్కరించే సమయం ఇవ్వాలి. ఎన్నికల షెడ్యూల్ హడావుడిగా వెల్లడించారు. ఇలా చేయడం రాజ్యాంగ వ్యతిరేకం. రీషెడ్యూల్ చేసేలా ఆర్డర్ ఇవ్వాలి. ఇది తేలే వరకూ ఎలక్షన్స్ షెడ్యూల్ అమలును నిలిపేయాలి..’ అని పిల్ హైకోర్టును కోరారు. ఇందులో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ/డైరెక్టర్, స్టేట్ ఎలక్షన్ కమిషన్‌లను ప్రతివాదులుగా చేశారు.
రిజర్వేషన్‌లు, నామినేషన్‌ల మధ్య వారం గడువుండాలి: ఉత్తమ్
ఇదిలా ఉండగా బుధవారం గాంధీభవన్‌లో జర్నలిస్టులతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడు తూ తాము రిజర్వేషన్, నామినేషన్‌ల తేదీల నడుమ వారం రోజుల గడువు కోరుతున్నామని, ఒకవేళ ప్రభుత్వం ఈ రోజే రిజర్వేషన్‌లు ప్రకటించి, గతంలో ప్రకటించిన 8వ తేదీ నుండి నామినేషన్‌లను స్వీకరించినట్లయితే తమకేమి అభ్యంతరం లేదన్నారు. కేవలం ఒక్క రోజులో రిజర్వేషన్‌లను చూసి అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి అవసరమైన పత్రాలను సేకరించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. జనవరి 5న రిజర్వేషన్‌లు ఖరారైన పత్రికల్లో వచ్చి, వార్డుల వారీగా చూసుకునే వరకు 6,7 తేదీలు అవుతుందని, మరుసటి రోజు నుండే నామినేషన్‌లు ప్రారంభమవుతాయన్నారు. తాము రిజర్వేషన్‌ల ఆధారంగా చైర్మన్ అభ్యర్థులను ఎంపిక చేసుకొని, వారికి అనువైన వార్డులను ఎంపిక చేయాల్సి ఉంటుందని, దీనికి పెద్ద కసరత్తు చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే అభ్యర్థులు కూడా కుల ధృవీకరణ పత్రం, నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుందని, ఇది ఒకటి రెండు రోజుల్లో సాధ్యం కాదని చెప్పారు. అలాగే అభ్యర్థులు ఆస్తి పన్ను, నీటి పన్ను కట్టాలని, ఒకవేళ అభ్యర్థి వద్ద డబ్బులు లేకున్నా సమీకరణకు సమయం పడుతుందన్నారు. ఇవ న్నీ పరిగణలోకి తీసుకునే తాము వారం గడవు ఉండాలని కోరుతున్నామని, అంతే తప్ప ఎన్నికలు వాయిదా కోరడం లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు.
‘పుర’ ఎన్నికలపై హైకోర్టుకు కాంగ్రెస్
RELATED ARTICLES